Tokyo Olympics: భారత్‌కు చేరిన బంగారు ‘చోప్రా’.. అథ్లెట్లకు ఘన స్వాగతం

టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారులు, విజేతలు సోమవారం స్వదేశానికి తిరిగివచ్చారు. జావెలిన్‌ త్రోలో బంగారు పతకం సాధించిన నీరజ్‌ చోప్రా సైతం తిరిగి భారత్‌కు చేరుకున్నాడు...

Published : 09 Aug 2021 18:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారులు, విజేతలు సోమవారం స్వదేశానికి తిరిగివచ్చారు. జావెలిన్‌ త్రోలో బంగారు పతకం సాధించిన నీరజ్‌ చోప్రా సైతం తిరిగి భారత్‌కు చేరుకున్నాడు. ఈ సందర్భంగా వారికి దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది పూలమాలలు, పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. మరోవైపు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ సందీప్‌ ప్రధాన్‌  ఎయిర్‌పోర్టుకు వెళ్లి క్రీడాకారులను ఘనంగా ఆహ్వానించారు. అభిమానులు సైతం పెద్ద ఎత్తున తరలిరావడంతో అక్కడ భౌతిక దూరం గాలికొదిలేశారు. దాంతో క్రీడాకారులు అక్కడి నుంచి త్వరగానే వెళ్లిపోయారు.

కాగా, ఈ ఒలింపిక్స్‌లో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన చేయడం విశేషం. ఇంతకుముందు 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో అత్యధికంగా ఆరు పతకాలు సాధించిన భారత అథ్లెట్లు ఈసారి ఏడు పతకాలతో తిరిగొచ్చారు. దాంతో వారు భవిష్యత్‌పై మరిన్ని ఆశలు పెంచారు. అందులో అథ్లెటిక్స్‌ విభాగంలో నీరజ్‌ చోప్రా తొలిసారి స్వర్ణం సాధించి కొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక మిగతావారిలో మీరాబాయి చాను, రవికుమార్‌ దాహియా రజత పతకాలు సాధించగా బాక్సర్‌ లవ్లీనా బార్గోహేన్‌, పీవీ సింధు, బజ్‌రంగ్‌ పునియా, భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాలు గెలుపొందారు. ఈ క్రమంలోనే సింధు, మీరాబాయి తమ ఈవెంట్లు పూర్తికాగానే తిరిగి స్వదేశానికి చేరారు. మిగతా అథ్లెట్లు ఈరోజు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని