Virat Kohli : మరో రికార్డుకు చేరువలో కోహ్లీ..

ఇప్పటికే ఎన్నో రికార్డులను సాధించిన టీమ్‌ఇండియా బ్యాటర్ విరాట్‌ కోహ్లీ.. తాజాగా మరో అరుదైన ఘనతకు చేరువయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే సిరీస్‌లో మరో 22 పరుగులు చేస్తే..

Published : 19 Jan 2022 11:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా బ్యాటర్ విరాట్‌ కోహ్లీ మరో అరుదైన ఘనతకు చేరువయ్యాడు. నేటి నుంచి జరగనున్న వన్డే సిరీస్‌లో మరో 22 పరుగులు చేస్తే.. సఫారీ జట్టుపై ప్రస్తుత టీమ్ఇండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌, 26 పరుగులు చేస్తే బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ సాధించిన పరుగుల రికార్డును అధిగమించనున్నాడు. 

దక్షిణాఫ్రికాలో 29 మ్యాచులు ఆడిన గంగూలీ 1,313 పరుగులు, 36 మ్యాచులు ఆడిన ద్రావిడ్‌ 1,309 పరుగులతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ 57 మ్యాచుల్లో 2,001 పరుగులు చేసి సఫారీ జట్టుపై అత్యధిక పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ప్రస్తుతం కోహ్లీ 1287 పరుగులతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవల అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత.. పూర్తి స్థాయి బ్యాటర్‌గా కోహ్లీ ఆడుతున్న తొలి వన్డే సిరీస్‌ ఇదే. దీంతో అతడి ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది. 2019 ఆగస్టులో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో చివరిసారిగా కోహ్లీ శతకం నమోదు చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 15 మ్యాచులు ఆడిన కోహ్లీ ఒక్క సెంచరీ కూడా చేయకపోవడం గమనార్హం. వీటిలో 8 అర్ధ శతకాలున్నా.. వాటిని శతకాలుగా మలచలేకపోయాడు. ఈ సారైనా ఆ భారీ ఇన్నింగ్స్‌ ఆడుతాడేమో చూడాలి.!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని