Sushil: ముందస్తు బెయిల్‌కు సుశీల్‌ దరఖాస్తు

భారత అగ్రశ్రేణి రెజ్లర్‌, ఒలింపిక్‌ పతక విజేత సుశీల్‌ కుమార్‌ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. దిల్లీలోని రోహిణి కోర్టులో మధ్యాహ్నం....

Updated : 18 May 2021 19:09 IST

దిల్లీ: భారత అగ్రశ్రేణి రెజ్లర్‌, ఒలింపిక్‌ పతక విజేత సుశీల్‌ కుమార్‌ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. దిల్లీలోని రోహిణి కోర్టులో మధ్యాహ్నం తర్వాత అతడి బెయిల్‌పై విచారణ జరగనుందని సమాచారం. సాగర్‌ దంకడ్‌ అనే యువ రెజ్లర్‌ హత్య కేసులో అతడిపై అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే.

ఛత్రసాల్‌ స్టేడియంలో కొన్నాళ్ల క్రితం సాగర్‌ దంకడ్‌పై దాడి జరిగింది. తీవ్రంగా గాయపడ్డ ఆ యువ రెజ్లర్‌ మరణించాడు. అప్పట్నుంచి సుశీల్‌ కుమార్‌ పోలీసుల కంట పడకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. దాడికి పాల్పడిన మిగతా వారిని విచారించగా అందులో సుశీల్‌ హస్తం ఉన్నట్టు తెలిసింది. పోలీసులు ఎనిమిది బృందాలుగా వారం రోజుల్నుంచి అతడి కోసం గాలిస్తున్నారు.

మూడు రోజుల క్రితం దిల్లీ పోలీసులు సుశీల్‌పై లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. సోమవారం అతడి జాడ చెప్పిన వారికి రూ.లక్ష బహుమానం ఇస్తామని ప్రకటించారు. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ సైతం జారీ చేశారు. ఇన్నాళ్లూ తప్పించుకొని తిరిగిన సుశీల్‌ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నాడని తాజాగా తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని