IND vs NZ: వరుణ్‌ చక్రవర్తి స్థానంలో అశ్విన్‌కు అవకాశం: బంగర్

టీమ్‌ఇండియా మరికొద్దిసేపట్లో న్యూజిలాండ్‌తో తలపడే కీలకపోరులో యువస్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి బదులు సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు అవకాశం...

Updated : 16 Nov 2021 15:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మరికొద్దిసేపట్లో న్యూజిలాండ్‌తో తలపడే కీలకపోరులో యువస్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి బదులు సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు అవకాశం ఇవ్వొచ్చని మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ అభిప్రాయపడ్డారు. తాజాగా ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు పాకిస్థాన్‌తో తలపడిన తొలి మ్యాచ్‌లో వరుణ్‌ విఫలమైన సంగతి తెలిసిందే. మరోవైపు న్యూజిలాండ్‌ జట్టు పాకిస్థాన్‌తోనూ ఓటమిపాలవ్వడంతో ఈ మ్యాచ్‌ రెండు జట్లకూ కీలకంగా మారింది. అలాంటప్పుడు భారత జట్టు అనుభవం లేని వరుణ్‌ కన్నా అశ్విన్‌కే చోటిచ్చే అవకాశం ఉందని సంజయ్‌ వివరించాడు.

యూఏఈలో ఇటీవల వరుణ్‌ ప్రదర్శన ఏమంత ఆకట్టుకునేలా లేదని, అతడు షార్జాలో ప్రభావం చూపినంత దుబాయ్‌లో చూపలేకపోతున్నాడని బంగర్‌ పేర్కొన్నాడు. మరోవైపు ఇది టీమ్‌ఇండియాకు చావోరేవో లాంటి మ్యాచ్‌ అయిన నేపథ్యంలో కచ్చితంగా సీనియర్‌ స్పిన్నర్‌కే అవకాశం దక్కొచ్చనే నమ్మకం ఉంచాడు. కాగా, పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బౌలర్లు ఒక్క వికెట్‌ కూడా సాధించకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భువనేశ్వర్‌కుమార్‌ను తొలగించి శార్దూల్‌ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకోవాలనే అభిప్రాయాలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా కచ్చితంగా మార్పులతోనే బరిలోకి దిగేలా కనిపిస్తోంది. మరి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఏం చేస్తాడో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని