సంతోషంలో రాహుల్‌, కుంబ్లే!

ఐపీఎల్‌ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ల పట్ల కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, కోచ్‌ అనిల్‌ కుంబ్లే సంతోషంగా ఉన్నారని పంజాబ్‌ కింగ్స్‌ సహ యజమాని నెస్‌వాడియా అన్నారు. అవసరమైన క్రికెటర్లు దొరకడంతో ఇక మైదానంలోకి దిగి అద్భుతంగా ఆడటమే మిగిలుందని పేర్కొన్నారు. జట్టు పేరును మార్చాలని...

Published : 20 Feb 2021 22:53 IST

2019 నుంచే పేరు మార్పుపై ఆలోచించాం: నెస్‌ వాడియా

(Image: Twitter)

ముంబయి: ఐపీఎల్‌ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ల పట్ల కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, కోచ్‌ అనిల్‌ కుంబ్లే సంతోషంగా ఉన్నారని పంజాబ్‌ కింగ్స్‌ సహ యజమాని నెస్‌వాడియా అన్నారు. అవసరమైన క్రికెటర్లు దొరకడంతో ఇక మైదానంలోకి దిగి అద్భుతంగా ఆడటమే మిగిలుందని పేర్కొన్నారు. జట్టు పేరును మార్చాలని రెండేళ్లుగా భావిస్తున్నామని ఆయన వెల్లడించారు. ‘కింగ్స్‌ XI పంజాబ్’‌తో పోలిస్తే ‘పంజాబ్‌ కింగ్స్‌’ అభిమానులను మరింత ఆకట్టుకుంటుందని ధీమాగా ఉన్నారు.

‘చాలా అంశాలను మార్చాలని మేం భావించాం. చాలా ఏళ్లు గడవడంతో మమ్మల్ని మేం రీబ్రాండ్‌ చేసుకోవాల్సిన అవసరముందని నిర్ణయించుకున్నాం. కొన్ని సవ్యంగా సాగకపోతే మార్పుచేసి ప్రయత్నించాలన్నది తెలిసిందే కదా’ అని నెస్‌వాడియా అన్నారు.

‘కింగ్స్‌ XI పంజాబ్‌ అనేది పదకొండు మందినే ప్రతిబింబిస్తోంది. పంజాబ్‌ కింగ్స్‌ మరింత సమ్మిళితంగా ఉంది. ఎక్కువ మందిని ఆకట్టుకునేలా ఉంటుంది. రెండు మూడేళ్లుగా పేరు మార్పుపై సమాలోచించాం. 2020లో కొవిడ్‌ రావడంతో ఆపేశాం. వచ్చే ఏడాది భారీ వేలంలో లేదా ఈ సారి చిన్న వేలంలోనైనా మారుద్దామని అనుకున్నాం. చివరికి ఇదే ఏడాది మార్పు చేశాం’ అని వాడియా పేర్కొన్నారు.

యూఏఈలో భారీ సంఖ్యలో కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయని వాడియా తెలిపారు. ఇప్పటికైతే భారత్‌ సురక్షితంగా కనిపిస్తోందని స్పష్టం చేశారు. గతేడాది మాదిరిగానే కఠిన నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ‘ఈసారి స్టేడియంలోకి అభిమానులు వస్తారు. పూర్తి స్థాయిలో అనుమతిస్తారని మాత్రం అనుకోను. ఏదేమైనా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పగలను. టోర్నీకి ఇంకా రెండు నెలల సమయం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. 9 లేదా 10 జట్ల ఐపీఎల్‌ గురించి మాట్లాడుతూ ‘9 జట్లతో నిర్వహణ బాగుంటుందని అనుకోను. పదైతే మంచి సంఖ్య. బ్రాండ్‌ను విస్తరించినట్టూ అవుతుంది. అభిమానులూ పెరుగుతారు. ఐపీఎల్‌ అవకాశం ఎక్కువ మందికి దొరుకుతుంది’ అని ఆయన వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని