
Tim Paine: ఎంత వద్దనుకున్నా అసభ్య సందేశాలు బయటకొస్తాయని తెలుసు: పైన్
ఇంటర్నెట్‌డెస్క్: తాను ఎంత వద్దనుకున్నా తన సహచర ఉద్యోగికి పంపిన అసభ్యకర సందేశాలు ఎప్పుడైనా బయటకు వస్తాయని తెలుసని ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్ మాజీ కెప్టెన్ టిమ్‌పైన్ అన్నాడు. తాజాగా అతడు ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించాడు. తొలుత ఈ వివాదం సమసిపోయిందని భావించినా.. పెద్ద సిరీస్‌లు లేదా తమ క్రికెట్ సీజన్ మొదలయ్యేముందు ప్రతిసారీ ఈ వివాదం తన దృష్టికి వస్తూనే ఉందన్నాడు. తన సందేశాలకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయంటూ కొన్ని మీడియా సంస్థలు తరచూ హెచ్చరించేవని స్పష్టం చేశాడు. అయితే, వాళ్లు ఎప్పుడూ దీనిపై వార్తలు ప్రసారం చేయకపోయినా.. ఎప్పుడైనా ఈ వివాదం బయటకు పొక్కుతుందనే విషయం తనకు ముందే తెలుసని చెప్పుకొచ్చాడు.
ఇదంతా తాను టెస్టు కెప్టెన్సీ చేపట్టక కొన్ని నెలల ముందు జరిగిందని, అది తమ ఇద్దరి అంగీకారంతో జరిగిన వ్యవహారమని పైన్ వివరించాడు. అప్పుడు తన కెప్టెన్సీకి ఇది సమస్యగా పరిణమిస్తుందనే విషయం గురించి ఆలోచించలేదన్నాడు. కాగా, 2018లో స్టీవ్‌స్మిత్ బాల్ టాంపరింగ్ వ్యవహారంలో నిషేధానికి గురయ్యాక పైన్ ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతడు 2019లో ఇంగ్లాండ్‌లో జరిగిన యాషెస్ సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకున్నా.. భారత్‌తో అంతకుముందు, ఆ తర్వాత స్వదేశంలో ఆడిన రెండు బోర్డర్-గావస్కర్ ట్రోఫీలను కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అసభ్యకర సందేశాల వివాదం తెరపైకి రావడంతో అతడు ఇటీవల కెప్టెన్సీని వదులుకున్నాడు. చివరగా రాబోయే యాషెస్ సిరీస్‌లో ఒక ఆటగాడిగా ఆసీస్ జట్టులో కొనసాగాలని ఉందని, ట్రోఫీ సాధించి ఘనంగా ముగింపు పలకాలని భావిస్తున్నానని పైన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
► Read latest Sports News and Telugu News