IND vs NZ: భారత్‌ గెలవాలంటే అలా చేయాలి..

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. సెమీస్‌ రేసులో నిలవాలంటే ఇకపై అన్ని మ్యాచ్‌లూ...

Updated : 31 Oct 2021 11:45 IST

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. సెమీస్‌ రేసులో నిలవాలంటే ఇకపై అన్ని మ్యాచ్‌లూ తప్పక గెలవాలి. ఈ క్రమంలోనే మరికొన్ని గంటల్లో న్యూజిలాండ్‌తో చావోరేవో తేల్చుకోనుంది. అయితే, ఇక్కడో విషయం ఇప్పుడు భారత అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అదే.. గత 18 ఏళ్లుగా ఐసీసీ టోర్నీల్లో టీమ్‌ఇండియాపై కివీస్‌కు ఎదురులేకపోవడం. ఈసారి కూడా ఆ జట్టు విజయం సాధిస్తే ఇక కోహ్లీసేన సెమీస్‌ ఆశలు గల్లంతైనట్లే. ఈ నేపథ్యంలో ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే భారత్‌ ముందు ఓ మంచి ఉపాయం ఉంది. అదే.. గతేడాది న్యూజిలాండ్‌ పర్యటనలోని ఐదు టీ20ల సిరీస్‌ను గుర్తుచేసుకోవడం. అప్పుడు కివీస్‌పై ఎలా గెలిచారో భారత ఆటగాళ్లు ఒక్కసారి గుర్తు చేసుకుంటే జట్టులో నూతనోత్తేజం కలిగే అవకాశం ఉంది. అసలు అప్పుడు ఏం జరిగింది.. టీమ్‌ఇండియా ఏం చేసిందనే విషయాలు తెలుసుకుందాం..

ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అదే.. 

గతేడాది టీమ్‌ఇండియా ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సుదీర్ఘ పర్యటన కోసం న్యూజిలాండ్‌లో అడుగుపెట్టింది. అయితే, పొట్టి సిరీస్‌లో చెలరేగిన భారత జట్టు తర్వాత వన్డేల్లో, టెస్టుల్లో వరుస ఓటములు చవిచూసింది. కానీ, టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడమే ఇప్పుడు టీమ్‌ఇండియాకు కలిసొచ్చే అంశం. ఈ సిరీస్‌లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ ఒకరు విఫలమైనా మరొకరు జట్టును ఆదుకున్నారు. ఆపై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సందర్భోచితంగా పరుగులు చేసి జట్టుకు అద్భుత సిరీస్‌ కైవసం చేశారు.

రెండుసార్లు రాహులే..

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. టాప్‌ఆర్డర్‌ మొత్తం గప్తిల్‌ (30), మన్రో (59), కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (51), రాస్‌ టేలర్‌ (54) రాణించారు. దీంతో భారత్‌ ముందు పెద్ద లక్ష్యమే నిర్దేశించారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 19 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరింది. ఓపెనర్‌ రోహిత్‌ (7) విఫలమైనా రాహుల్‌ (56), కెప్టెన్‌ కోహ్లీ (45), శ్రేయస్‌ అయ్యర్‌ (58) దంచికొట్టారు. దీంతో భారత్‌ సిరీస్‌లో శుభారంభం చేసింది.

ఇక రెండో మ్యాచ్‌లోనూ తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ ఈసారి 132/5 తక్కువ స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే ఓపెనర్లు గప్తిల్‌ (33), మన్రో (26)తో పాటు వికెట్‌ కీపర్‌ సీఫర్ట్‌ (33*) కాసిన్ని పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోరైనా సాధించింది. ఇక స్వల్ప ఛేదనలో రోహిత్‌ (8), కోహ్లీ (11) విఫలమైనా రాహుల్‌ (57*), శ్రేయస్‌ అయ్యర్‌ (44) మ్యాచ్‌ను గెలిపించారు.

ఇది సూపర్‌ గేమ్‌..

ఇక తొలి రెండు మ్యాచ్‌ల్లో సాధించిన విజయాలతో జోరుమీదున్న కోహ్లీసేన తర్వాతి రెండు మ్యాచ్‌లను సూపర్‌ ఓవర్లో కైవసం చేసుకోవడం మరో విశేషం. మూడో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా ఐదు వికెట్ల నష్టానికి 179/5 స్కోర్‌ చేసింది. రోహిత్‌ (65) ఈసారి చెలరేగి ఆడాడు. అతడికి రాహుల్‌ (27), కోహ్లీ (38)ల నుంచి మంచి సహకారం లభించింది. దీంతో చివరికి న్యూజిలాండ్‌ ముందు మంచి లక్ష్యమే నిర్దేశించింది. అయితే, అప్పటికే రెండు ఓటములపాలైన న్యూజిలాండ్‌ ఈసారి పట్టుదలగా ఆడింది. బ్యాటింగ్‌లో గప్తిల్‌ (31), మన్రో (14) విఫలమైనా విలియమ్సన్‌ (95) వేటాడాడు. 48 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు సంధించి జూలు విదిల్చాడు. అయితే, చివరికి ఆ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 179 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్‌ టైగా మారి సూపర్‌ ఓవర్‌కు దారితీసింది.

* ఇక్కడ బుమ్రా వేసిన సూపర్‌ ఓవర్‌లో కివీస్‌ ఆటగాళ్లు విలియమ్సన్‌, గప్తిల్‌ ధాటిగా ఆడి 17 పరుగులు సాధించారు. అనంతరం రోహిత్‌, రాహుల్‌ బ్యాటింగ్‌కు వచ్చి నెమ్మదిగా ఆడారు. తొలి నాలుగు బంతుల్లో 8 పరుగులే చేశారు. ఇక చివరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరమైన వేళ హిట్‌మ్యాన్‌ రెండు సిక్సులు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో టీమ్‌ఇండియా 3-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది.

ఇది డబుల్‌ సూపర్‌.. 

టీమ్‌ఇండియా నాలుగో మ్యాచ్‌ ముందే సిరీస్‌ కైవసం చేసుకోగా ఇక క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌లోనూ తొలుత బ్యాటింగ్‌ చేసిన కోహ్లీసేన 165/8 మంచి స్కోరే సాధించింది. ఈసారి రోహిత్‌ విశ్రాంతి తీసుకోగా రాహుల్‌ (39)తో కలిసి ఓపెనర్‌గా వచ్చిన సంజూ శాంసన్‌ (8) విఫలమయ్యాడు. ఆపై కోహ్లీ (11), శ్రేయస్‌ (1), శివమ్‌ దూబె(12) సైతం పరుగులు చేయలేకపోయారు. మనీశ్‌ పాండే (50) చివరివరకూ క్రీజులో ఉండి జట్టుకు పోరాడే స్కోర్‌ అందించాడు. అయితే, ఛేదనలో గప్తిల్‌ (4) విఫలమైనా మన్రో (64), సీఫర్ట్‌ (57) దంచికొట్టారు. మధ్యలో రాస్‌టేలర్‌ (24) కాసిన్ని పరుగులు చేశాడు. చివరికి మ్యాచ్‌ టైగా మారి వరుసగా రెండో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు చేరింది.

* ఇక మరోసారి సూపర్‌ ఓవర్‌లో బౌలింగ్‌ చేసిన బుమ్రా 13 పరుగులిచ్చాడు. సీఫర్ట్‌, మన్రో ధాటిగా ఆడారు. అనంతరం రాహుల్‌, కోహ్లీ బ్యాటింగ్‌ చేసి జట్టుకు మరో విజయం ఖాయం చేశారు. రాహుల్‌ ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌ బాదగా, కోహ్లీ ఒక బౌండరీ బాదాడు.

ఐదో మ్యాచ్‌తో క్లీన్‌స్వీప్‌..

చివరగా టీమ్‌ఇండియా ఐదో టీ20లోనూ మొదట బ్యాటింగ్‌ చేసి మూడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. రాహుల్‌ (45), రోహిత్‌ (60), శ్రేయస్‌ అయ్యార్‌ (33) రాణించారు. అనంతరం సీఫర్ట్‌ (50), రాస్‌టేలర్‌ (53) అర్ధశతకాలతో రాణించినా మిగతా బ్యాట్స్‌మెన్‌ తేలిపోవడంతో చివరికి న్యూజిలాండ్‌ 156/9 స్కోరుకు పరిమితమైంది. దీంతో టీమ్‌ఇండియా ఏడు పరుగులతో విజయం సాధించి 5-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది.

టీమ్‌ఇండియా గమనించాల్సిన విషయం..

ఈ సిరీస్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ ఒకరు కాకపోయినా మరొకరు పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు. కీలక సమయాల్లో దంచికొట్టి ఆధిపత్యం ప్రదర్శించారు. క్లిష్టపరిస్థితుల్లోనూ సమష్టిగా రాణించారు. ఒత్తిడి ఎదురైన వేళ ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు. మరోవైపు బౌలింగ్‌లో శార్దూల్‌ ఠాకూర్‌, జస్ప్రిత్‌ బుమ్రా, షమి కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టు విజయాల్లో తమవంతు పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా ఆటగాళ్లు ఇప్పుడు ప్రపంచకప్‌లోనూ అలాంటి పట్టుదలే ప్రదర్శిస్తే కివీస్‌తో పోరులో ఢోకా ఉండదు. కోహ్లీసేన ఆ సిరీస్‌ను గుర్తుచేసుకొని ఇకపై ఐసీసీ టోర్నీల్లో కివీస్‌కు చెక్‌ పెట్టాలని ఆశిద్దాం.. ఆల్‌ ది బెస్ట్‌ టీమ్‌ఇండియా..!

ఇంటర్నెట్‌డెస్క్‌..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని