Published : 31/05/2021 09:35 IST

Sachin Tendulkar: సచిన్.. యుగానికి ఒక్కడు!

పోటీలో కోహ్లీ.. అత్యధిక మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ వీరులు వీరే

అంతర్జాతీయ క్రికెట్‌కు దిగ్గజాలను అందించిన దేశం భారత్‌. ఎంతోమంది మ్యాచ్‌ విజేతలు టీమ్‌ఇండియా నుంచి వచ్చారు. అద్భుతమైన ఆటతో అలరించారు. అశేష అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. ఉత్కంఠకరమైన మ్యాచులను ఒంటిచేత్తో గెలిపించి ‘మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌’లు కైవసం చేసుకున్నారు. వందల మంది జట్టుకు ఆడితే కొందరికే ఎక్కువ పురస్కారాలు దక్కాయి. ఇంతకీ వాళ్లెవరంటే..!


సచిన్‌.. ది గ్రేట్‌

ప్రపంచ క్రికెట్లో అత్యధిక పరుగుల వీరుడు ఎవరంటే.. సచిన్‌ తెందూల్కర్‌ అని ఠక్కున చెప్పేస్తారు. మరి ఎక్కువ మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచులు అందుకున్నదీ మాస్టర్‌ బ్లాస్టరే అంటే ఆశ్చర్యం లేదు. 1989లో అరంగేట్రం చేసిన ఈ ముంబయి వీరుడు 2013లో వీడ్కోలు పలికే వరకు అలరిస్తూనే ఉన్నాడు. మొత్తం 664 మ్యాచులాడిన అతడు ఏకంగా.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో 74 ‘MOM’లు అందుకొన్నాడు. టెస్టుల్లో 14, వన్డేల్లో 62 దక్కించుకున్నాడు. వన్డేల్లో అతడి దరిదాపుల్లో ఎవ్వరూ లేరు.


గ్రేట్‌కు చేరువలో కోహ్లీ

క్రికెట్లో సచిన్‌ తెందూల్కర్‌ రికార్డులను బద్దలు కొట్టగలిగేది ఎవరంటే గుర్తొచ్చేది విరాట్‌ కోహ్లీ. తనదైన దూకుడుతో టీమ్‌ఇండియాకు వడివడిగా పరుగులు చేయడం నేర్పిన మొనగాడు అతడు. మాస్టర్‌ కెరీర్లో ఇంకా సగం మ్యాచులైనా ఆడలేదు అతడి ఘనతలెన్నో తిరగశాడు. 2008లో అరంగేట్రం చేసిన పరుగుల రారాజు 435 మ్యాచులు ఆడాడు. 58 ‘MOM’లు అందుకొన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 9, వన్డేల్లో 36, టీ20ల్లో 12 కైవసం చేసుకున్నాడు. సచిన్‌ గణాంకాలను సమం చేయగల.. మించగల ఆటగాడు అతనొక్కడే!


మూడులో దాదా

తన దాదాగిరితో టీమ్‌ఇండియాలో ఆత్మవిశ్వాసం నింపాడు సౌరవ్‌ గంగూలీ. ఆఫ్‌సైడ్‌ సొగసైన కవర్‌డ్రైవ్‌లతో మురిపించిన దాదాయే ఎక్కువ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచులు అందుకొన్న మూడో ఆటగాడు. అటు కెప్టెగా.. ఇటు ఓపెనర్‌గా.. అలరించారు. కుర్రాళ్ల కోసం తన ఓపెనింగ్‌ స్థానాన్ని త్యాగం చేశాడు. 1992లో అరంగేట్రం చేసిన కోల్‌కతా ప్రిన్స్ 2008 వరకు 424 మ్యాచులు ఆడాడు. 37 ‘MOM’లు అందుకొన్నాడు. టెస్టుల్లో 6, వన్డేల్లో 31 సాధించాడు.


హిట్‌.. హిట్‌ మ్యాన్‌

ప్రస్తుతం టీమ్‌ఇండియాకు విరాట్‌ కోహ్లీ ఒక కన్నైతే మరో కన్ను రోహిత్‌ శర్మ. అత్యంత సునాయాసంగా.. మంచినీళ్ల ప్రాయంగా డబుల్‌ సెంచరీలు బాదగల మొనగాడు అతడు. అందం ఉట్టిపడే షాట్లు ఆడే హిట్‌మ్యాన్‌ 2007లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 376 మ్యాచులాడి 34 ‘MOM’లు సాధించాడు. టెస్టుల్లో 3, వన్డేల్లో 21, టీ20ల్లో 10 అందుకొన్నాడు. దాదా రికార్డు బద్దలు చేసేందుకు అతడు మరెంతో దూరంలో లేడు.


యువీ.. కేక

టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల వీరుడు యువరాజ్‌ సింగ్‌. బంతుల్ని అలవోకగా బౌండరీ సరిహద్దులు దాటిస్తూ జట్టుకు తిరుగులేని విజయాలు అందించాడు. మిడిలార్డర్‌కు దశాబ్దకాలానికి పైగా మూలస్తంభంగా నిలిచాడు. ఐసీసీ అన్ని ట్రోఫీల్లోనూ అతడికి భాగస్వామ్యం ఉంది. వయసు విభాగాల పోటీల్లోనూ అత్యున్నత పోటీలు గెలిచాడు యువీ. 2000లో అరంగేట్రం చేసిన ఈ ఎడమచేతివాటం ఆల్‌రౌండర్‌ 2017 వరకు అభిమానుల అలరించాడు. 402 మ్యాచుల్లో 34 ‘MOM’లు గెలిచాడు. వన్డేల్లో 27, టీ20ల్లో 7 కైవసం చేసుకున్నాడు.


వీరూ.. ఊచకోత

ప్రపంచ క్రికెట్లో వీరేంద్ర సెహ్వాగ్‌ ఊచకోతను ఏ అభిమానైనా మరిచిపోగలడా? అతడి బ్యాటింగ్‌ ధాటికి బంతే భయపడి పారిపోయేది మరి! టీమ్‌ ఇండియాకు గొప్ప గొప్ప ఆరంభాలు ఇచ్చాడతను. సచిన్‌తో కలిసి అతడు నెలకొల్పిన భాగస్వామ్యాలు జట్టును విజయతీరాలకు చేర్చాయి. 1999 నుంచి 2013 వరకు వీరూ 373 మ్యాచులు ఆడాడు. మొత్తం 31 ‘MOM’లు అందుకొన్నాడు. టెస్టుల్లో 8, వన్డేల్లో 23 సాధించాడు. వీరేంద్రుడు అందుకొన్న త్రిశతకాలు ఇంకా అందరి మదిలో మెదులుతూనే ఉన్నాయి.


ఎప్పటికీ.. డిపెండబుల్‌

టీమ్‌ఇండియాలో అందరు క్రికెటర్లు ఒకవైపు.. అతనొకవైపు. మిగతా వాళ్లు విజయాలు అందించారని చెబితే రాహుల్‌ ద్రవిడ్‌ మాత్రం అపజయాల నుంచి కాపాడాడని చెబుతారు. కొన్ని వందల మ్యాచుల్లో ఈ మిస్టర్‌ డిపెండబుల్‌ భారత్‌కు అవమానాలు తప్పించాడు. 1996లో అరంగేట్రం చేసిన ద్రవిడ్‌ 2012 వరకు 509 మ్యాచులు ఆడాడు. 25 ‘MOM’లు అందుకున్నాడు. టెస్టుల్లో 11, వన్డేల్లో 14 కైవసం చేసుకున్నాడు.


అజ్జూ భాయ్‌ ‘23’

మణికట్టుతో అద్భుతాలు చేసిన ఆటగాడు మహ్మద్‌ అజహరుద్దీన్‌. కెప్టెన్‌గా టీమ్‌ఇండియాకు అనేక విజయాలు అందించాడు. అతడి బ్యాటింగ్‌ అందానికి ఫిదా కానివారు ఉండరు. 1984లో అరంగేట్రం చేసిన అజ్జూభాయ్‌ 2000 వరకు అలరించాడు. సుదీర్ఘ కెరీర్లో 433 మ్యాచులు ఆడి 23 ‘MOM’లు సాధించాడు. టెస్టుల్లో 5, వన్డేల్లో 18 అందుకొన్నాడు.


ధోనీ భాయ్‌.. అన్నింటా.. 

భారత్‌కు ఐసీసీ ట్రోఫీలన్నీ అందించిన ఏకైక సారథి ఎంఎస్‌ ధోనీ. టాప్‌ ఆర్డర్లో భారీ స్కోర్లు చేసిన మహీ మిడిలార్డర్‌కు మారాక మ్యాచ్‌ విజేతగా ఎదిగాడు. టాప్‌ ఆర్డర్‌ విఫలమైన ప్రతిసారీ గొప్ప పరిణతితో ఆడేవాడు. ఆఖర్లో ధనాధన్ షాట్లతో విరుచుకుపడే వాడు. తన సారథ్యం, వికెట్‌ కీపింగ్‌, బ్యాటింగ్‌తో మెప్పించాడు. 2004లో అరంగేట్రం చేసిన మిస్టర్‌ కూల్‌ 2019 వరకు 538 మ్యాచులు ఆడాడు. మొత్తంగా 23 ‘MOM’లు అందుకొన్నాడు. టెస్టుల్లో 2, వన్డేల్లో 21 సాధించాడు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని