Tokyo Paralympics: ప్రత్యర్థుల అభ్యంతరం.. వినోద్‌ కుమార్‌ పతకంపై నీలినీడలు!

పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్‌ వినోద్‌ కుమార్‌ పురుషుల F52 డిస్కస్‌ త్రో ఈవెంట్‌లో కాంస్యం సాధించినా నిర్వాహకులు ఇంకా పతకాన్ని అందజేయలేదు. అతడి ఫలితాన్ని ప్రస్తుతం అట్టిపెట్టారు...

Published : 29 Aug 2021 21:48 IST

(Photo: Tokyo2020 for India Twitter)

టోక్యో: పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్‌ వినోద్‌ కుమార్‌ పురుషుల F52 డిస్కస్‌ త్రో ఈవెంట్‌లో కాంస్యం సాధించినా నిర్వాహకులు ఇంకా పతకాన్ని అందజేయలేదు. అతడి ఫలితాన్ని ప్రస్తుతం అట్టిపెట్టారు. ఇతర పోటీదారులు వినోద్ వర్గీకరణపై నిరసన తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై పునః సమీక్ష జరిపిన అనంతరం సోమవారం సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తామని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. పారాలింపిక్స్‌లో క్రీడల ప్రారంభోత్సవానికి ముందే అథ్లెట్ల అవయవలోప శక్తి సామర్థ్యాల ఆధారంగా వారిని వివిధ కేటగిరీలుగా వర్గీకరణ చేస్తారు. ఒకే స్థాయి శక్తి సామర్థ్యాలు కలిగిన వారిని సంబంధిత ఈవెంట్లకు ఎంపిక చేస్తారు.

ఈ క్రమంలోనే ఈనెల 22న వినోద్‌ను పరీక్షించిన నిర్వాహకులు F52 డిస్కస్‌త్రో ఈవెంట్‌కు ఎంపిక చేశారు. పోటీల్లో పాల్గొని 19.91 మీటర్ల దూరం డిస్కస్‌ త్రో చేసి కాంస్యం కైవసం చేసుకున్నాడు. అలాగే పోలాండ్‌కు చెందిన పీయోటర్‌ కోసెవిక్జ్‌ 20.02 మీటర్లతో స్వర్ణం సాధించగా.. క్రోయేషియాకు చెందిన వెలిమిర్‌ సాండర్‌ 19.98 మీటర్లతో రజతం దక్కించుకున్నాడు. అయితే, ఇతర పోటీదారులు వినోద్‌పై నిరసన తెలపడంతో నిర్వాహకులు పతకాల బహూకరణ నిలిపివేశారు. ఈ F52 ఈవెంట్‌లో బలహీనమైన కండరాల శక్తి కలిగిన అథ్లెట్లతో పాటు పరిమిత కదలిక అవయవలోపం ఉన్నవాళ్లు, కాళ్ల పొడవు వ్యత్యాసం ఉన్నవాళ్లు, వెన్నెముక సరిగా లేనివాళ్లు, క్రియాత్మక రుగ్మతతో కూర్చున్న స్థితిలో ఉన్న అథ్లెట్లు మాత్రమే పాల్గొంటారు. ఇందులో వినోద్‌ను ఏ విధంగా ఎంపిక చేశారనేది స్పష్టత లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని