IND vs NZ: అయ్యో.. రివ్యూకు వెళ్లకపోవడం ఎంత పొరపాటు..!

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్‌ఇండియా మ్యాచ్‌పై పట్టు సాధించేలా కనిపిస్తోంది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగుతున్న భారత జట్టు ఈరోజు మరింత ధాటిగా ఆడాల్సిన అవసరం ఉంది...

Updated : 28 Nov 2021 12:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్‌ఇండియా మ్యాచ్‌పై పట్టు సాధించేలా కనిపిస్తోంది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగిస్తున్న భారత జట్టు ఈరోజు మరింత ధాటిగా ఆడాల్సిన అవసరం ఉంది. 300 పైచిలుకు ఆధిక్యం సంపాదించి చివరిరోజు సోమవారం భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తే మ్యాచ్‌ గెలిచే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాన్పూర్ పిచ్‌ స్పిన్‌కు సహకరిస్తున్న వేళ నాలుగో ఇన్నింగ్స్‌లో కివీస్‌ బ్యాటింగ్‌కు మరింత కష్టమయ్యే వీలుంది. దీంతో ఈరోజు భారత బ్యాటింగే కీలకం కానుంది. కాగా, ఈ విషయం పక్కనపెడితే.. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ ఓపెనర్లను ఔట్‌ చేయడానికి టీమ్‌ఇండియా బౌలర్లు ఎంత కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

టామ్‌ లాథమ్‌ (95; 282 బంతుల్లో 10x4), విల్‌ యంగ్‌ (89; 214 బంతుల్లో 15x4) తొలి వికెట్‌కు 151 పరుగులు జోడించి భారత్‌పై ఆధిపత్యం చెలాయించారు. ఆ తర్వాత పుంజుకున్న భారత్‌.. న్యూజిలాండ్‌ను 296 పరుగులకే ఆలౌట్‌ చేసింది. కివీస్‌ స్కోరులో సగం వీరిద్దరే సాధించారు. అందులో అదృష్టం కూడా కలిసొచ్చింది! ముఖ్యంగా శుక్రవారం రెండో రోజు ఆటలో న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌లో లాథమ్‌ పలుమార్లు ఔటయ్యే ప్రమాదాల నుంచి తప్పించుకున్నాడు. అతడిని పెవిలియన్‌ పంపే క్రమంలో భారత బౌలర్లు మూడుసార్లు అప్పీల్‌ చేయగా.. అంపైర్లు ఔటివ్వడం.. లాథమ్‌ రివ్యూకు వెళ్లడం.. అక్కడ నాటౌట్‌గా తేలడం  క్రమంగా జరిగాయి. ఈ క్రమంలోనే శనివారం సైతం అశ్విన్‌ వేసిన 73వ ఓవర్‌లో అతడు 66 పరుగుల వద్ద బ్యాటింగ్‌ చేస్తుండగా ఎల్బీడబ్యూగా ఔటయ్యాడు. అయితే, ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌ నాటౌటిచ్చాడు. దీంతో భారత్‌ కూడా రివ్యూకు వెళ్లకుండా మిన్నకుండిపోయింది. అప్పటికి చేతిలో రెండు రివ్యూలున్నా.. ఒకవేళ రివ్యూలో నాటౌట్‌గా తేలితే మరో అవకాశం పోతుందన్న ఉద్దేశంతో సైలెంట్‌గా ఉండిపోయింది. ఇక్కడే భారత్‌ తప్పులో కాలేసింది.

లాథమ్‌ ఎల్బీడబ్ల్యూ విషయంలో రివ్యూకు వెళ్లాల్సిందని తర్వాత తేలింది. ఎందుకంటే అశ్విన్‌ వేసిన ఆ బంతి వికెట్‌ టు వికెట్‌ నేరుగా పిచ్‌ అయి వికెట్ల మధ్య తాకేలా కనిపించింది. ఇది కచ్చితంగా వికెట్‌ దక్కే బంతి కావడం విశేషం. దీంతో అశ్విన్‌, కెప్టెన్‌ అజింక్య రహానె అసహనం వ్యక్తం చేయడం ఆ రీప్లేలో కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చివరికి అతడు శతకానికి ఐదు పరుగుల దూరంలో అక్షర్‌ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇన్నింగ్స్‌ 103వ ఓవర్‌లో సబ్‌స్టిట్యూట్‌ కీపర్‌ కేఎస్‌ భరత్‌ చేతిలో స్టంపౌటయ్యాడు. అంతకుముందు యువ ఓపెనర్‌ విల్‌ యంగ్‌ సైతం భరత్‌ చేతికే చిక్కి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఇక్కడా అంపైర్‌ తొలుత నాటౌటిచ్చినా భరత్‌ పట్టబట్టి మరీ రివ్యూకు వెళ్లేలా చేశాడు. అశ్విన్‌ వేసిన 67వ ఓవర్‌లోని ఆ బంతి విల్‌యంగ్‌ బ్యాట్‌ అంచులకు తాకుతూ కీపర్‌ చేతుల్లో పడినట్లు రీప్లేలో తేలింది. దీంతో భారత్‌కు తొలి వికెట్‌ దక్కింది. ఈ వీడియో కూడా నెట్టింట్లో వైరల్‌గా మారింది. తర్వాత న్యూజిలాండ్‌ వరుసగా వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని