Tokyo Olympics: ఒలింపిక్స్‌లో మళ్లీ పోటీపడేందుకు సిద్ధమైన అమెరికా జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌

టోక్యో ఒలింపిక్స్‌లో అమెరికా స్టార్‌ జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ మళ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. మంగళవారం జరిగే బ్యాలెన్స్‌ బీమ్‌ ఫైనల్స్‌లో ఆమె సునీ లీతో కలిసి పోటీపడనున్నట్లు అమెరికా జిమ్నాస్టిక్స్‌ విభాగం కొద్దిసేపటి క్రితం...

Published : 02 Aug 2021 23:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టోక్యో ఒలింపిక్స్‌లో అమెరికా స్టార్‌ జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ మళ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. మంగళవారం జరిగే బ్యాలెన్స్‌ బీమ్‌ ఫైనల్స్‌లో ఆమె సునీ లీతో కలిసి పోటీపడనున్నట్లు అమెరికా జిమ్నాస్టిక్స్‌ విభాగం కొద్దిసేపటి క్రితం ఓ ప్రకటనలో తెలిపింది. ‘ట్విస్టీస్‌’ గా పిలిచే మానసిక సమస్యల కారణంగా గతవారం టీమ్‌ ఈవెంట్‌, వ్యక్తిగత ఆల్‌రౌండ్‌ ఈవెంట్‌ ఫైనల్స్‌ నుంచి తప్పుకున్న ఆమె తాజాగా నిర్ణయం మార్చుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే మంగళవారం జరిగే బ్యాలెన్స్‌ బీమ్‌ ఫైనల్స్‌లో తన సహచరితో కలిసి ఆధిపత్యం సాధించాలని చూస్తోంది.

గత ఒలింపిక్స్‌లో బీమ్‌ ఈవెంట్లో రజతం సాధించిన బైల్స్‌ మరో నాలుగు ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించింది. దాంతో ఈసారి ఒలింపిక్స్‌లోనూ మరిన్ని పతకాలు సాధించాలనే కసితో టోక్యోలో అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే తొలి వారం జరిగిన జిమ్నాస్టిక్స్‌ పోటీల్లో అద్భుత ప్రదర్శన చేసి మొత్తం ఐదు వ్యక్తిగత విభాగాల్లో ఫైనల్‌కు చేరింది. కానీ మానసిక సమస్యల కారణంగా నాలుగు ఫైనల్స్‌ నుంచి తప్పుకుంది. మరోవైపు జులై 27న అనూహ్యంగా జట్టు ఫైనల్స్‌ నుంచి కూడా తప్పుకొని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. తనవల్ల జట్టుదెబ్బ తినకూడదన్న ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు అప్పుడు వెల్లడించింది. కానీ, బైల్స్‌ లేకపోవడమే ఆ ఈవెంట్‌లో అమెరికాను దెబ్బతీసింది. టీమ్‌ ఫైనల్స్‌లో రష్యా ఒలింపిక్‌ కమిటీ (ఆర్‌ఓసీ) అమెరికాను చిత్తుచేసి స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. దాంతో 2010 తర్వాత తొలిసారి జిమ్నాస్టిక్స్‌లో అమెరికా ఒలింపిక్‌ టీమ్‌ టైటిల్‌ను సొంతం చేసుకోలేకపోయింది. ఇప్పుడు బైల్స్‌ బ్యాలెన్స్‌ బీమ్‌ ఫైనల్స్‌లో పోటీపడుతుండటంతో అమెరికా మరో బంగారు పతకాన్ని సాధించే అవకాశం వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు