లోహాల పంట!

ఐరన్‌, నికెల్‌, మాంగనీస్‌.. ఇలాంటి లోహాలను ఎప్పుడూ తవ్వి తీసుకోవడమేనా? గనుల పేరుతో భూమాత గుండెకు చిల్లులు పెట్టటమేనా? హాయిగా చెట్లను పెంచి వాటి నుంచి లోహాలను సేకరించలేమా? అంటే మామిడి, కొబ్బరి, పనస వంటివి సాగు చేసినట్టు లోహాలను పండిస్తే ఎంత బాగుంటుంది? ఊహించుకోవటానికి ఎంత బాగుందో కదా. శాస్త్రవేత్తల పుణ్యమాని ఇప్పుడదే నిజం కాబోతోంది. ఇప్పటికే కొన్నిచోట్ల ‘లోహాల సాగు’ ఆరంభమైంది కూడా.

Updated : 28 Apr 2021 10:35 IST

ఐరన్‌, నికెల్‌, మాంగనీస్‌.. ఇలాంటి లోహాలను ఎప్పుడూ తవ్వి తీసుకోవడమేనా? గనుల పేరుతో భూమాత గుండెకు చిల్లులు పెట్టటమేనా? హాయిగా చెట్లను పెంచి వాటి నుంచి లోహాలను సేకరించలేమా? అంటే మామిడి, కొబ్బరి, పనస వంటివి సాగు చేసినట్టు లోహాలను పండిస్తే ఎంత బాగుంటుంది? ఊహించుకోవటానికి ఎంత బాగుందో కదా. శాస్త్రవేత్తల పుణ్యమాని ఇప్పుడదే నిజం కాబోతోంది. ఇప్పటికే కొన్నిచోట్ల ‘లోహాల సాగు’ ఆరంభమైంది కూడా.
చెట్లే మన భూమికి శ్రీరామ రక్ష. వేళ్ల ద్వారా భూమి నుంచి నీటిని, ఖనిజ లవణాలను సంగ్రహించి, వాటిని ఎన్నో రకాలుగా మనకు అందిస్తుంటాయి చెట్లు. కేవలం ఖనిజ లవణాలను సంగ్రహించటమే కాదు, వాటిని నిల్వ చేసుకుంటాయి కూడా. కొన్ని చెట్లయితే అసాధారణ స్థాయిలో దాచిపెట్టుకుంటుంటాయి. ఒకరకంగా వేళ్ల అయస్కాంతంతో లోహాలను ఆకర్షిస్తాయన్నమాట. లోహాలు దండిగా నిక్షిప్తమై ఉన్న నేలల్లో మిగతా మొక్కలు, చెట్లు బతకలేక చేతులెత్తేస్తే ఇవి మాత్రం బోర విరుచుకొని ‘లోహ’ స్తంభాలుగా ఎదుగుతుంటాయి. వీటి నుంచి లోహాలను ఎందుకు సంగ్రహించకూడదు? కిలోమీటర్ల కొద్దీ గనులు తవ్వటం తప్పుతుంది కదా? మెల్‌బోర్న్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్త అలన్‌ బాకర్‌ ఇలాగే ఆలోచించారు. ఆయన 1970ల్లోనే ఇలాంటి చెట్లపై పరిశోధనలు ఆరంభించారు. తన ఆలోచనలను అంతర్జాతీయ బృందంతో పంచుకొని, మలేసియాలోని ఓ మారుమూల ప్రాంతంలో వినూత్నంగా ప్రాజెక్టును ఆరంభించారు. స్థానికులతో నికెల్‌ను పెద్దమొత్తంలో సంగ్రహించే ఫైలాంతస్‌ బల్గూయీ చెట్ల పెంపకం చేపట్టారు.

ఆలోచన పాతదే కానీ..
చెట్లు లోహాలను సంగ్రహించి, దాచుకుంటాయనే సంగతిని జార్జియస్‌ అగ్రికోలా 500 ఏళ్ల క్రితమే గుర్తించారు. ఆయన తన ఖాళీ సమయాల్లో వృక్షాలను వాసన చూస్తుండేవారు. ఆకుల్లో ఏముందో తెలుసుకోవాలంటే ముందు అక్కడి భూముల్లో ఎలాంటి లోహాలున్నాయో చూడాలని 16వ శతాబ్దంలోనే తన పుస్తకాల్లో రాసుకున్నారు. ఇదే వృక్షాల నుంచి లోహ సంగ్రహణ ఆలోచనకు పునాది వేసిందనుకోవచ్చు. అమెరికా వ్యవసాయ శాస్త్రవేత్త రఫస్‌ చానే దీనికి 1983లో ఫైటోమైనింగ్‌ అని పేరు పెట్టారు. దీన్ని ఆగ్రోమైనింగ్‌ అనీ పిలుచుకుంటున్నారు. తాజాగా డాక్టర్‌ బాకర్‌ లోహాల సాగును కొత్త పుంతలు తొక్కించటం ఆరంభించారు. ఇది సంప్రదాయ గనుల తవ్వకానికి పూర్తి ప్రత్యామ్నాయం కాకపోవచ్చు గానీ విషతుల్య నేలలను ఉత్పాదక వనరులుగా తీర్చిదిద్దుకోవచ్చన్నది బాకర్‌ ఆలోచన.
ఎలా తీస్తారు?
చెట్లలో లోహాలు ఉంటాయి సరే. వాటిని వెలికి తీయటమెలా? వీటి ఆకులు, బెరడును ఎండించి.. బూడిదగా మారుస్తారు. దీన్నే ఒకరకంగా ‘బయో-ఓర్‌’ అనుకోవచ్చు. దీన్ని శుద్ధి చేసి, ప్రామాణిక హైడ్రోమెటలర్జికల్‌ పద్ధతుల సాయంతో లోహాలను వెలికితీస్తారు. బాకర్‌ ఆరంభించిన ప్రాజెక్టులో భాగంగా ఇలా ప్రతి ఆరు నెలలు, 12 నెలలకు ఒకసారి సుమారు 250 కిలోల నికెల్‌ సిట్రేట్‌ను వెలికి తీస్తున్నారు. ఇది విజయవంతం కావటంతో మరింత పెద్ద విస్తీర్ణంలో ‘లోహాలు’ పండించటమూ ఆరంభించారు. మున్ముందు ఇది కొబ్బరికాయలు, కాఫీ మాదిరిగా పెద్ద వ్యవసాయ పరిశ్రమగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదంటోంది బాకర్‌ బృందం. యూనివర్సిటీ ఆఫ్‌ క్వీన్స్‌ల్యాండ్‌ వృక్ష శాస్త్రవేత్త డాక్టర్‌ ఆంటోనీ అన్ని రకాల లోహాలను సంగ్రహించే మాకడామియా చెట్టు మీద దృష్టి సారించారు. దీని ఆకులు, కాండం సారంలో మాంగనీస్‌ ఉంటుంది. ఇలాంటి చెట్లు 700 వరకు ఉన్నాయని అంచనా.

భవిష్యత్తు ఆశ..
స్టెయిన్‌లెస్‌ స్టీలులో నికెల్‌ చాలా కీలక మూలకం. ఎలక్ట్రిక్‌ వాహనాలు, పునరుత్పాదక ఇంధనాల తయారీలో దీని రసాయన మిశ్రమాలను విరివిగా వాడుకుంటున్నారు. పెద్ద మొత్తంలో మనుషులకు హాని చేసినట్టుగానే వృక్షాలకూ విషతుల్యంగా పరిణమిస్తుందిది. నికెల్‌ను తవ్వినచోట, శుద్ధి చేసిన చోట నేల దెబ్బతింటుంది. చివరికి నిరుపయోగంగానూ మారిపోతుంది. సహజంగా నికెల్‌ దండిగా ఉన్న మధ్యధరా, ఉష్ణమండల ప్రాంతాల్లోని వృక్షాల్లో కొన్ని దీన్ని తట్టుకొని నిలబడితే.. మరికొన్ని ఎండిపోతుంటాయి. ఇలాంటి నికెల్‌ను సంగ్రహించే వృక్షాలు 65 వరకు ఉన్నాయని అంచనా. కొన్ని వృక్షాలు కోబాల్ట్‌, జింక్‌ వంటి ఖనిజాలనూ దాచుకుంటుంటాయి. కొన్ని చెట్లు బంగారాన్నీ నిల్వ చేసుకుంటూ ఉండటం గమనార్హం. కొత్త ఎలక్ట్రానిక్‌ పరికరాల యుగం మొదలయ్యాక అరుదైన ఖనిజాలకు డిమాండ్‌ గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో లోహ వృక్షాల సాగు గణనీయంగా పుంజుకోగలదని ఆశిస్తున్నారు.

 

లాభాలు ఎన్నెన్నో..
* లోహాలతో నిండిన భూముల్లో వీటి సాగుతో సన్నకారు రైతులు ఎంతో కొంత సంపాదించుకోవచ్చు. మైనింగ్‌ కంపెనీలు సైతం వట్టిపోయిన గనుల్లో వృక్షాలను పెంచుకోవచ్చు. ఇలా వ్యర్థ భూముల నుంచీ ఆర్జించే అవకాశముంటుంది. ఇతరత్రా లాభాలూ ఉంటాయి. ఇలా పర్యావరణ హితంగానూ లోహ సాగు ఉపయోగపడుతుంది.
* వైద్యపరంగానూ మేలే చేస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలామంది జింక్‌, సెలీనియం వంటి ఖనిజ లవణాల లోపంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో సూక్ష్మ పోషకాలను గ్రహించే మొక్కలు, వృక్షాలతో బయోమాస్‌ను సృష్టించొచ్చు. దీన్ని మాత్రల రూపంలోకి మార్చి ఆయా లవణాల లోపాలను తగ్గించుకోవచ్చు. ఇతరపంటలకు బయోమాస్‌ను ఎరువుగా మార్చి, ఆయా పంటల్లో జింక్‌ వంటి పోషకాల మోతాదులు పెరిగేలా చేయొచ్చు.

 

ఇది రైనోరియా బెంగాలెన్సిన్‌ మొక్క ఆకు. ఇందులో క్యాల్షియం (ఎరుపు), నికెల్‌ (ఆకుపచ్చ), కోబాల్ట్‌ (నీలి) ఆనవాళ్లను స్పష్టంగా చూడొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని