Virat Kohli: ఆ విషయమే నాకు బాధ కలిగించింది: విరాట్‌ కోహ్లీ

ప్రస్తుత 20 టోర్నీలో ఫామ్‌ కోల్పోయి తీవ్ర నిరశపర్చిన బెంగళూరు బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీ గతరాత్రి ఒక్క ఇన్నింగ్స్‌తో అందరినీ సంతోషంలో ముంచెత్తాడు...

Updated : 20 May 2022 10:19 IST

ఫామ్‌ అందుకున్నాక ఏం చెప్పాడంటే?

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుత టీ20 లీగ్‌లో ఫామ్‌ కోల్పోయిన బెంగళూరు బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీ గతరాత్రి ఒక్క ఇన్నింగ్స్‌తో అందరినీ సంతోషంలో ముంచెత్తాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఫామ్‌ అందుకోవడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన కోహ్లీ.. తన ఆటతీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌లో తాను జట్టు కోసం రాణించలేకపోయానని, దాంతో తీవ్ర నిరాశకు గురయ్యానని చెప్పాడు. గణాంకాలు కాకుండా ఆ విషయమే తనను మనోవేదనకు గురిచేసిందని వెల్లడించాడు.

‘ఈ మ్యాచ్‌లో నేను మా జట్టుపై ప్రభావం చూపించగలిగాను. దాంతో మా టీమ్‌ మంచిస్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో నాపై భారీ అంచనాలు ఉండడానికి కారణం ఇంతకుముందు నేను ఆడిన విధానమే. అలాంటప్పుడు మన ఆలోచనా విధానాన్ని సరైన దృక్పథంలో ఉంచుకోవాలి. అంచనాలకు తగ్గట్టు రాణించాలంటే కొన్ని విషయాలను పట్టించుకోవద్దు. నేనీ మ్యాచ్‌లో రాణించేందుకు చాలా కష్టపడ్డా. మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో 90 నిమిషాల పాటు సాధన చేశా. దీంతో చాలా ప్రశాంతంగా బరిలోకి దిగా. షమి బౌలింగ్‌లో తొలిషాట్‌ నుంచే బాగా ఆడతాననే నమ్మకం కలిగింది. ఫీల్డర్లపై నుంచి ఆడగలననే ఆత్మవిశ్వాసం లభించింది. అలాగే ఈ సీజన్‌లో అభిమానుల నుంచి మంచి మద్దతు లభించింది. వాళ్లందరి ప్రేమా ఆప్యాయతలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా’ అని విరాట్‌ హర్షం వ్యక్తం చేశాడు. కాగా, గుజరాత్‌ నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యఛేదనలో బెంగళూరు రెండు వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. విరాట్‌ (73), డుప్లెసిస్‌ (44), మాక్స్‌వెల్‌ (40*) దంచికొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని