IND vs SA : ఉత్కంఠపోరులో భారత్‌ ఓటమి.. క్లీన్‌స్వీప్‌ చేసిన సఫారీలు

కేప్‌టౌన్‌ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన మూడో వన్డేలో భారత్‌పై దక్షిణాఫ్రికా నాలుగు పరుగుల తేడాతో...

Published : 24 Jan 2022 01:51 IST

టెస్టు సిరీస్‌తోపాటు వన్డే సిరీసూ పాయే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా కథ సమాప్తం.. ఆఖరి వన్డేలోనైనా విజయంతో దక్షిణాఫ్రికా పర్యటనను ముగిద్దామని భావించిన భారత్‌కు కలిసిరాలేదు. సఫారీల ముందు టీమ్‌ఇండియా ఆటలు సాగలేదు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో ప్రొటీస్‌ జట్టు కైవసం చేసుకుంది. టెస్టు సిరీస్‌నూ 2-1 తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.  

కేప్‌టౌన్‌ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన మూడో వన్డేలో భారత్‌పై దక్షిణాఫ్రికా నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 287 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా 49.2 ఓవర్లలో 283 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (65), శిఖర్ ధావన్ (61), దీపక్ చాహర్ (54) అర్ధశతకాలు సాధించినా ఓటమి తప్పలేదు. సూర్యకుమార్‌ యాదవ్ (39), శ్రేయస్‌ అయ్యర్ (26) రాణించారు. ఆఖర్లో దీపక్‌ చాహర్, బుమ్రా (12) విజయం కోసం తీవ్రంగా పోరాడినా ఫలితం దక్కలేదు. మిగతా వారిలో కేఎల్‌ రాహుల్ 9, పంత్ డకౌట్, జయంత్ యాదవ్ 2, చాహల్ 2, ప్రసిధ్‌ కృష్ణ 2* పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3, పెహులక్వాయో 3.. ప్రిటోరియస్ 2, మగలా, కేశవ్ మహరాజ్‌ చెరో వికెట్ తీశారు. 

వారు రాణించడంతో.. 

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 287 పరుగులు చేసిందంటే దానికి కారణం.. డికాక్ (124), డస్సెన్ (52). త్వరగా మూడు వికెట్లు పడినా వీరిద్దరూ కలిసి 144 పరుగుల భాగస్వామ్యం నిర్మించి జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లు విజృంభించడంతో దక్షిణాఫ్రికా స్వల్ప వ్యవధిలో మూడు వికెట్ల నష్టపోయింది. అయితే మిల్లర్ (39), ప్రిటోరియస్‌ (20) ఫర్వాలేదనిపించడంతో దక్షిణాఫ్రికా మంచి లక్ష్యాన్నే భారత్‌ ఎదుట ఉంచింది. ఇక టీమ్‌ఇండియా బౌలర్లలో ప్రసిధ్‌ 3, బుమ్రా 2, చాహర్ 2, చాహల్ ఒక వికెట్ తీశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని