Unmukt Chand: భారత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఉన్ముక్త్‌ చంద్‌

అండర్‌-19 ప్రపంచకప్‌ హీరో ఉన్ముక్త్‌ చంద్‌ (28) క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. భారత క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్లు ట్విటర్‌ వేదికగా శుక్రవారం ప్రకటించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ అవకాశాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు...

Published : 14 Aug 2021 01:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అండర్‌-19 ప్రపంచకప్‌ హీరో ఉన్ముక్త్‌ చంద్‌ (28) క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. భారత క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్లు ట్విటర్‌ వేదికగా శుక్రవారం ప్రకటించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ అవకాశాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ‘దీన్ని ఎలా చెప్పాలో తెలియడం లేదు. దేశానికి ప్రాతినిథ్యం వహించలేను అని చెప్పడం నా ఊపిరిని ఆపేస్తోంది. భారత జట్టులో ఆడాలని కలలు కంటూనే పెరిగా. భారత్‌లో నా క్రికెట్ ప్రయాణంలో కొన్ని అద్భుత క్షణాలు ఉన్నాయి. దేశానికి అండర్‌-19 కప్‌ అందించడం నా కెరీర్‌లో పెద్ద మైలురాయి. కెప్టెన్‌గా కప్పును ఎత్తడం.. ఎందరో భారతీయుల మోముల్లో ఆనందం నింపడం ఓ ప్రత్యేక అనుభూతి. ఆ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను’ అని ఉన్ముక్త్‌ పేర్కొన్నాడు. తన లాంటి క్రికెటర్లకు బీసీసీఐ ఓ ఫ్లాట్‌ఫాం ఇస్తోందని.. అందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పాడు.

2012లో అండర్‌-19 భారత జట్టు ప్రపంచకప్‌ గెలిచిన అనంతరం ఆ జట్టు కెప్టెన్‌గా ఉన్న ఉన్ముక్త్‌ చంద్‌ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. భారత జట్టులోకి త్వరలోనే రంగప్రవేశం చేస్తాడని.. ఓ వెలుగు వెలుగుతాడని అందరూ భావించారు. కానీ అతడికి సరైన అవకాశాలు రాలేదు. భారత జట్టు తరఫున ఏ ఫార్మాట్‌లోనూ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. 2014 ప్రపంచకప్‌ కోసం భారత జట్టుకు ఎంపికైనా ఆడేందుకు అవకాశం రాలేదు. 2011 ఐపీఎల్‌లో దిల్లీ డేర్‌డెవిల్స్‌ అతడిని కొనుగోలు చేసింది. ఆ తర్వాత రాజస్థాన్‌, ముంబయి జట్లకు కూడా ఆడాడు. ఇప్పటి వరకు 67 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన ఉన్ముక్త్‌.. 31.57 సగటుతో 3379 పరుగులు, లిస్ట్‌-ఏ మ్యాచ్‌ల్లో 41.33 సగటుతో 4505 పరుగులు చేశాడు. 77 టీ20 మ్యాచుల్లో 22.35 సగటుతో 1565 పరుగులు సాధించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని