Vinesh Phogat: నా మనసు ముక్కలైంది.. మళ్లీ మ్యాట్‌పై అడుగుపెడతానో లేదో?

క్రీడాభిమానులకు రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్(26) షాకిచ్చింది. తాను మళ్లీ రెజ్లింగ్‌ ఆడతానో లేదోనని అనుమానం వ్యక్తం చేసింది. గాయాలే ఇందుకు కారణమని ఆమె పేర్కొంది. అయితే టోక్యో ఒలింపిక్స్‌లో ఎదురైన నిరాశ....

Published : 13 Aug 2021 20:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రీడాభిమానులకు రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్(26) షాకిచ్చింది. తాను మళ్లీ రెజ్లింగ్‌ ఆడతానో లేదోనని అనుమానం వ్యక్తం చేసింది. గాయాలే ఇందుకు కారణమని ఆమె పేర్కొంది. అయితే టోక్యో ఒలింపిక్స్‌లో ఎదురైన నిరాశ.. అనంతర పరిణామాలు కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది.

వినేశ్‌ ఓ జాతీయ వార్తాపత్రికతో మాట్లాడుతూ..‘భారత్‌లో ఎంత త్వరగా పైకి లేస్తామో.. అంతే త్వరగా కిందపడిపోతాం. ఒక్క పతకం సాధించలేకపోయా. ఇప్పుడు అంతా అయిపోయింది. మళ్లీ మ్యాట్‌పైకి ఎప్పుడు వెళతానో తెలియదు. విరిగిన కాలు బాగుందనే అనుకుంటున్నా. ఇప్పుడు నా శరీర భాగం విరగలేదు.. కానీ నా మనసు ముక్కలైపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేసింది. 2017  కంకషన్‌కు గురికావడం, అనంతరం రెండు సార్లు కరోనా సోకడం టోక్యోలో తన ప్రదర్శనను ప్రభావితం చేశాయని వాపోయింది. మానసిక సమస్యలతో తీవ్ర ఇబ్బందిపడినట్లు పేర్కొంది.

రియో ఒలింపిక్స్‌(2016)లో ప్రత్యర్థితో పోటీ పడుతుండగా వినేశ్‌ మోకాలికి గాయమైంది. దీంతో ఆమె ఆ పోటీల నుంచి నిష్క్రమించింది. అయితే ఆ గాయం నుంచి కోలుకున్న వినేశ్‌.. టోక్యో ఒలింపిక్స్‌లో (53 కేజీల విభాగంలో) ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. కానీ క్వార్టర్‌ ఫైనల్లో ఆమెకు ఊహించని షాక్‌ తగింది. బెలారస్‌కు చెందిన వెనెసా చేతిలో ఓటమిపాలైంది. అనంతరం టోక్యో ఒలింపిక్స్‌లో అనుచిత ప్రవర్తన కారణంగా తాత్కాలిక నిషేధానికి గురైంది.

అనుచిత ప్రవర్తన కారణంగా వినేశ్‌ ఫొగాట్‌పై రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) తాత్కాలిక నిషేధం విధించింది. ఒలింపిక్స్‌ జరిగేటప్పుడు క్రీడా గ్రామంలో అథ్లెట్లకు కేటాయించిన గదుల వద్ద తోటి రెజ్లర్లతో కలిసి ఆమె ఉండటానికి నిరాకరించిందని, అలాగే వారితో ప్రాక్టీస్‌ చేయలేదని, మరోవైపు ఒలింపిక్స్‌లోనూ భారత క్రీడాకారుల అధికారిక స్పాన్సర్‌ కిట్‌ను ధరించలేదనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే భారత్‌కు చేరిన వినేశ్‌కు డబ్ల్యూఎఫ్‌ఐ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యాలన్నీ రెజ్లర్‌ మానసికంగా కుంగిపోవడానికి కారణమైనట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని