Updated : 28/02/2021 17:20 IST

కొండంత లక్ష్యం పిండి చేసి.. 

ప్రపంచాన్ని మెప్పించి.. కింగ్‌ కోహ్లీగా మారి.. 

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీకి ఛేదనలో రారాజు, కింగ్‌ కోహ్లీ అనే పేర్లున్నాయి. ప్రత్యర్థి ఎవరైనా లక్ష్యం ఎంత పెద్దదైనా చిత్తుచేయడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. అలా టీమ్‌ఇండియా విజయాల్లో ఎన్నో గొప్ప పోరాటాలు చేశాడు. అయితే, కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది 2012 కామన్‌ వెల్త్‌ బ్యాంక్‌ ముక్కోణపు సిరీస్‌. భారత్‌-శ్రీలంక-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఆ టోర్నీలో విరాట్‌ ఓ ప్రత్యేక ఇన్నింగ్స్‌ ఆడాడు. లంకతో జరిగిన ఓ కీలక మ్యాచ్‌లో చెలరేగిపోయి తానేంటో నిరూపించుకున్నాడు. ఆ గొప్ప ఇన్నింగ్స్‌ ఆడి నేటికి తొమ్మిదేళ్లు పూర్తైన సందర్భంగా నాటి విశేషాలు మీకోసం..

దిల్షాన్‌, సంగక్కర దంచికొట్టుడు..

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక టీమ్‌ఇండియాపై భారీ స్కోర్‌ సాధించింది. దిల్షాన్(160; 165 బంతుల్లో 11x4, 3x6)‌, సంగక్కర(105; 87 బంతుల్లో 8x4, 2x6) శతకాలతో చెలరేగడంతో ఆ జట్టు 50 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 320 పరుగులు సాధించింది. ఫైనల్‌కు చేరాలంటే భారత్‌ ఆ లక్ష్యాన్ని 40 ఓవర్లలోనే ఛేదించాల్సిన పరిస్థితి. సహజంగా ఏ జట్టుకైనా 50 ఓవర్లలో అంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించడమంటేనే చాలా కష్టం. అలాంటిది 40 ఓవర్లలోనే టీమ్‌ఇండియా లక్ష్యాన్ని ఛేదించాలంటే అద్భుతం జరగాలని అంతా భావించారు. కానీ, ఆ అధ్బుతం పేరే విరాట్‌ కోహ్లీ అని తర్వాత నిరూపితమైంది.

కొండంత స్కోరును పిండి చేసి..

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దిగ్గజ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్‌(30), సచిన్‌ తెందూల్కర్‌(39) శుభారంభం చేశారు. ఇద్దరూ ఆరు ఓవర్లకే జట్టు స్కోరును 50 పరుగులు దాటించారు. దాంతో పెద్ద లక్ష్యాన్ని ఛేదించేందుకు అనువైన మార్గం కల్పించారు. అయితే, సెహ్వాగ్‌ ఏడో ఓవర్‌లో ఔటైన కాసేపటికే.. సచిన్‌ సైతం పెవిలియన్‌ చేరాడు. అప్పటికి టీమ్‌ఇండియా స్కోర్‌ 10 ఓవర్లకు 86/2గా నమోదైంది. తర్వాత జోడీ కట్టిన గంభీర్‌(63; 64 బంతుల్లో 4x4), విరాట్‌ కోహ్లీ (133*; 86 బంతుల్లో 16x4, 2x6) మూడో వికెట్‌కు శతక భాగస్వామ్యం నిర్మించారు. వీరు మొదట నెమ్మదిగా ఆడినా తర్వాత విజృంభించారు. ఈ క్రమంలోనే జట్టు స్కోర్‌ 201 వద్ద గౌతీ రనౌటయ్యాడు. అప్పటికి భారత్‌ 13 ఓవర్లలో 120 పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

రైనాతో విజయ ఢంకా..

గంభీర్‌ ఔటయ్యాక టీమ్‌ఇండియాపై ఒత్తిడి పెరిగింది. సాధించాల్సిన రన్‌రేట్‌ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో రైనా (40*; 24 బంతుల్లో 3x4, 1x6)తో కలిసి బ్యాటింగ్‌ చేసిన విరాట్‌.. లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. మలింగ, కులశేఖర, పర్వేజ్‌ మహరూఫ్‌, తిసారా పెరీరా ఎవరినీ వదలకుండ బౌండరీల వర్షం కురిపించాడు. దాంతో ఓవర్‌కు 10 పరుగుల చొప్పున స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కోహ్లీ తనలోని క్లాస్‌ బ్యాటింగ్‌ను పరిచయం చేశాడు. ఎక్కడా భారీ షాట్లకు పోకుండా చూడచక్కటి డ్రైవ్‌ షాట్లతో అలరించాడు. అసాధ్యం అనుకున్న లక్ష్యాన్ని సుసాధ్యం చేశాడు. చివరికి 36.4 ఓవర్లలోనే కొండంత లక్ష్యాన్ని పిండి చేసి తన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడాడు. అంతకుముందు విరాట్‌ 8 సెంచరీలు సాధించినా ఈ ఇన్నింగ్స్‌తోనే అతడికి మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది.

-ఇంటర్నెట్‌డెస్క్‌

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్