7 తప్పులా.. క్షమించలేం.. మరిచిపోలేం..

ఐసీసీ మాజీ అంపైర్ స్టీవ్‌ బక్నర్‌ చేసిన పొరపాట్ల వల్ల 2008లో సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఓటమి పాలైందని టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు. తన తప్పులను అంగీకరించినప్పటికీ ఆయనను ....

Published : 26 Jul 2020 03:00 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ఐసీసీ మాజీ అంపైర్ స్టీవ్‌ బక్నర్‌ చేసిన పొరబాట్ల వల్ల 2008లో సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఓటమి పాలైందని టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ వెల్లడించాడు. తన తప్పులను అంగీకరించినప్పటికీ ఆయనను క్షమించే, మరిచిపోయే ఉద్దేశం తనకు లేదని పేర్కొన్నాడు! ఇదే మ్యాచ్‌లో ‘మంకీ గేట్‌’ వివాదం చోటు చేసుకోవడం గమనార్హం. స్టార్‌స్పోర్ట్స్‌లో క్రికెట్‌ కనెక్టెడ్‌ కార్యక్రమంలో పఠాన్‌ మాట్లాడాడు.

‘కేవలం అంపైరింగ్‌ పొరపాట్లతో టెస్టు మ్యాచ్‌ ఓడిపోవడమంటే మాటలు కాదు. తప్పులు చేశానని అంపైర్‌ ఇప్పుడేం చెప్పినా లెక్కలోకి రాదు. క్రికెటర్లుగా తప్పుడు నిర్ణయాలకు మేం  అలవాటు పడతాం. కానీ సిడ్నీ టెస్టులో జరిగింది ఒక్కటా? ఏకంగా ఏడు పొరపాట్లు జరిగాయి. ఆండ్రూ సైమండ్స్‌ మూడుసార్లు ఔటయ్యాడని గుర్తు. అయినా అంపైర్‌ ఔటివ్వలేదు’ అని పఠాన్‌ గుర్తుచేసుకున్నాడు.

‘ఆ మ్యాచ్‌లో సైమండ్స్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌. మేం 122 పరుగుల తేడాతో ఓడిపోయాం. సైమండ్స్‌పై ఒక్క నిర్ణయం సరిగ్గా తీసుకున్నా మేం సులభంగా మ్యాచ్‌ గెలిచేవాళ్లం. నేను చిరాకు పడటం లేదు. కానీ తొలిసారి టీమ్‌ఇండియా క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేయడం తొలిసారి చూశాను. అభిమానులైతే అంపైర్‌ ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేస్తున్నాడని  అనుకున్నారు. తప్పులు జరుగుతూనే ఉంటాయని సర్దుకుపోతాం. కానీ ఏడు పొరపాట్లా? దీనిని ఎవ్వరూ జీర్ణించుకోలేరు’ అని ఇర్ఫాన్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని