Rohit - Rahul Opening: రోహిత్‌-రాహుల్‌ల బ్యాటింగ్‌ మర్చిపోలేనిది: సెహ్వాగ్‌

ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్ అద్భుతంగా ఆడారని, వారి బ్యాటింగ్‌ మర్చిపోలేనిదని మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కొనియాడాడు...

Updated : 11 Sep 2021 21:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్ అద్భుతంగా ఆడారని, వారి బ్యాటింగ్‌ మర్చిపోలేనిదని మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కొనియాడాడు. తాజాగా ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడిన డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ వీరిద్దరి బ్యాటింగ్‌పైనా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. రోహిత్‌, రాహుల్‌ రాణించపోతే ఆయా టెస్టుల్లో టీమ్‌ఇండియా త్వరగా ఔటయ్యేదని పేర్కొన్నాడు.

‘ఈ సిరీస్‌లో రోహిత్‌, రాహుల్‌ చేసిన ఓపెనింగ్‌ భాగస్వామ్యం మర్చిపోలేనిది. వాళ్లిద్దరూ సరైన భాగస్వామ్యాలు నెలకొల్పకపోతే తరచూ విఫలమౌతున్న మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ త్వరగా క్రీజులోకి వచ్చేవారు. దాంతో టీమ్‌ఇండియా మరింత ముందుగానే ఆలౌటయ్యేది. వారిద్దరూ 30-40 ఓవర్లు బ్యాటింగ్‌ చేసి జట్టును మెరుగైనస్థితిలో నిలిపేవారు. కొన్ని సందర్భాల్లో వాళ్లు ఔటయ్యాక జట్టు తక్కువ స్కోర్లకే పరిమితమయ్యేది’ అని సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు. కాగా, ఈ సిరీస్‌లో ఓపెనర్లిద్దరూ రెండు అర్ధశతక భాగస్వామ్యాలు నెలకొల్పడమే కాకుండా ఒక శతక భాగస్వామ్యం సైతం నిర్మించారు. మరోవైపు లార్డ్స్‌లో రాహుల్‌ (129) సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా ఓవల్‌లో రోహిత్‌ (127) రెండో ఇన్నింగ్స్‌లో శతకం బాది టీమ్‌ఇండియా విజయానికి బాటలు వేశాడు. ఈ నేపథ్యంలోనే భారత్‌ ఈ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి 2-1తేడాతో ఆధిక్యంలో నిలిచింది. అయితే, కరోనా కేసుల కారణంగా ఐదో టెస్టు రద్దు కావడంతో సిరీస్‌ ఫలితంపై ఎలాంటి స్పష్టత రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని