PV Sindhu: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధు

ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ విభాగంలో తెలుగు తేజం పీవీ సింధు కాంస్య పతకం సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో హోరాహోరీగా సాగి పోరులో సింధు స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది...

Updated : 01 Aug 2021 19:11 IST

టోక్యో: ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ విభాగంలో తెలుగు తేజం పీవీ సింధు కాంస్య పతకం సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో హోరాహోరీగా సాగి పోరులో సింధు స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. వరుస గేమ్స్‌లో 21-13, 21-15 తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆమె రెండో పతకం అందించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు.. తాజా ఒలింపిక్స్‌లో కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలోనే శనివారం జరిగిన సెమీస్‌ పోరులో చైనీస్‌ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్‌ చేతిలో 18-21, 12-21తేడాతో ఓటమిపాలైంది. ఇక ఆదివారం కాంస్యం కోసం జరిగిన మరో ఆసక్తికర పోరులో బింగ్జియావోపై సింధు ఘన విజయం సాధించింది. దాంతో వరుసగా రెండుసార్లు ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా సింధు కొత్త రికార్డు సృష్టించింది.

ఈ మ్యాచ్‌లో సింధు ఆది నుంచి పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి గేమ్‌లో విరామ సమయానికి 11-8తో నిలిచిన భారత షట్లర్‌ తర్వాత మరింత దూకుడుగా ఆడి ప్రత్యర్థిని కట్టడి చేసింది. వరుసగా పాయింట్లు సాధిస్తూ చైనా క్రీడాకారిణిని ఒత్తిడిలోకి నెట్టింది. ఈ క్రమంలోనే తొలి గేమ్‌ను 21-13తో కైవసం చేసుకుంది. ఇక రెండో గేమ్‌ ప్రారంభమైనప్పుడు కూడా సింధూనే దూకుడు ప్రదర్శించింది. మధ్యలో బింగ్జియావో గట్టిగా పోరాడేందుకు చూసినా సింధు ఆధిక్యంలోకి వెళ్లనివ్వలేదు. దాంతో విరామ సమయానికి మళ్లీ 11-8తో నిలిచింది. ఈ క్రమంలోనే చివరి వరకూ ఉత్కంఠగా సాగిన పోరులో తెలుగు తేజం 21-15తో విజయం సాధించింది. దాంతో వరుసగా రెండు ఒలింపిక్స్‌ల్లోనూ వ్యక్తిగత పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని