T20 World Cup: టీమ్‌ఇండియా అభిమానికి ఎందుకంత బాధ?

టీమ్‌ఇండియా.. పదినెలల క్రితం కఠినమైన ఆస్ట్రేలియా పిచ్‌లపై ప్రతికూల పరిస్థితుల్లో ఏమాత్రం అనుభవంలేని ఆటగాళ్లతో చారిత్రక సిరీస్‌ గెలిచింది...

Updated : 16 Nov 2021 16:08 IST

ఐపీఎల్‌ బ్యాన్‌ చేయాలంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు..

వీరులు.. శూరులు.. ధీరులు అంటూ ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు భారత జట్టును అందరూ పొగిడేశారు. మీరు కూడా ఇలాంటి మాటలు వినే ఉంటారు. అనే ఉంటారు కూడా. అయితే ఇప్పుడు ఆటలో ప్రదర్శన చూస్తే... ఇన్నాళ్లూ మనం పొగిడింది ఈ జట్టునా, అసలు ఇది మనం చూసిన టీమ్‌ఇండియా యేనా అని బాధపడుతున్నారు. అసలు ప్రపంచకప్‌ ముందు కోహ్లీ సేన ఆట ఎలా సాగింది, ఇప్పుడు ఎలా ఉంది, మనవాళ్లు స్థాయికి తగ్గ ఆట ఆడుతున్నారా... ఓ సగటు అభిమాని మనోగతం ఏంటి? ఓసారి చూద్దాం!

టీమ్‌ఇండియా.. పదినెలల క్రితం కఠినమైన ఆస్ట్రేలియా పిచ్‌లపై... ప్రతికూల పరిస్థితుల్లో ఏమాత్రం అనుభవంలేని ఆటగాళ్లతో చారిత్రక సిరీస్‌ గెలిచింది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌటై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆ జట్టు తర్వాత కసిగా ఆడి అందరి నోళ్లూ మూయించింది. కట్‌చేస్తే.. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్‌ మళ్లీ ఘోరంగా విఫలమైంది. తర్వాత అహ్మదాబాద్‌లో వరుస విజయాలు సాధించి సిరీస్‌ కైవసం చేసుకుంది. దీంతో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లు తయారు చేయించి గెలిచిందంటూ ఇంగ్లాండ్‌ మాజీల విమర్శలు. కట్‌చేస్తే.. ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లిన టీమ్‌ఇండియా ఐదు టెస్టుల సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడింది. ఒక మ్యాచ్‌ డ్రా చేసుకొని రెండు విజయాలు సాధించి సిరీస్‌ కైవసం చేసుకున్నంత పనిచేసింది. దీంతో సీమ్‌ బౌలింగ్‌కు అనుకూలించే ఇంగ్లాండ్‌ గడ్డపైనా రాణించగల సత్తా ఉందని మరోసారి నిరూపించుకుంది. ఇంగ్లాండ్‌ మాజీల ముఖాలు తెల్లబోయేలా చేసింది.

ఐపీఎల్‌ అయ్యాక...

అక్కడి నుంచి టీమ్‌ఇండియా నేరుగా యూఏఈలో అడుగుపెట్టింది. టీ20 ప్రపంచకప్‌ జరగబోయే ఎడారి గడ్డపైనే ఐపీఎల్‌ 14వ సీజన్‌లోని రెండో దశ జరిగింది. ఇక్కడ భారత ఆటగాళ్లంతా (ఇద్దరు, ముగ్గురు మినహా) ప్రతి ఒక్కరూ సత్తా చాటిన వాళ్లే. కట్‌చేస్తే ధోనీ సారథ్యంలో చెన్నై విజేతగా నిలిచింది. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ జట్టుకు అతడిని మెంటార్‌గా తీసుకొచ్చారు. ఈ నిర్ణయం సగటు భారత అభిమానికి ఎంతో సంతోషం కలిగించింది. ప్రపంచ క్రికెట్‌లోనే ఆటను అర్థం చేసుకోవడంలో మహీకి మించిన ఆటగాడు లేడు అంటుంటారు క్రికెట్‌ పండితులు. అతడి ప్రణాళికలకు బిత్తరపోని జట్టు లేదు. అలాంటప్పుడు ఎవరైనా టీమ్‌ఇండియానే కప్పు సాధిస్తుందని అనుకుంటారు. అలాగే అనుకున్నారు కూడా. ఇక్కడ సీన్‌ కట్‌చేస్తే.. పాకిస్థాన్‌తో తొలి ఓటమి. అయినా తొలి మ్యాచే కదా.. అన్నిసార్లూ మనమే గెలవడం సాధ్యం కాదు కదా.. పాక్‌ ఆటగాళ్లు బాగా ఆడారు. మనోళ్లు ఒత్తిడికి గురయ్యారు అని అనుకున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ గత అనుభవాల నేపథ్యంలో తిరిగి బలంగా పుంజుకుంటారని, ఇకపై వరుస విజయాలతో మెగా ఈవెంట్‌లో దూసుకుపోతారనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.

రెండూ... చెత్త ప్రదర్శనలే!

కానీ, అందరి ఆశలు అడియాసలు చేస్తూ.. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మా అసలు ప్రదర్శన ఇదే అనే విధంగా కోహ్లీసేన ఆడింది. డాట్‌ బాల్స్‌ 54.. బౌండరీ లేకుండా 74 బంతులు ఆడారంటే మనవాళ్ల పోరాటం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది టీ20 ప్రపంచకప్‌ అనుకున్నారా..?లేక ఏదో టైమ్‌ పాస్‌ మ్యాచ్‌ ఆడుతున్నామని భావించారా? అసలు ఇలాంటి ప్రదర్శన చూసి కోహ్లీసేన ఏమనుకుంటోందో తెలియదు కానీ.. సగటు అభిమాని మాత్రం దారుణంగా బాధపడ్డాడు. నిరాశ చెందాడు. ఒకటి కాదు.. రెండు కాదు..  ఏకంగా ఎనిమిదేళ్లు.. ఆరు ఐసీసీ టోర్నీలు జరగ్గా.. ఒక్కటీ నెగ్గలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది. కాదు.. కాదు.. దారుణంగా విఫలమైంది.

అభిమాని మాటలు...

కోహ్లీ సారథ్యం... అందులోనూ ధోనీ మార్గదర్శకత్వం... రవిశాస్త్రి కోచింగ్‌... ఇలా ఇన్ని రకాల బుర్రలు ఉన్న జట్టు పైనల్‌కి వెళ్లడం పక్కా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆట చూస్తే.. క్వాలిఫైయర్లు ఆడి సూపర్‌ 12కి వచ్చిన జట్టు కంటే తక్కువ ప్రదర్శన చేస్తోంది. 11 మంది స్టార్‌ ప్లేయర్లున్న జట్టు ఇలా ఆడుతుంటే అభిమాని కడుపు రగలదా. సగటు అభిమానికి సహజంగానే కోపం వస్తుంది. అందుకే ఆగ్రహానికి గురయ్యాడు. తనకు తెలిసిన దారిలో... అంటే సామాజిక మాధ్యమాల్లో నిరసన తెలిపాడు. అది ఎంతగా పెరిగింది అంటే... ఎంతో అభిమానించి, రోజుల తరబడి ఆదరించిన ఐపీఎల్‌ను ఏకంగా బ్యాన్‌ చెయ్యాలంటూ పోస్టులు పెట్టేంత. ప్రస్తుతం ట్విటర్‌లో #BANIPL అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉందంటే కోహ్లీ సేన ఏస్థాయి ప్రదర్శన చేసిందో అర్థం చేసుకోవచ్చు. భారత జట్టు చెత్త ప్రదర్శనకు కారణం ఐపీఎల్‌యేనా, ఇంకేం కారణాలు కనిపించడం లేదా అనే ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. అయితే ఐపీఎల్‌ వల్ల శారీరక శ్రమ ఎక్కువై... కీలక టోర్నీలకు అందులోనూ ప్రతిష్ఠాత్మక ఐసీసీ టోర్నీలకు వచ్చేసరికి మన సింహాలు చతికిలపడుతున్నాయి. గతంలోనూ ఇది జరిగింది, ఇప్పుడూ జరుగుతోంది. అందుకే అభిమాని ఆగ్రహం ఐపీఎల్‌ మీద పడింది. టీమ్‌ఇండియా గెలిచినప్పుడు అభినందించడం, సంతోషించడం ఎంత సహజమో.. వైఫల్యాలు ఎదురైనప్పుడు విమర్శించడం, లోపాలు ఎత్తి చూపడం అంతే సహజం. ఇకనైనా టీమ్‌ఇండియా మేలుకోవాలి. వచ్చే ఏడాదైనా ఏం చేస్తుందో చూడాలి.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని