WWE: భారత రెజ్లర్‌ కవితా దేవికి రాంరాం! 

రెజ్లింగ్‌ రంగంలో WWE గురించి తెలియని వారు ఉండరు. అది అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందిన వినోదాత్మక క్రీడా రంగాల్లో ఒకటి...

Updated : 22 May 2021 09:58 IST

ది ‘గ్రేట్‌ ఖలీ’ శిష్యురాలి గురించి తెలుసా?

రెజ్లింగ్‌ రంగంలో WWE గురించి తెలియని వారు ఉండరు. అది అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందిన వినోదాత్మక క్రీడల్లో ఒకటి. గతంలో WWFగా ప్రఖ్యాతిగాంచిన ఈ రెజ్లింగ్‌ పోటీ దశాబ్ద కాలంగా WWE పేరుతో కొనసాగుతోంది. అయితే, తాజాగా అందులో నుంచి భారత తొలి మహిళా రెజ్లర్‌ కవిత దేవిని తొలగించారు. తమ వ్యయాలను తగ్గించుకునే క్రమంలో పలువురు స్టార్‌ రెజ్లర్లతో పాటు ఆమెను కూడా తొలగించారు. అసలు కవిత ఎవరు? ఆమె నేపథ్యం ఏంటో తెలుసుకుందాం..


WWEతోనే గుర్తింపు..

కవితది హరియాణాలోని జింద్‌ జిల్లా మాల్వీ గ్రామం. అసలు పేరు కవిత దలాల్‌. చిన్నప్పటి నుంచి కుస్తీ పోటీల్లో పాల్గొని చివరికి WWE లాంటి ప్రపంచ ప్రఖ్యాత ప్రొఫెషనల్‌ పోటీల్లో రెజ్లర్‌గా ఎదిగింది. 2017లో అక్కడికి వెళ్లిన తర్వాతే ఆమెకు గుర్తింపు దక్కింది. అక్కడ కొద్ది నెలలు శిక్షణ పొందిన ఆమె తర్వాత లైవ్‌ ఈవెంట్లలో పాల్గొని భారత అభిమానులను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ‘కవిత దేవి’గా రింగ్‌ పేరుతో బరిలోకి దిగి ప్రత్యేక గుర్తింపు సాధించింది. అలా ప్రపంచ రెజ్లింగ్‌ పోటీల్లో భారత్‌ నుంచి ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళా రెజ్లర్‌గా కవిత రికార్డు నెలకొల్పింది. అంతకుముందు ‘ది గ్రేట్‌ ఇండియన్‌ రెజ్లర్‌ ఖలీ’ వద్ద శిక్షణ పొందింది.


స్వర్ణ పతకం.. గర్వకారణం..

హరియాణా అంటేనే కుస్తీ, మల్ల యుద్ధాలకు పెట్టింది పేరు. తొలుత వ్యక్తిగత ప్రదర్శనలు ఇస్తూ క్రమంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే పోటీల్లో పాల్గొనేది కవిత. అలా తన శక్తిని పెంచుకుంటూ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకుంది. 2016 దక్షిణాసియా క్రీడల్లో 75 కేజీల వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో స్వర్ణ పతకం సాధించింది. దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఇక అదే సమయంలో స్టార్‌ రెజ్లర్‌ ‘ఖలీ’ పంజాబ్‌లో ఏర్పాటు చేసిన రెజ్లింగ్‌ ప్రమోషన్‌, ట్రైనింగ్‌ అకాడమీలో శిక్షణ పొంది ప్రొఫెషనల్‌ పోటీల్లో ప్రాథమిక మెలకువలు నేర్చుకుంది. అలా 2016లో కాంటినెంటల్‌ రెజ్లింగ్‌ పోటీల్లో ‘కవిత, హార్డ్‌ కేడీ’ అనే రింగ్‌ పేర్లతో సత్తా చాటింది. అయితే, తాను ప్రొఫెషనల్‌ రెజ్లర్‌గా ఎదగడానికి ఖలీనే స్ఫూర్తి అని కవిత చెబుతుంటుంది.


రెజిల్‌ మేనియాతో రంగ ప్రవేశం..

2017 అక్టోబర్‌లో WWE కవితతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. దాంతో ఆమె అంతర్జాతీయ స్థాయిలో ప్రొఫెషనల్‌ రెజ్లర్‌గా గుర్తింపు సాధించింది. అక్కడ కొద్ది నెలలు శిక్షణ పొందాక 2018 ఏప్రిల్‌లో తొలిసారి WWE పోటీల్లో తలపడింది. రెజిల్ మేనియా 34వ వార్షికోత్సవ పోటీల్లో మహిళల విభాగంలో సారా లాగన్‌ అనే మరో రెజ్లర్‌తో పోటీపడింది. అయితే, ఇక్కడ కవిత ఓటమిపాలైంది. ఆపై NXT లైవ్‌ ఈవెంట్‌లో ఆలియా అనే మరోరెజ్లర్‌తో కలిసి డకోటా కై, స్టిఫానీ న్యూవెల్‌ అనే ప్రత్యర్థులతో తలపడింది. ఇక్కడ కూడా కవిత ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలోనే 2018 ‘మేయంగ్‌ క్లాసిక్‌’ ఈవెంట్‌లో పాల్గొని తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. అయితే 2019 జులైలో చివరిసారి పోటీ పడిన కవిత తర్వాత వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వచ్చింది. కానీ, అనుకోని పరిస్థితుల కారణంగా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఆమెను తొలగిస్తున్నట్లు WWE వెల్లడించింది.  - ఇంట‌ర్నెట్ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని