Hockey: ఒకే రోజు.. ఇద్దరు ఒలింపిక్‌ స్టార్‌ హాకీ ఆటగాళ్ల రిటైర్మెంట్‌

ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ బృందం చరిత్రాత్మక కాంస్య పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లు ఒకే రోజు రిటైర్మెంట్‌ ప్రకటించారు.

Published : 30 Sep 2021 18:10 IST

దిల్లీ: ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ బృందం చరిత్రాత్మక కాంస్య పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లు ఒకే రోజు రిటైర్మెంట్‌ ప్రకటించారు. డ్రాగ్‌ ఫ్లికర్‌ రూపీందర్‌ పాల్‌ సింగ్‌, డిఫెండర్‌ బీరేంద్ర లక్రా.. గురువారం అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలికారు. కొన్ని గంటల తేడాతో వీరిద్దరూ తమ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. 

తొలుత రూపీందర్‌ సింగ్‌ ట్విటర్‌ ద్వారా తన రిటర్మైంట్‌ ప్రకటించారు. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి బీరేంద్ర లక్రా కూడా అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలికినట్లు హాకీ ఇండియా ప్రకటించింది. అయితే.. వచ్చేవారం బెంగళూరులో ప్రారంభమయ్యే నేషనల్‌ క్యాంప్‌లో ఈ ఇద్దరికీ చోటు దక్కకపోవడంతో వీరు రిటైర్మెంట్ ప్రకటించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. 

30ఏళ్ల రూపీందర్‌ పాల్‌ దేశంలో ఉత్తమ డ్రాగ్‌ ఫ్లికర్‌గా గుర్తింపు సాధించాడు. 13ఏళ్లుగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతడు జట్టు తరఫున 223 మ్యాచ్‌లు ఆడాడు. టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీతో జరిగిన కాంస్య పతక పోరులో రూపీందర్‌ నాలుగు కీలక గోల్స్‌ సాధించి జట్టు పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 

ఇక 31ఏళ్ల బీరేంద్ర లక్రా.. టోక్యోలో పాల్గొన్న హాకీ జట్టుకు వైస్‌ కెప్టెన్లలో ఒకడు. 2014లో జరిగిన ఇంచియాన్‌ ఏషియన్‌ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టులోనూ సభ్యుడు. 11ఏళ్లుగా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ‘‘నా ప్రయాణంలో ఇండియా జెర్సీ ధరించడం, దేశం తరఫున ఆడటం కంటే గొప్ప అనుభూతి మరేది లేదు. అయితే ఇప్పుడు తర్వాతి తరానికి కూడా అవకాశాలు ఇవ్వాల్సిన సమయం వచ్చింది. యువ ఆటగాళ్లకు చోటు కల్పించేందుకు నేడు భారత హాకీ జట్టు నుంచి వీడ్కోలు పలుకుతున్నా’’ అని బీరేంద్ర ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని