Virat Kohli - Faf Duplesis: కోహ్లీ-డుప్లెసిస్‌ మద్దతు ముంబయికే.. మొత్తం 25 మంది అట..!

బెంగళూరు ఆశలన్నీ ఇప్పుడు ముంబయిపైనే నెలకొన్నాయి. గతరాత్రి డుప్లెసిస్‌ టీమ్ గుజరాత్‌పై గెలవడంతో ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉన్నాయి...

Published : 20 May 2022 11:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బెంగళూరు ఆశలన్నీ ఇప్పుడు ముంబయిపైనే నెలకొన్నాయి. గతరాత్రి డుప్లెసిస్‌ టీమ్ గుజరాత్‌పై గెలవడంతో ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉన్నాయి. అయితే, ఆ జట్టు నెట్‌రన్‌రేట్‌ (-0.253) తక్కువగా ఉండటంతో దాని భవితవ్యం ముంబయి, దిల్లీ జట్ల ఫలితంపై ఆధారపడింది. శనివారం రాత్రి జరిగే ఈ మ్యాచ్‌లో దిల్లీ గెలిస్తే తదుపరి దశకు చేరుకుంటుంది. ఒకవేళ ముంబయి గెలిస్తే బెంగళూరుకు అవకాశం దక్కుతుంది. ఈ నేపథ్యంలో ముంబయి గెలవాలని బెంగళూరు అభిమానులతో సహా ఆ జట్టు ఆటగాళ్లు కూడా ఇప్పుడు కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆ జట్టు మాజీ సారథి విరాట్‌ కోహ్లీనే స్వయంగా వెల్లడించాడు.

గతరాత్రి గుజరాత్‌పై విజయం సాధించాక కెప్టెన్‌ డుప్లెసిస్‌తో మాట్లాడుతూ విరాట్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ముంబయి గెలవాలని, అందుకోసం తాము ఇద్దరం మద్దతు తెలియజేస్తామని చెప్పాడు. మళ్లీ సరిచేసుకొని తాము ఇద్దరమే కాకుండా తమ జట్టులోని 25 మంది మద్దతు కూడా ముంబయికే ఉంటుందన్నాడు. వీలైతే తమని ముంబయి, దిల్లీ మ్యాచ్‌లో చూడొచ్చని కూడా అన్నాడు. ఈ వీడియోను టోర్నీ నిర్వాహకులు సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో బెంగళూరు, ముంబయి అభిమానులు సంబరపడుతున్నారు. కాగా, బెంగళూరు ప్రస్తుతం లీగ్‌ స్టేజ్‌లో అన్ని మ్యాచ్‌లు పూర్తిచేసుకొని 16 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. అయితే, దిల్లీ ఇంకా తమ చివరి మ్యాచ్‌ ఆడాల్సి ఉండగా 14 పాయింట్లతో కొనసాగుతోంది. నెట్‌రన్‌రేట్‌ (0.255) బెంగళూరు కన్నా మెరుగ్గా ఉంది. ఈ నేపథ్యంలో ముంబయిపై దిల్లీ గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకొంటుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని