Bajrang Punia: దాని వల్లే ఒలింపిక్స్‌ సన్నద్ధత దెబ్బతింది.. 25 రోజులు ఆడలేకపోయా

టోక్యో ఒలింపిక్స్‌కు ముందు సుమారు 20-25 రోజులు ప్రాక్టీస్‌ చేయలేదని, ఆ సమయంలో కాలికి గాయమవ్వడం వల్లే ఈ విశ్వక్రీడలకు సరిగా సాధన చేయలేకపోయానని కాంస్య పతక విజేత బజరంగ్‌ పూనియా స్పష్టం చేశాడు...

Published : 08 Aug 2021 18:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టోక్యో ఒలింపిక్స్‌కు ముందు సుమారు 20-25 రోజులు ప్రాక్టీస్‌ చేయలేదని, ఆ సమయంలో కాలికి గాయమవ్వడం వల్లే ఈ విశ్వక్రీడలకు సరిగా సాధన చేయలేకపోయానని కాంస్య పతక విజేత బజరంగ్‌ పూనియా వెల్లడించాడు. ఆదివారం మీడియాతో మాట్లాడిన అతడు ఒలింపిక్స్‌కు ముందు ఏం జరిగిందో వివరించాడు. ఈ ఒలింపిక్స్‌కు ముందు తనకు చివరి ర్యాంకింగ్‌ ఈవెంట్‌గా పొలాండ్‌ ఓపెన్‌ టోర్నీ ఉందని, కానీ తనకు పాయింట్ల కన్నా ప్రాక్టీసే ముఖ్యమని భావించినట్లు చెప్పాడు. ఈ క్రమంలోనే రష్యాకు వెళ్లి అక్కడ సాధన చేసినట్లు పేర్కొన్నాడు. అయితే, బజరంగ్‌ అక్కడ ఒలింపిక్స్‌ కోసం సన్నద్ధమవుతున్న సమయంలోనే ఒకానొక సందర్భంలో గాయపడ్డాడు. అతడి మోకాలికి గాయమై మూడు వారాలకు పైగా మ్యాట్‌ మీదకు వెళ్లలేదని తెలిపాడు. అదే తన ఒలింపిక్స్‌ సన్నద్ధతను దెబ్బతీసిందని వివరించాడు.

‘నేను సుమారు 25 రోజుల మ్యాట్‌ ట్రెనింగ్‌ చేయలేకపోయా. ఆ గాయం తర్వాత సరిగా పరుగెత్తలేకపోయాను. ఒలింపిక్స్‌ లాంటి ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌కు ముందు ఒక్క రోజు శిక్షణ పొందకున్నా మంచిదికాదు. ఈ క్రమంలోనే నొప్పితో ఉన్న నేను కాంస్య పోరులో మోకాలికి టేప్‌ కట్టుకొని ఆడాలని నా కోచ్‌, వైద్య సిబ్బంది సూచించారు. కానీ, అలా చేస్తే నాకు సఖ్యతగా ఉండదు. కాళ్లకు ఏదో కట్టేసినట్లు ఉంటుంది. దాంతో నేను వారికి ఒకే విషయం చెప్పాను. నాకు మరింత గాయమైనా తర్వాత విశ్రాంతి తీసుకుంటా. కానీ, ఇప్పుడు పతకం గెలవకపోతే ఇన్నాళ్లూ పడిన శ్రమ వృథా అవుతుందని వివరించా. అలా కీలక పోరులో విజయం సాధించి పతకం సాధించా’ అని బజరంగ్‌ పేర్కొన్నాడు.

అలాగే నేను రష్యాలో గాయపడినప్పుడు కూడా భారత వైద్యులు స్వదేశానికి తిరిగి రావాలని కోరారు. కానీ, అదేమీ కుదరదని నేను తేల్చిచెప్పా. ఒకవేళ వచ్చినా ప్రయాణంలో వైరస్‌ సోకే ప్రమాదముందని తెలిపా. దాంతో రష్యాలో ఉంటూనే గాయం నుంచి కోలుకున్నా. ఆ సమయంలో నాకు కావాల్సిన సదుపాయాలన్నీ అక్కడి భారత రాయబారి కార్యాలయం నుంచి అడిగి సమకూర్చుకున్నా’ అని పూనియా వివరించాడు. అయితే, పోలాండ్‌ ఓపెన్‌ కాదని రష్యాలో ఎందుకు పోటీపడ్డారని ప్రశ్నించగా.. గాయాలు ఎక్కడైనా అవుతాయని, చాలా మటుకు ప్రాక్టీస్‌ సెషన్‌లోనే చోటుచేసుకుంటాయని ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సమాధానమిచ్చాడు. ఒలింపిక్స్‌కు ముందు తాను ఏ స్థితిలో ఉన్నాననే విషయం తెలుసుకునేందుకే అక్కడికి వెళ్లినట్లు స్పష్టం చేశాడు. చివరగా ఈసారి కోల్పోయిన స్వర్ణ పతకాన్ని పారిస్‌ ఒలింపిక్స్‌లో సాధిస్తానని చెప్పాడు. ఇప్పుడు తన లోపాలపై దృష్టిసారించి వచ్చే ఒలింపిక్స్‌లో టాప్‌లో నిలుస్తానన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని