Updated : 15/12/2020 10:44 IST

షమి, బుమ్రా: 20 కంగారూల వేట!

2018 మాయాజలానికి సిద్ధమేనా?

ఒక టెస్టు మ్యాచు గెలవాలంటే కేవలం పరుగులు చేస్తే సరిపోదు. 20 వికెట్లు తీయాలి. అలా పడగొట్టని పక్షంలో ఆటగాడి సహనానికి ఆటే పరీక్ష పెడుతుంది. నీ సత్తా ఇంతేనా అని ప్రశ్నిస్తుంది. జట్టును ఓటమి వైపు నడిపిస్తుంది. అందుకే సుదీర్ఘ ఫార్మాట్లో ఓటమిని అడ్డుకొనేది బ్యాట్స్‌మెన్‌ అయితే విజయతీరాలకు చేర్చేది మాత్రం బౌలర్లే. 2018లో ఆసీస్‌ గడ్డపై చెలరేగిన టీమ్‌ఇండియా పేసు గుర్రాలు.. స్పిన్‌ మాయగాళ్లు 2020లో సవాల్‌కు సిద్ధమేనా?


టీమ్‌ఇండియా బౌలర్ల ఆధిపత్యం

భారత సుదీర్ఘ క్రికెట్‌ చరిత్రలో అప్పటి వరకు ఆస్ట్రేలియాను దాని సొంతగడ్డపై మట్టికరిపించిన సందర్భమే లేదు. అలాంటిది 2018లో 2-1తో కంగారూలను ఓడించి బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది టీమ్‌ఇండియా. ఇందుకు ప్రధాన కారణం ఒక్కటే. ఆసీస్‌ బ్యాటింగ్‌ దళంపై భారత బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించడమే. ఎక్కువసార్లు ఆ జట్టును ఆలౌట్‌ చేయడమే. ఎనిమిది ఇన్నింగ్సుల్లో టిమ్‌పైన్‌ సేనను ఏడుసార్లు పెవిలియన్‌కు చేర్చింది బుమ్రా దళం. లేదంటే కోహ్లీసేనకు ఈ అద్భుతం సాధ్యమయ్యేదే కాదు! బుమ్రాతో పాటు మహ్మద్‌ షమి, ఇషాంత్‌ శర్మ చురకత్తుల్లాంటి బంతులు విసిరితే రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ తమ స్పిన్‌ మాయాజాలం ప్రదర్శించారు. సమయోచితంగా వికెట్లు తీశారు.


పేసు గుర్రం దెబ్బకు విలవిల

గత పర్యటనలో టీమ్‌ఇండియా బౌలింగ్‌ దళం ప్రదర్శనకు విశ్లేషకులంతా ఫిదా అయ్యారు. కంగారూ బ్యాట్స్‌మెన్‌ అయితే విలవిల్లాడారు. భారత బౌలర్లలాగా తామెందుకు సత్తా చాటడం లేదని ఆసీస్‌ పేసర్లే మథనపడటం గమనార్హం. ఎందుకంటే మనోళ్లు 70 వికెట్లు తీస్తే వాళ్లు 48 మాత్రమే తీశారు మరి. ఆ సిరీసులో పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా సవారీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతకుముందు అతనెప్పుడూ అక్కడ ఆడనేలేదు. అలాంటిది తొలిసారే ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. తక్కువ రన్నప్‌, అర్థంకాని బౌలింగ్‌ శైలి, బంతి బంతికీ వైవిధ్యం, తికమక పెట్టే బంతి విసిరే కోణం, బ్యాట్స్‌మెన్‌ బుర్రను ముందే చదివే తత్వంతో దుమ్మురేపాడు. 4 మ్యాచుల్లో 17 సగటు, 2.27 ఎకానమీ, 44.9 స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 21 వికెట్లు తీశాడు. విసిరిన 157 ఓవర్లలో 48 మెయిడిన్లే ఉన్నాయంటేనే అతడి బౌలింగ్‌ పదును అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఇన్నింగ్స్‌లో కనీసం 2 లేదా 3 వికెట్లు తీశాడు. ఇక మెల్‌బోర్న్‌లో జరిగిన మూడో టెస్టులో అతడి ధాటికి కంగారూలు దడుచుకున్నారు! 9/86తో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. హ్యారిస్‌, ఫించ్‌, షాన్‌ మార్ష్‌, ట్రావిస్‌ హెడ్‌, టిమ్‌పైన్‌, లైయన్‌, హేజిల్‌వుడ్‌ను పెవిలియన్‌ పంపించాడు. దాంతో ఆసీస్‌ 66.5 ఓవర్లకు 151 పరుగులకే ఇన్నింగ్స్‌ ముగించేసింది.


గర్జించిన షమి.. తోడుగా ఇషాంత్‌

‘స్పైడర్‌ కెమెరాలోంచి షమి రన్నప్‌ చూస్తుంటే వేటాడేందుకు పరుగెత్తే చిరుతపులిని చూసినట్టుంది’ - ఫిట్‌నెస్‌ పెంచుకొని జట్టులోకొచ్చి అద్భుతంగా బంతులేస్తున్న మహ్మద్‌ షమి గురించి సన్నీ గావస్కర్‌ చెప్పిన మాటిది. వేధిస్తున్న కుటుంబ కలహాలను పక్కనపెట్టి, బరువు తగ్గి, దేహదారుఢ్యం పెంచుకున్నాక షమిలో 2.0 వెర్షన్ బౌలింగ్‌‌ కనిపిస్తోంది. గత ఆస్ట్రేలియా పర్యటనలో అతడు సింహగర్జన చేశాడు. 4 మ్యాచుల్లో 51.25 స్ట్రైక్‌రేట్‌తో 16 వికెట్లు తీశాడు. ఒక ఎండ్‌లో బుమ్రా చెలరేగితే మరో ఎండ్‌లో షమి విజృంభించాడు. ప్రత్యర్థి ఆటగాళ్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. సమయోచితంగా వికెట్లు తీశాడు. పెర్త్‌లో 6/56తో అతడు చెలరేగిన తీరు ఇంకా గుర్తుండే ఉంటుంది. ఈ ఆరుగురూ క్యాచ్‌ ఔట్ల రూపంలోనే వెనుదిరిగారు. టీమ్ఇండియా సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ సైతం ఈ పర్యటనలో సమయోచితంగా వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 3 మ్యాచుల్లో 11 వికెట్లు తీశాడు. ప్రతి ఇన్నింగ్స్‌లో ఒకటి లేదా రెండు వికెట్లు పడగొట్టాడు. పెర్త్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 4/41తో అదరగొట్టాడు. ఇక రవీంద్ర జడేజా 2 మ్యాచుల్లో 7, అశ్విన్‌ ఒక మ్యాచులో 6 వికెట్లు పడగొట్టారు.


సిరాజ్‌.. సైనికి మార్గనిర్దేశం

ఈ ఏడాది టీమ్‌ఇండియా కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడింది. న్యూజిలాండ్‌లో జరిగిన ఈ రెండు పోటీల్లో 10 వికెట్లు, 7 వికెట్ల తేడాతో కోహ్లీసేన ఓటమి పాలైంది. బుమ్రా (6), ఇషాంత్‌ శర్మ (5), మహ్మద్‌ షమి (5), అశ్విన్‌(3) ఫర్వాలేదనిపించారు. కరోనా మహమ్మారి వల్ల ఈసారి భారత్‌ ఎక్కువ టెస్టులు ఆడలేకపోయింది. అయితే యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లో బుమ్రా, షమి, యాష్‌ ప్రదర్శన ఆకట్టుకుంది. వన్డే సిరీసులో కాస్త తడబడ్డా తర్వాత లయ అందుకున్నట్టే కనిపించారు. గత పర్యటన ప్రదర్శనే పునరావృతం చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. సన్నాహక పోరులో అదరగొట్టారు. సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ లేకపోవడం మాత్రం లోటే. తన బౌలింగ్‌ శైలిని మార్చుకున్నాక అతడి బంతుల్లో వైవిధ్యం కనిపిస్తోంది. అతడి గైర్హాజరీలో ఉమేశ్‌ యాదవ్‌ కీలకమవుతాడు. ఇక యువ పేసర్లు నవదీప్‌ సైని, మహ్మద్‌ సిరాజ్‌ ఆశలు రేపుతున్నారు. ఆసీస్‌ పిచ్‌లు వీరి బౌలింగ్‌ తీరుకు నప్పుతాయి. కానీ ఈసారి టెస్టుల్లో నంబర్‌ వన్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌, ప్రమాదకర డేవిడ్‌ వార్నర్‌ ఆసీస్‌ జట్టులోకి వచ్చారు. కుర్రాళ్లకు మార్గనిర్దేశం చేస్తూ బుమ్రా, షమి, ఉమేశ్‌, అశ్విన్‌ ఏం చేస్తారో చూడాలి!

-ఇంటర్నెట్‌ డెస్క్‌

ఇవీ చదవండి..

కోహ్లీ.. తర్వాతే మోదీ..  

బ్యాట్‌తో చుక్కలు.. బంతితో నిప్పులు..

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని