Published : 18/08/2021 02:11 IST

మంచి వీడియోకాల్స్‌ కోసం

కరోనా మహమ్మారి మన జీవితాలనే కాదు.. చదువులు, ఉద్యోగాల తీరునూ మార్చేసింది. ఉన్నట్టుండి వీడియో కాల్స్‌, సమావేశాల ప్రాధాన్యం పెరిగిపోయింది. పాఠాలైనా, సమావేశాలైనా అన్నీ వీటితోనే. కానీ టెక్‌ కంపెనీలే దీనికి అంతగా సిద్ధం కాలేదు. నిరంతర వీడియో సమావేశాల మూలంగా జూమ్‌ అలసటతో, ల్యాప్‌టాపుల్లో నాసిరకం వెబ్‌క్యామ్‌లతో విసిగిపోవటం తరచూ చూస్తున్నదే. ఇప్పుడిప్పుడే కొత్త సాధనాలు పుట్టుకొస్తున్నాయి. వీటి వెల్లువ ఇప్పటితో ఆగేది కాదు. కరోనా మహమ్మారి చరిత్ర పుటల్లో కలిసిపోయినా కొనసాగుతూనే వస్తుంది. వీడియో సమావేశాలను సులభతరం చేసే అలాంటి సాధనాల్లో కొన్ని ఇవీ..

సెంటర్‌ స్టేజ్‌ తీసుకోండి

ఎప్పుడూ కెమెరా ముందు కూర్చొని మాట్లాడటమేనా? స్వేచ్ఛగా అటూ ఇటూ తిరుగుతూ, పనులు చేస్తూ, చేసే పనులను చూపిస్తూ మాట్లాడొచ్చు కదా. అలా చేయాలంటే ఫోన్‌నో, ట్యాబ్లెట్‌నో పట్టుకొని వెంట వచ్చేవాళ్లు ఉండాల్సిందేనని అనుకుంటున్నారా? కొత్త ఐప్యాడ్‌ ప్రోతో అలాంటి అవసరమేమీ లేదు. మనం ఎక్కడుంటే అక్కడే కెమెరా కన్ను కేంద్రీకృతమవుతుంది మరి. అంతా సెంటర్‌ స్టేజ్‌ ఫీచర్‌ మహత్తు. ఇది మెషిన్‌ లెర్నింగ్‌ సాయంతో పనిచేస్తుంది. ముందు భాగాన ఉన్న 112 డిగ్రీ ఫీల్డ్‌ వ్యూ అల్ట్రావైడ్‌ కెమెరాను తనకు తానే అడ్జస్ట్‌ చేసుకుంటుంది. కదలికలను పసిగడుతూ మనం ఉన్నచోటును కేంద్రీకృతమయ్యేలా చేస్తుంది. వంటగదిలో వంట చేస్తూ మాట్లాడుతున్నా కెమెరా మనల్ని అనుసరిస్తుంది. మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఎవరైనా వచ్చి చేరినా దానంతటదే జూమ్‌ అవుతుంది. అవతలివాళ్లకు అందరూ కనిపించేలా చేస్తుంది. సెంటర్‌ స్టేజ్‌ ఒక్క ఫేస్‌ టైమ్‌కు మాత్రమే పరిమితమని అనుకుంటున్నారేమో. జూమ్‌, మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌, వెబ్‌ఎక్స్‌ వంటి వాటికీ ఉపయోగపడుతుంది. అయితే వీడియోకాల్‌ చేస్తున్న ప్రతిసారీ సెంటర్‌ స్టేజ్‌ ఫీచర్‌ అవసరం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు సెటింగ్స్‌ ద్వారా దీన్ని ఆఫ్‌ చేసుకోవచ్చు. మామూలుగానే మాట్లాడుకోవచ్చు.

* సామ్‌సంగ్‌ కొత్త ట్యాబ్లెట్లలో ముందు కెమెరాను పైన కాకుండా కుడి వైపున మధ్యలో అమర్చటమూ బాగా ఉపయోగపడనుంది. సాధారణంగా ట్యాబ్లెట్‌ను అడ్డంగా పెట్టి, అవతలివాళ్లను చూస్తూ వీడియోకాల్స్‌లో మాట్లాడుతుంటాం. పరికరం పైన కెమెరా ఉంటే పక్కకు చూసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అదే మధ్యలో ఉంటే నేరుగా చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. అవటానికి చిన్న మార్పే గానీ మంచి ప్రభావమే చూపుతుంది.


ఎకో షో ప్రదర్శించండి

తేలికగా వీడియోకాల్స్‌ చేసుకోవటానికి వీలుగా అమెజాన్‌ తాజా ఎకో షో 10 కొత్త సొబగులను అద్దుకొని వచ్చింది. నిజానికి ఎకో పరికరం మొదట్లో స్థూపాకారంలో ఉండేది. తర్వాత గుండ్రంగా మారింది. ఇప్పుడు అడుగు భాగాన మోటారుతోనూ వస్తోంది. దీంతో కెమెరా అన్ని వైపులకు తిరగటానికి వీలవుతుంది. ఇది ఆల్గోరిథం సాయంతో మన ముఖం వైపునకే కెమెరా కన్నును కేంద్రీకృతం చేయగలదు. ఒకసారి అలెక్సాకు చెప్పి మోషన్‌ ఫీచర్‌ను ఆన్‌ చేస్తే చాలు. అలెక్సాను ఏదైనా అడిగినప్పుడు తెర మన ముఖం వైపునకు తిరుగుతుంది. వాయిస్‌ సెన్సర్లు, కెమెరా సమన్వయంతో పనిచేస్తూ మాట్లాడేవారిని గుర్తిస్తాయి. ఫాలో అని అలెక్సాకు చెబితే గదిలో ఎక్కడున్నా కెమెరా మనల్నే అనుసరిస్తుంది. ఎకో షో 10 సుమారు 360 డిగ్రీల కోణంలో తిరగగలదు. హై-రెజల్యూషన్‌ కెమెరాతో కూడిన ఇది డిజిటల్‌గా జూమ్‌ అవుతుంది కూడా. ఇలా వీడియో కాల్స్‌ చేస్తున్నప్పుడు ఫ్రేమ్‌లో మనం ప్రముఖంగా కనిపించేలా చేస్తుంది. సపోర్టు అందుబాటులో ఉంటే గ్రూప్‌ కాలింగ్‌, స్కైప్‌, జూమ్‌తోనూ పనిచేస్తుంది. ఒకవేళ స్థిరంగా ఉండాలనుకుంటే ‘అలెక్సా టర్న్‌ ఆఫ్‌ మోషన్‌’ అని ఆదేశిస్తే సరి.


అల్ట్రాషార్ప్‌ అవ్వండి

స్పష్టమైన ప్రత్యక్ష వీడియో దృశ్యాలు కావాలనుకునే వారి కోసం డెల్‌ అత్యంత నాణ్యమైన అల్ట్రాషార్స్‌ 4కే వెబ్‌క్యామ్‌ను ప్రవేశపెట్టింది. ఆటో ఫ్రేమింగ్‌, 1080/60 ఎఫ్‌పీఎస్‌ వంటి ఫీచర్లు దీని సొంతం. తక్కువ కాంతిలో లేదా వెనకభాగాన ఎక్కువ కాంతి ఉన్నప్పుడూ స్పష్టంగా దృశ్యాలు చిత్రీకరించే హెచ్‌డీఆర్‌ సదుపాయమూ ఉంటుంది. మూడు రకాలుగా.. 65, 78, 90 డిగ్రీల ఫీల్డ్‌ వ్యూలను ఎంచుకోవచ్చు. సోనీ స్టార్‌విస్‌ కామ్స్‌ 8.3 మెకాపిక్సల్‌ సెన్సర్‌, ఆటోలైట్‌ కరెక్షన్‌ ఉండటం వల్ల లైటింగ్‌తో నిమిత్తం లేకుండా దృశ్యాలు స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. 5ఎక్స్‌ డిజిటల్‌ జూమ్‌తో పాటు ఆటోఫోకస్‌ ఫీచర్లతోనూ అలరిస్తోంది. ఇది విండోస్‌ పీసీ, మ్యాక్‌ రెండింటితోనూ పనిచేస్తుంది. కాకపోతే మ్యాక్‌లో కొన్ని ఫీచర్లు పనిచేయవు.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని