IND vs PAK: పాక్‌తో మ్యాచ్‌.. ఇప్పుడు భారత్‌లో నిర్వహించడం కష్టం: గంగూలీ

ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్‌తో టీమ్‌ఇండియా మ్యాచ్‌ను భారత్‌లో నిర్వహించడం కష్టమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అన్నాడు...

Published : 23 Oct 2021 11:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్‌తో టీమ్‌ఇండియా మ్యాచ్‌ను భారత్‌లో నిర్వహించడం కష్టమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అన్నాడు. 2021 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దాయాది జట్లు ఆదివారం దుబాయ్‌లో పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ కీలక మ్యాచ్‌కు ముందు అక్కడ నిర్వహిస్తున్న ‘సలాం క్రికెట్‌’ కార్యక్రమంలో ఇరు జట్లలోని మాజీ ఆటగాళ్లు పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. తాజాగా టీమ్‌ఇండియా మాజీ సారథి గంగూలీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘పాకిస్థాన్‌తో టీమ్‌ఇండియా ప్రపంచకప్‌లలో మ్యాచ్‌లు ప్రారంభించడం ఇదేం తొలిసారి కాదు. గతంలో పలుమార్లు ఇలాగే తొలిపోరులో తలపడింది. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీలోనూ పాకిస్థాన్‌తో ప్రారంభించి ఫైనల్లోనూ ఎదుర్కొంది. ఇదిలాగే కొనసాగుతుంది. ఎందుకంటే భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే ప్రతి ఒక్కరికీ అమితాసక్తి. పాక్‌తో మ్యాచ్‌ అంటే ఒత్తిడి బాగా ఉంటుందని కొందరు అంటుంటారు. నేనైతే అలా ఎప్పుడూ భావించలేదు. బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు తొలిసారి అధ్యక్షుడయ్యాక 2016 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను ఈడెన్‌గార్డెన్స్‌లోనే నిర్వహించాం. అప్పుడు కూడా ఏమాత్రం ఒత్తిడి లేదు. అయితే, ఇప్పుడు ఈ మ్యాచ్‌ను భారత్‌లో నిర్వహించడం చాలా కష్టం. ఎందుకంటే టికెట్లకు భారీ డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి కన్నా ఇక్కడ (దుబాయ్‌) నిర్వహించడమే మేలు. ఇక్కడంత ప్రభావం ఉండదు’ అని గంగూలీ వివరించాడు.

అనంతరం ప్రపంచకప్‌ టోర్నీల్లో దాయాది జట్టుపై భారత్‌ దిగ్విజయంగా కొనసాగడంపై స్పందించిన దాదా.. కొన్నేళ్లుగా భారత్‌ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోందని, వరుస విజయాలతో మంచి రికార్డు కలిగి ఉందని మెచ్చుకున్నాడు. పాకిస్థాన్‌ ఒకప్పుడు చాలా బలమైన జట్టని, ఇప్పుడు టీమ్ఇండియా మరింత శక్తిమంతంగా తయారైందని చెప్పాడు. టీమ్‌ఇండియా క్రికెట్‌లో ఒక ప్రణాళిక బద్ధమైన కార్యాచరణ కొనసాగుతోందని, దీంతో మేటి ఆటగాళ్లను తయారు చేస్తున్నట్లు తెలిపాడు. ప్రతి ఒక్కరూ మంచి గుర్తింపు రావాలని కోరుకుంటారని, దీంతో పట్డుదలగా రాణిస్తున్నారని పేర్కొన్నాడు. జట్టులో ఆరోగ్యకరమైన పోటీ నెలకొందని గంగూలీ అభిప్రాయపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు