కోహ్లీ అలా చేసేసరికి కన్నీళ్లు వచ్చాయి

ఆస్ట్రేలియాపై గెలిచిన టీ20 సిరీస్‌ ట్రోఫీని టీమిండియా కెప్టెన్‌‌ విరాట్ కోహ్లీ తన చేతుల్లో పెట్టినప్పుడు...

Updated : 25 Jan 2021 19:07 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియాపై గెలిచిన టీ20 సిరీస్‌ ట్రోఫీని టీమిండియా కెప్టెన్‌‌ విరాట్ కోహ్లీ తన చేతుల్లో పెట్టినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యానని యువ పేసర్‌ నటరాజన్‌ తెలిపాడు. ఆ క్షణాన కన్నీళ్లు వచ్చాయని అన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్‌ 2-1తో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రదానోత్సవంలో భారత కెప్టెన్‌గా ట్రోఫీని అందుకున్న కోహ్లీ.. ఆ తర్వాత కప్‌ను నటరాజన్‌ చేతిలో పెట్టాడు.

‘‘టీ20 సిరీస్‌ విజయానంతరం కోహ్లీ ట్రోఫీని నా చేతుల్లో పెట్టాడు. ఆ క్షణాన కన్నీళ్లు వచ్చాయి. కోచ్‌లు, సహచర ఆటగాళ్లు నాకెంతో మద్దతుగా నిలిచారు. నాలో స్ఫూర్తి నింపారు. వాళ్ల అండతోనే మెరుగ్గా బౌలింగ్‌ చేయగలిగా. కోహ్లీ, రహానె నాయకత్వంలో ఆడడాన్ని ఎంతో ఆస్వాదించా. వాళ్లు నన్ను బాగా చూసుకున్నారు. సానుకూల విషయాలు చెప్పి ప్రోత్సహించారు’’ అని నటరాజన్‌ పేర్కొన్నాడు.

‘‘ఐపీఎల్‌లో భారత, విదేశీ ఆటగాళ్లతో కలిసి ఆడటం వల్ల ఆటను ఎంతో మెరుగుపర్చుకున్నాను. వాళ్లతో మాట్లాడుతూ కొత్త విషయాలు నేర్చుకున్నాను. కాగా, నా ప్రదర్శన పట్ల ఎంతో గర్వపడుతున్నాని వార్నర్‌ చెప్పాడు. టీమిండియా తరఫున ఆడుతున్నందకు అతడు ఎంతో సంతోషించాడు. ఆసీస్‌తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో నాతో మాట్లాడాడు. నేను అదృష్టవంతుడ్ని అని, కూతురు జన్మించడం వల్ల కలిసొస్తుందన్నాడు’’ అని నటరాజన్‌ తెలిపాడు. ఆస్ట్రేలియా పర్యటనకు తొలుత నెట్‌బౌలర్‌గా వెళ్లిన నటరాజన్‌ అన్నిఫార్మాట్లలో ఆడిన సంగతి తెలిసిందే. ఒకే పర్యటనలో మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.

ఇదీ చదవండి

పంత్‌ను ఆటపట్టించిన చాహల్‌, రషీద్‌

కుంబ్లేను ఎదుర్కోడానికి ద్రవిడ్‌ సాయం: తైబు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని