చెమటోడ్చే రోబో!

అవటానికి మరమనిషే. అయితేనేం? మనిషిలా ‘చెమటోడుస్తుంది’. ఇదేమీ మాట వరసకు అంటున్నది కాదు. వ్యాయామం చేస్తున్నప్పుడు దీనికి నిజంగానే చెమట పడుతుంది! ఇంతటి చిత్రమైన రోబో పేరు కెంగారూ.

Published : 23 Jun 2021 01:43 IST

వటానికి మరమనిషే. అయితేనేం? మనిషిలా ‘చెమటోడుస్తుంది’. ఇదేమీ మాట వరసకు అంటున్నది కాదు. వ్యాయామం చేస్తున్నప్పుడు దీనికి నిజంగానే చెమట పడుతుంది! ఇంతటి చిత్రమైన రోబో పేరు కెంగారూ. దీన్ని టోక్యో యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించారు. మనుషుల కదలికలను అచ్చంగా అనుకరించటం దీని ప్రత్యేకత. మనలాంటి ఎముకల వ్యవస్థ ఆధారంగానే దీన్ని తయారుచేశారు. అందువల్ల మనిషిలాగే పుషప్స్‌, సిటప్స్‌ అన్నీ చేసేస్తుంది. కావాలంటే మునివేళ్ల మీద కూడా తిన్నగా నిల్చుంటుంది. ఇంతకీ చెమటెలా చిందిస్తుందనేగా మీ సందేహం. అతి సూక్ష్మమైన దారులు ఏర్పడేలా 3డీ ప్రింటింగ్‌ పద్ధతిలో రోబో ‘ఎముకలను’ రూపొందించారు. దీంతో వ్యాయామం చేస్తున్నప్పుడు ఎముకల గుండా నీరు పంప్‌ అయ్యి పైకి వస్తుంది. మనల్ని చెమట చల్లబరచినట్టుగానే ఇదీ రోబోను చల్లబరుస్తుంది. ఎందుకిలా? కెంగారూలో వందకు పైగా మోటార్లుంటాయి. ఇవి ఎక్కువ వేడిని పుట్టిస్తుంటాయి. దీంతో వ్యాయామాలు చేస్తున్నప్పుడు రోబో వేడెక్కకుండా ఇలా ‘చెమట’ ఏర్పాట్లు చేశారు. దీని మూలంగానే ఇది ఎక్కువసేపు.. అంటే 11 నిమిషాల వరకు ఆగకుండా పుషప్స్‌ చేసేస్తుంది. మానవ మాత్రులకు ఇంతసేపు పుషప్స్‌ చేయటం అసాధ్యమనే చెప్పుకోవచ్చు. ఇలాంటి జీవ-ప్రేరణ పద్ధతులు మరింత మన్నికైన మోకాలి మార్పిడి పరికరాల వంటివి తయారుచేయటానికి ఉపయోగపడగలవని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని