Paralympics: ఒక్కరోజే 4 పతకాలు.. పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట

పారాలింపిక్స్‌లో డిస్కస్‌త్రో ఎఫ్‌ 56 విభాగంలో యోగేశ్‌ కతునియా రజతం సొంతం చేసుకున్నాడు.

Updated : 30 Aug 2021 11:05 IST

టోక్యో: టోక్యో పారాలింపిక్స్‌లో భారతీయులు దుమ్మురేపుతున్నారు. అద్భుతమైన ప్రదర్శనలతో పతకాల పంట పడిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సోమవారం ఒక్కరోజే ఏకంగా నాలుగు పతకాలు కొల్లగొట్టారు. అందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉండటం ప్రత్యేకం. షూటింగ్‌లో అవనీ లేఖరా పసిడి ముద్దాడగా దేవేంద్ర జజారియా, యోగేశ్‌ కతునియా రజతాలు కైవసం చేసుకున్నారు. సుందర్‌ సింగ్‌ గుర్జార్‌ కాంస్యంతో మురిపించాడు.


అవనీ లేఖరా

అవని అద్భుతః

భారత షూటర్‌ అవనీ లేఖరా సోమవారం పసిడిని ముద్దాడి చరిత్ర సృష్టించింది. ఆర్‌-2 విభాగంలో జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ స్టాండింగ్‌ ఎస్‌హెచ్‌1 పోటీల్లో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. 249.6 పాయింట్లు సాధించిన అవని ప్రపంచ రికార్డును సమం చేసింది. అంతేకాకుండా పారాలింపిక్స్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. మెగా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత నాలుగో అథ్లెట్‌గా అవతరించింది. గతంలో స్విమ్మర్‌ మురళీ కాంత్‌ పేట్కర్‌ (1972), జావెలిన్‌ త్రో వీరుడు దేవేంద్ర జజారియా (2004, 2016), హైజంపర్‌ మరియప్పన్‌ తంగవేలు (2016) స్వర్ణాలు ముద్దాడిన సంగతి తెలిసిందే. అవని వయసు కేవలం 19 ఏళ్లే కావడం గమనార్హం.


యోగేశ్‌ కతునియా

కతునియాకు రజతం

మెగా క్రీడల్లో ఆరో రోజు అద్భుతం చేసిన మరో ఆటగాడు యోగేశ్‌ కతునియా. పురుషుల ఎఫ్‌56 డిస్కస్‌ త్రో పోటీల్లో రజతం కైవసం చేసుకున్నాడు. డిస్క్‌ను ఆరో దఫాలో 44.38 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. యోగేశ్‌ దిల్లీలోని కిరోరిమల్‌ కళాశాలలో బీకామ్‌ చదివాడు. అతడి తండ్రి సైన్యంలో పనిచేస్తున్నారు. కతునియాకు ఎనిమిదేళ్ల వయసులో పక్షవాతం రావడంతో శరీరంలో కొన్ని అవయవాలు పనిచేయడం లేదు. ఐతే అతడికి పతకాలు సాధించడం కొత్తేం కాదు. 2019లో దుబాయ్‌లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో డిస్క్‌ను 42.51 మీటర్లు విసిరి కాంస్యం గెలిచాడు. ఆ ప్రదర్శతోనే అతడు పారాలింపిక్స్‌కు ఎంపికయ్యాడు. 2018లో అతడు పోటీపడ్డ తొలి అంతర్జాతీయ పోటీల్లోనే ఎఫ్‌36 విభాగంలో ప్రపంచ రికార్డు సాధించడం గమనార్హం.


దేవేంద్ర జజారియా

జజారియా హ్యాట్రిక్‌

భారత మాత ముద్దుబిడ్డ దేవేంద్ర జజారియా.. పారాలింపిక్స్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. హ్యాట్రిక్‌ పారాలింపిక్స్‌ విజేతగా అవతరించాడు. జావెలిన్‌ త్రోలో 2004, 2016లో స్వర్ణ పతకాలు ముద్దాడిన అతడు ఈ సారి రజతం అందుకున్నాడు. ఈటెను 64.35 మీటర్లు విసిరి అత్యుత్తమ వ్యక్తిగత రికార్డునూ నెలకొల్పాడు. ఎనిమిదేళ్ల వయసులో ఓ చెట్టు ఎక్కుతూ విద్యుదాఘాతానికి గురైన జజారియా అతడి ఎడమచేతిని పోగొట్టుకున్నాడు.


సుందర్‌ సింగ్‌ గుర్జార్‌

గర్జించిన గుర్జార్‌

జావెలిన్‌ త్రో లోనే మరో ఆటగాడు సుందర్‌సింగ్‌ గుర్జార్‌ కాంస్యం అందుకోవడం గమనార్హం. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అతడు ఎఫ్‌46 విభాగంలో మూడో స్థానంలో నిలిచాడు. ఈటెను 64.01 మీటర్లు విసిరి అద్భుతం చేశాడు. దాంతో ఒకే క్రీడాంశంలో భారత్‌కు రెండు పతకాలు లభించాయి. 25 ఏళ్ల గుర్జార్‌ 2015లో ప్రమాదానికి గురయ్యాడు. స్నేహితుడి ఇంట్లో ఆడుకుంటుండగా ఓ లోహపు రేకు అతడి ఎడమ చేతిపై పడింది. జైపుర్‌కు చెందిన గుర్జర్‌  2017, 2019 ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణాలు గెలవడం ప్రత్యేకం. ఇక 2018 జకార్తా పారా ఆసియా క్రీడల్లో రజతం ముద్దాడాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని