T20 World Cup: ధోనీని సుదీర్ఘ కాలం మెంటార్‌గా ఉంచాలనుకుంటున్నాం: గంగూలీ

భారత జట్టుకు ఎం.ఎస్‌.ధోనీని సుదీర్ఘకాలంపాటు మెంటార్‌గా నియమించాలనుకుంటున్నట్లు టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అన్నారు. ధోనీని మెంటార్‌గా నియమించాలనే నిర్ణయం రాత్రికి రాత్రే తీసుకున్నది కాదని గంగూలీ పేర్కొన్నాడు.ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌నకు ధోనీ

Published : 22 Oct 2021 22:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత జట్టుకు ధోనీని సుదీర్ఘకాలం పాటు మెంటార్‌గా నియమించాలని అనుకుంటున్నట్లు టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అన్నారు. ధోనీని మెంటార్‌గా నియమించాలనే నిర్ణయం రాత్రికి రాత్రే తీసుకున్నది కాదని గంగూలీ పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌నకు ధోనీ టీమ్‌ఇండియాకు మెంటార్‌గా నియమితుడైన సంగతి తెలిసిందే. ‘ధోనీ సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై నేను, జైషా (బీసీసీఐ కార్యదర్శి) చాలాకాలంగా చర్చించుకుంటున్నాం. అతడు రెండు ప్రపంచ కప్‌లను సాధించి పెట్టాడు. ఇంకా పూర్తిగా క్రికెట్‌కు దూరం కాలేదు. ధోనీ చేరిక జట్టుకు అదనపు బలమవుతుందని మేం భావిస్తున్నాం. ఏం జరుగుతుందో వేచిచూద్దాం’’ అని గంగూలీ అన్నారు.

ధోనీ, హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ విరాట్ కోహ్లి మధ్య ఇగో ప్రాబ్లమ్స్‌ ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు ‘వారందరూ పెద్ద ఆటగాళ్లు. నాకు ఎలాంటి సమస్యలు కనిపించడం లేదు. ధోనీ పరిణతి చెందిన వ్యక్తి. అతడికి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలుసు. వీటన్నింటి గురించి చర్చించాం. మంచి జరుగుతుందని ఆశిద్దాం. ఇప్పటివరకైతే ధోనీ టీ20 ప్రపంచకప్‌ వరకు మాత్రమే మెంటార్‌గా కొనసాగుతాడు’ అని గంగూలీ వివరించారు. విరాట్ కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపైనా గంగూలీ స్పందించారు. విరాట్‌ తీసుకున్న నిర్ణయంలో బీసీసీఐ పాత్ర లేదని, అది అతడి వ్యక్తిగత నిర్ణయం అని గంగూలీ అన్నారు. కోహ్లి తీసుకున్న నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని దాదా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని