Olympics Winning Moments: వీడియోలు చూడండి!

ఈ విశ్వక్రీడల్లో భారత అథ్లెట్లు మొత్తంగా ఏడు పతకాలు సాధించి సత్తా చాటారు. ఆ గెలుపు క్షణాల్ని నెమరవేసుకుందామా!

Updated : 09 Aug 2021 12:32 IST

టోక్యో 2020 ఒలింపిక్స్‌ సంబరాలు ఘనంగా ముగిశాయి. అథ్లెటిక్స్‌లో భారత్‌ వందేళ్లుగా వేచి చూసిన ‘స్వర్ణ’ సంబరం ఈ దఫా మన సొంతమైంది. ఈ విశ్వక్రీడల్లో భారత అథ్లెట్లు మొత్తంగా ఏడు పతకాలు సాధించారు. మరి ఈ క్రీడోత్సవంలో మన అథ్లెట్ల గెలుపు క్షణాల్ని ఓసారి నెమరవేసుకుందామా!


🥈 మీరాబాయి చాను (రజతం) 🥈

ఒలింపిక్స్‌ ఆరంభమైన రెండో రోజే భారత్‌కు పతకాన్ని అందించింది మీరాబాయి చాను. వెయిట్‌ లిఫ్టింగ్‌లో కరణం మల్లీశ్వరి తర్వాత ఆ ఘనత సాధించింది చానునే. దాదాపు 21 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో ఈ మణిపుర్‌ మణిపూస అద్భుతాన్ని ఆవిష్కరించింది. మహిళల 49 కిలోల విభాగంలో రజతం గెలిచి.. భారత కీర్తి పతాకను శిఖరాగ్రాలకు చేర్చింది. పోటీలో భాగంగా స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 115 కిలోలు.. మొత్తంగా 202 కిలోలు ఎత్తింది. 


🥉 పీవీ సింధు (కాంస్యం) 🥉

ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ విభాగంలో తెలుగు తేజం పీవీ సింధు కాంస్య పతకం సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. కాంస్య కోసం జరిగిన పోటీలో చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో పోటీ పడింది మన సింధు. అయితే, మ్యాచ్‌ ప్రారంభం నుంచి పూర్తి ఆధిపత్యం చలాయించిన సింధు.. వరుస గేమ్స్‌లో 21-13, 21-15 తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో వరుసగా రెండు సార్లు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. అయితే, 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు.. తాజా ఒలింపిక్స్‌లో కాంస్యంతో సరిపెట్టుకుంది.


🥉 లవ్లీనా బొర్గొహెయిన్‌ (కాంస్యం) 🥉

ఒలింపిక్స్‌ బాక్సింగ్‌లో.. లవ్లీనా బొర్గొహెయిన్‌ చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్‌గా అవతరించింది. ‘మాగ్నిఫిసెంట్‌ మేరీ’ తర్వాత పతకం ముద్దాడిన రెండో మహిళగా ఘనకీర్తిని అందుకుంది. టోక్యో క్రీడల్లో ఆమెకు దక్కింది కాంస్యమే అయినా అది స్వర్ణంతో సమానమే! ఎందుకంటే భారత బాక్సింగ్‌కు 9 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఆమె తొలి పతకం అందించింది. ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలిసారే పతకం గెలవడం విశేషం. 


🥉 హాకీ- పురుషుల జట్టు (కాంస్యం) 🥉

41 సంవత్సరాల తర్వాత భారత హాకీ జట్టు.. తిరిగి ఒలింపిక్స్‌లో పతకం సాధించడం గర్వించదగ్గ విషయం. అద్భుతమై ఆటతీరుతో సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్‌.. ఆ మ్యాచ్‌లో బెల్జియం చేతిలో ఓటమిపాలైంది. దీంతో మూడోస్థానం కోసం జర్మనీతో బరిలోకి దిగిన భారత్‌.. ఆ జట్టును 5-4  గోల్స్‌తో ఓడించి కాంస్య పతకం కైవసం చేసుకుంది.


🥈 రవి కుమార్‌ దహియా (రజతం) 🥈

టోక్యో ఒలింపిక్స్‌లో రవి కుమార్‌ దహియా అద్భుత పోరాటంతో రెజ్లింగ్‌ 57 కిలోల ఫ్రీస్టయిల్‌ విభాగంలో రజతంతో మెరిశాడు. రెండు సార్లు ప్రపంచ విజేత అయిన రష్యాకు చెందిన యుగేవ్‌ జావుర్‌ చేతిలో పోరాడి ఓడినా దేశానికి పతకం తీసుకొచ్చాడు. ఇక 2012 తర్వాత పురుషుల రెజ్లింగ్‌ విభాగంలో భారత్‌కు పతకం రావడం ఇదే తొలిసారి. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సుశీల్‌కుమార్‌ తర్వాత 2012లో రజత పతకం గెలిచాడు.


🥉 బజరంగ్‌ పునియా (కాంస్యం) 🥉

భారత రెజ్లర్‌ బజరంగ్‌ పునియా.. పురుషుల 65 కిలోల కుస్తీపోటీల్లో కాంస్య పతకం సాధించాడు. వీరోచిత పోరాటంతో సెమీ ఫైనల్‌ వరకు దూసుకెళ్లిన బజరంగ్‌.. ఆ మ్యాచ్‌లో అజర్‌బైజాన్‌కు చెందిన అలియెవ్‌ హజీతో తలపడి ఓడిపోయాడు. అనంతరం జరిగిన ‘కాంస్య’ పోరులో కజక్‌స్థాన్‌కు చెందిన దౌలత్‌ నియజ్‌బెకోవ్‌ను 8-0తో చిత్తు చేశాడు. 


🥇 నీరజ్‌ చోప్రా (స్వర్ణం) 🥇

ఒలింపిక్స్‌ ముగిసే ముందు రోజు భారత జావెలిన్‌ త్రో ఆటగాడు నీరజ్‌ చోప్రా చరిత్ర సృష్టించాడు.  అథ్లెటిక్స్‌లో శతాబ్దం తర్వాత తొలి పతకం అందించాడు. జావెలిన్‌ త్రోలో స్వర్ణ పతకం ముద్దాడాడు. స్వతంత్ర భారత దేశంలో.. వ్యక్తిగత క్రీడల్లో అభినవ్‌ బింద్రా తర్వాత పసిడి పతకం అందుకున్న వీరుడిగా నిలిచాడు. పోటీలో మొదటి అవకాశంలో జావెలిన్‌ను నీరజ్‌ 87.03 మీటర్లు విసిరాడు. రెండోసారి 87.58మీటర్లు, మూడోసారి 76.79మీటర్లు విసిరాడు. ఆ తర్వాత రెండు అవకాశాలు ఫౌల్స్‌ అయినా.. అత్యుత్తమ ప్రదర్శన (87.58)తో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకం అందుకున్నాడు. 


వీళ్లంతా పతకాల సాధించి.. రికార్డులు నెలకొల్పితే.. మరికొన్ని విభాగాల్లో భారత అథ్లెట్లు చరిత్ర సృష్టించారు. వాటన్నింటిని మరో కథనంలో మీ ముందుంచుతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని