Tokyo Olympics: రజతంతో మెరిసిన రవి దహియా

ఒలింపిక్స్‌లో భారత పతాకం మరోసారి రెపరెపలాడింది. పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్‌ రెజ్లింగ్‌ విభాగంలో రవి కుమార్‌ దాహియా ఓటమిపాలయ్యాడు. అయినా అతడు రజతంతో మెరిశాడు...

Updated : 05 Aug 2021 18:28 IST

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత పతాకం మరోసారి రెపరెపలాడింది. పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్‌ రెజ్లింగ్‌ ఫైనల్స్‌లో బంగారు పతకం సాధిస్తాడని ఆశించిన రవి కుమార్‌ దహియా తుదిపోరులో రష్యాకు చెందిన యుగేవ్‌ జావుర్‌ చేతిలో 4-7 తేడాతో ఓటమిపాలయ్యాడు. దాంతో ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి రజతం సాధించిన అథ్లెట్‌గా ప్రత్యేక గుర్తింపు సాధించాడు. రవి ఫైనల్స్‌లో ఓటమిపాలైనా తన పోరాట పటిమతో అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడు. ఇక 2012 తర్వాత పురుషుల రెజ్లింగ్‌ విభాగంలో భారత్‌కు పతకం రావడం ఇదే తొలిసారి. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సుశీల్‌కుమార్‌ తర్వాత 2012లో రజతంతో మెరిశాడు.

రవి ఈ ఒలింపిక్స్‌లో తొలి రౌండ్‌లో కొలంబియాకు చెందిన టైగ్రెరాస్‌ ఉర్బానోపై 13-2తేడాతో గెలుపొంది తర్వాత క్వార్టర్‌ ఫైనల్స్‌లో బల్గేరియాకు చెందిన జియోర్గి వాలెంటినోవ్‌ను 14-4తో చిత్తు చేశాడు. ఈ క్రమంలోనే సెమీస్‌లో కజకిస్థాన్‌కు చెందిన నురిస్లామ్‌ సనయేవ్‌ను పిన్‌డౌన్‌ (ఫాల్‌) చేసి 7-9 తేడాతో విజేతగా నిలిచాడు. చివరికి ఫైనల్స్‌లో స్వర్ణంతో మెరుస్తాడని ఆశించినా రష్యన్‌ రెజ్లర్‌ నుంచి గట్టి పోటీ ఎదురైంది. దాంతో ఈ యువ భారత రెజ్లర్‌ వెండి పతకం సాధించాడు. దీంతో ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున ఐదో పతకం సాధించిన రెజ్లర్‌గానూ రవి కొత్త రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు 1952లో కేడీ జాధవ్‌ తొలిసారి భారత్‌కు రెజ్లింగ్‌లో కాంస్యం అందించాడు. ఆపై 2008, 2012లో సుశీల్‌కుమార్‌, అదే ఏడాది యోగేశ్వర్‌దత్‌ మరో కాంస్యం, 2016 రియో ఒలింపిక్స్‌లో మహిళా రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ కాంస్యం సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని