Ganguly: లార్డ్స్‌లో చొక్కా విప్పి 19 ఏళ్లు!

అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతాలెన్నో జరిగాయి. ఎన్నో మ్యాచులు చరిత్రలో నిలిచిపోయాయి. భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన నాట్‌వెస్ట్‌ సిరీసు ఫైనల్‌ కూడా అలాంటిదే. ట్రెస్కోథిక్‌, నాసర్‌ హుస్సేన్‌ సెంచరీ చేయడం...

Updated : 13 Jul 2021 15:06 IST

నాట్‌వెస్ట్‌ ఫైనల్లో యువీ, కైఫ్‌ మెరుపులు గుర్తున్నాయా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతాలెన్నో జరిగాయి. ఎన్నో మ్యాచులు చరిత్రలో నిలిచిపోయాయి. భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన నాట్‌వెస్ట్‌ సిరీసు ఫైనల్‌ కూడా అలాంటిదే. ట్రెస్కోథిక్‌, నాసర్‌ హుస్సేన్‌ సెంచరీ చేయడం.. టీమ్‌ఇండియా 146కే 5 వికెట్లు కోల్పోవడం.. యువీ, కైఫ్‌ భాగస్వామ్యం నెలకొల్పడం.. లార్డ్స్‌ బాల్కనీలో గంగూలీ చొక్కా విప్పడం.. ఇవన్నీ జరిగి నేటికి 19 ఏళ్లు. ఐనా అభిమానుల మనసుల్లో ఇవన్నీ ఇంకా తాజాగానే ఉన్నాయి.

ఇద్దరి శతకాలు

లార్డ్స్‌ వేదికగా జరిగిన ఈ పోరులో మొదట ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్‌ నిక్‌ నైట్‌ (14) త్వరగానే ఔటయ్యాడు. కానీ వన్‌డౌన్‌లో వచ్చిన నాసర్‌ హుస్సేన్‌ (115; 128 బంతుల్లో 10×4), మరో ఓపెనర్‌ మార్కస్‌ ట్రెస్కోథిక్‌ (109; 100 బంతుల్లో 7×4, 2×6) శతకాల మోత మోగించారు. వారికి తోడుగా ఆండ్రూ ఫ్లింటాఫ్‌ సైతం (40; 32 బంతుల్లో) దూకుడుగా ఆడటంతో ఆంగ్లేయులు 5 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేశారు.

యువీ, కైఫ్‌ జోరు..  

ఛేదనకు దిగిన భారత్‌కు వీరేంద్ర సెహ్వాగ్‌ (45; 49 బంతుల్లో 7×4), సౌరవ్‌ గంగూలీ (60; 43 బంతుల్లో 10×4, 1×6) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. అయితే వీరిద్దరూ ఎనిమిది పరుగుల వ్యవధిలో పెవిలియన్‌ చేరారు. మిడిలార్డర్‌లో దినేశ్‌ మోంగియా (9), సచిన్‌ (14), ద్రవిడ్‌ (5) విఫలమవ్వడంతో 146/5తో కష్టాల్లో పడింది. ఆ సమయంలో కుర్రాళ్లైన యువరాజ్‌ సింగ్‌ (69; 63 బంతుల్లో 9×4, 2×6), మహ్మద్‌ కైఫ్‌ (87*; 75 బంతుల్లో 6×4, 2×6) అద్భుతం చేశారు. జట్టు స్కోరు 267 వద్ద యువీ ఔటయ్యాడు. మరో 8 ఓవర్లే ఉండటంతో ఉత్కంఠ చెలరేగింది.

ఆఖర్లో ఉత్కంఠ..

ఇదే సమయంలో ఆండ్రూ ఫ్లింటాఫ్‌ భారత క్రికెటర్లను కవ్వించాడు. అయితే హర్భజన్‌ 13 బంతుల్లో 15 పరుగులతో ఆకట్టుకున్నాడు. కుంబ్లే ఔటైనా కైఫ్‌ నిలిచాడు. ఆఖరి ఓవర్లో ఫ్లింటాఫ్‌ వేసిన తొలి రెండు బంతులకు పరుగులు రాలేదు. ఆ తర్వాత బంతిని జహీర్‌ ఆన్‌సైడ్‌ నెట్టి సింగిల్‌కు ప్రయత్నించాడు. డైరెక్ట్‌గా వేసిన బంతి పక్కకు వెళ్లిపోవడంతో రెండో పరుగూ వచ్చింది. టీమ్‌ఇండియా మరో 3 బంతులు మిగిలుండగానే 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వెంటనే లార్డ్స్‌ బాల్కనీలో ఉన్న గంగూలీ తన చొక్కా విప్పి గిరగిరా ఊపుతూ సందడి చేశాడు. ఆ తర్వాత సంబరాలు మిన్నంటాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని