Updated : 02/06/2021 07:14 IST

Mobile Phone: ఫోన్‌ పోయిందా?

ఫోన్‌ పోయిందంటే సర్వమూ పోయినట్టే! అతిశయోక్తిగా అనిపించినా ప్రస్తుత పరిస్థితి ఇదే. ఎన్నో కాంటాక్టులు, ఎన్నో మెసేజ్‌లు, మరెన్నో ఫొటోలు, వీడియోలు! బ్యాంకు ఖాతాలైనా, చెల్లింపు యాప్‌లైనా, సామాజిక మాధ్యమాలైనా అన్నీ ఫోన్‌తో ముడిపడినవే. కాబట్టే ఒక్క క్షణం ఫోన్‌ కనిపించకపోయినా గుండె గుభేలుమంటుంది. ఇక ఎవరైనా దొంగిలిస్తే చెప్పేదేముంది? చేతులు కట్టేసినట్టే అవుతుంది. మన వ్యక్తిగత సమాచారమంతా రట్టయిపోతుంది. అయితే అంత గాబరా పడాల్సిన పనిలేదు. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో నిక్షిప్తమై ఉండే టూల్స్‌తో ఫోన్‌ని గుర్తించే మార్గాలు లేకపోలేదు.

కనిపించకుండా పోయిన ఫోన్‌ను గుర్తించటమనగానే ముందుగా ఐఓఎస్‌ పరికరాలే గుర్తుకొస్తాయి. వీటిల్లోని ఫైండ్‌ మై ఐఫోన్‌తో ఎక్కడున్నా ఇట్టే పట్టుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ ఫోన్లలోని ‘ఫైండ్‌ మై డివైస్‌’ గురించే చాలామందికి తెలియదు. ఫోన్‌ లొకేషన్‌ను గుర్తించటానికి, ఎవరైనా ఫోన్‌ను దొంగిలిస్తే దానిలోని సమాచారాన్ని కాపాడుకోవటానికిది సాయం చేస్తుంది.
* ముందుగా సెటింగ్స్‌లోకి వెళ్లి, సెక్యూరిటీ ఆప్షన్‌ ద్వారా ప్రైవసీలోకి వెళ్లాలి. ఫైండ్‌ మై డివైస్‌ను ఆన్‌ చేయాలి. చాలా ఫోన్లలో ఇది ఆఫ్‌ చేసి ఉంటుంది. దీని కింద ఫైండ్‌ మై డివైస్‌, వెబ్‌, గూగుల్‌ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. ఫైండ్‌ మై ఫోన్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోనట్టయితే ప్లే స్టోర్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక ఓపెన్‌ చేస్తే గూగుల్‌ మ్యాప్‌ మాదిరిగా కనిపిస్తుంది. ఇది పనిచేయాలంటే ఫోన్‌లో లొకేషన్‌ ఆన్‌ చేసి ఉంచాలి. అప్పుడే మ్యాప్‌లో ఫోన్‌ ఉన్నచోటు కనిపిస్తుంది. ఇందులో ప్లే సౌండ్‌, సెక్యూర్‌ డివైస్‌, ఎరేజ్‌ డివైస్‌ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. వీటిల్లో ఎరేజ్‌ డివైస్‌ బూడిద రంగులో ఉంటుంది. ఎందుకంటే దీన్ని అదే పరికరం నుంచి ఉపయోగించుకోలేం. వెబ్‌ లేదా ఇతర పరికరం ద్వారానే ఎరేజ్‌ చేయటానికి వీలుంటుంది.

* ఎప్పుడైనా ఫోన్‌ కనిపించనప్పుడు, ఎవరైనా దొంగిలించినప్పుడు వెబ్‌ ఇంటర్‌ఫేస్‌తో గుర్తించొచ్చు. ముందుగా https://www.google.com/android/find లోకి వెళ్లాలి. గూగుల్‌ ఖాతాలోకి సైన్‌ ఇన్‌ అయ్యాక ఎడమ వైపున మన ఫోన్‌ కనిపిస్తుంది. ప్లే సౌండ్‌ను ఎంచుకుంటే ఐదు నిమిషాల సేపు ఫోన్‌ రింగ్‌ అవుతుంది. సైలెంట్‌ మోడ్‌లో ఉన్నా, స్విచాఫ్‌ అయినా ఫోన్‌ రింగ్‌ అవుతుంది. ఫోన్‌ దొరికిన వారిని హెచ్చరించేందుకు మెసేజ్‌ కూడా పంపించొచ్చు. స్క్రీన్‌ లాక్‌ అయినా వారికి మెసేజ్‌ కనిపిస్తుంది. ఫోన్‌ను లాక్‌ చేయాలనుకుంటే ‘సెక్యూర్‌ డివైస్‌’ మీద క్లిక్‌ చేసి, గూగుల్‌ ఖాతా నుంచి సైన్‌ అవుట్‌ కావాలి. ఇక ‘ఎరేజ్‌ డివైస్‌’ ఆప్షన్‌తో ఫోన్‌లోని సమాచారాన్నంతా డిలీట్‌ చేయొచ్చు. ఇందుకోసం మళ్లీ సైన్‌ ఇన్‌ కావాలి. ఒకసారి సమాచారం ఎరేజ్‌ అయితే ఇక ఎప్పటికీ ఫోన్‌ ఎక్కడున్నదీ గుర్తించలేం. ఒకవేళ కంప్యూటర్‌ అందుబాటులోకి లేకపోతే ఇతర ఆండ్రాయిడ్‌ పరికరంతోనూ ఫైండ్‌ మై డివైస్‌ యాప్‌లోకి సైన్‌ఇన్‌ అయ్యి లొకేషన్‌ను గుర్తించొచ్చు.
* సామ్‌సంగ్‌ గెలాక్సీ ఫోన్లలో ఫైండ్‌ మై డివైస్‌తో పాటు అదనంగా ఫైండ్‌ మై మొబైల్‌ ఆప్షన్‌ కూడా ఉంటుంది.


థర్డ్‌ పార్టీ యాప్‌లతోనూ..

ఇతరుల చేతికి చిక్కిన ఫోన్లను గుర్తించటానికి థర్డ్‌ పార్టీ యాప్‌లు, యాంటీ థెఫ్ట్‌ యాప్‌లూ తోడ్పడతాయి. వీటిల్లో కొన్ని..

సెర్బరస్‌: (www.cerberusapp.com) వెబ్‌సైట్‌ ద్వారా, నమోదు చేసుకున్న ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌ పంపించటం, తనకు తానే హెచ్చరికలు జారీ చేయటం.. ఇలా మూడు రకాలుగా ఫోన్‌ను కాపాడుతుంది. అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని, ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఫోన్‌ దొంగిలించినవారు దీన్ని అన్‌ఇన్‌స్టాల్‌ చేయాలన్నా కుదరదు. వెంటనే ఫోన్‌ షట్‌డౌన్‌ అయినట్టూ ‘నటిస్తుంది’! దొంగలు చేసే మొదటి పని సిమ్‌ మార్చటం. అయినా సెర్బరస్‌ ఊరుకోదు. అసలు సిమ్‌ నంబర్‌ను అధికారిక సిమ్‌ నంబరుగా స్టోర్‌ చేసేస్తుంది. నమోదు చేసుకొన్న మొబైల్‌ నంబర్లకు కొత్త సిమ్‌ సమాచారాన్ని, ఫోన్‌ లొకేషన్‌ను చేరవేస్తుంది.

మెకాఫీ మొబైల్‌ సెక్యూరిటీ: యాంటీవైరస్‌ యాప్‌ అయిన ఇందులో ‘డివైస్‌ లాక్‌ సెక్యూరిటీ’ వంటి యాంటీ థెఫ్ట్‌ పీచర్లూ ఉంటాయి. ఎవరైనా మూడు సార్లు తప్పుడు పిన్‌ నంబరును ఎంటర్‌ చేస్తే ఫోన్‌ దానంతటదే లాక్‌ అవుతుంది. దీనిలోని ‘ఫైండ్‌ మై ఫోన్‌’ ఫీచర్‌తో మ్యాప్‌లో పరికరం ఎక్కడున్నదీ తెలుసుకోవచ్చు. అన్నింటికన్నా మంచి ఫీచర్‌ ‘థీఫ్‌-క్యామ్‌’ ఇది దొంగిలించిన వారి ఫొటోనూ తీస్తుంది మరి.

ప్రే: ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లను గుర్తించటానికిది మంచి యాప్‌. అన్ని పరికరాలనూ ఒకే అకౌంట్‌తో నిర్వహించొచ్చు. ఇది జీపీఎస్‌ ద్వారా పరికరాలను ట్రాక్‌ చేస్తుంది. జియోఫెన్సింగ్‌ చేస్తుంది.

ఫోన్‌ యాంటీ-థెఫ్ట్‌ అలారం: మన జేబులోంచి ఎవరైనా ఫోన్‌ను దొంగిలించటానికి ప్రయత్నిస్తే ఇది వెంటనే మోగుతూ... బిత్తర పోయేలా చేస్తుంది.


 

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని