
Team India: షమి కన్నా మంచి బౌలర్లు ఉన్నారు: మంజ్రేకర్
ఇంటర్నెట్‌డెస్క్: క్రికెట్లో సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుపేరున్న సంజయ్ మంజ్రేకర్ మరోసారి బాంబు పేల్చాడు. ఈసారి ఏకంగా టీమ్ఇండియా ప్రధాన పేసర్లలో ఒకడైన మహ్మద్ షమిపై తన నోటికి పనిచెప్పాడు. టీమ్ఇండియా టీ20 జట్టును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, కొందరు ఆటగాళ్లు ఇతర ఫార్మాట్లకు సరిపోతారేమో చూడాలని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. శుక్రవారం భారత్.. స్కాట్లాండ్తో తలపడే ముందు ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ అతడీ వ్యాఖ్యలు చేశాడు.
‘టీమ్ఇండియా టీ20 జట్టును ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందని నేను అనుకుంటున్నా. జట్టులోని కొంతమంది ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి వాళ్లు ఇతర ఫార్మాట్లకు సరిపోతారేమో చూడాలి. ఈ జట్టులోని కొంత మంది ఆటగాళ్లు ఏదైనా ఒకే ఫార్మాట్లో బాగా ఆడొచ్చని నా అభిప్రాయం. అందులో నాకు కనిపించే ఆటగాడు మహ్మద్ షమి. అతడో మేటి పేసర్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. టెస్టుల్లో అత్యుత్తమంగా రాణించడం కూడా మనం చూశాం. అయితే, టీ20ల్లో గత మ్యాచ్‌లో అతడి ఎకానమీ 9గా ఉండటం నేను గమనించాను. అతడు అఫ్గానిస్థాన్‌పై అత్యుత్తమ ప్రదర్శన చేసిన సంగతి నాకూ తెలుసు. కానీ.. పొట్టి ఫార్మాట్లో భారత్‌కు షమి కన్నా కాస్త మెరుగైన బౌలర్లు ఉన్నారు’ అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.