విండోస్‌10లో ఆడియో రికార్డింగు ఇలా..

కంప్యూటర్‌లో ఆడియో రికార్డు చేయాలని అనుకుంటున్నారా? అయితే విండోస్‌ 10లో వాయిస్‌ రికార్డరును వాడి చూడండి. దీంతో ఆడియోను రికార్డు చేయటం చాలా తేలిక. మైక్రోఫోన్‌, శబ్దాన్ని గ్రహించే సాఫ్ట్‌వేర్‌ ఉంటే చాలు.

Updated : 01 Dec 2021 06:29 IST

కంప్యూటర్‌లో ఆడియో రికార్డు చేయాలని అనుకుంటున్నారా? అయితే విండోస్‌ 10లో వాయిస్‌ రికార్డరును వాడి చూడండి. దీంతో ఆడియోను రికార్డు చేయటం చాలా తేలిక. మైక్రోఫోన్‌, శబ్దాన్ని గ్రహించే సాఫ్ట్‌వేర్‌ ఉంటే చాలు. ముందుగా విండోస్‌ కీబోర్డును గానీ స్టార్ట్‌ బటన్‌ను గానీ నొక్కి వాయిస్‌ లేదా రికార్డర్‌ అని టైప్‌ చేయాలి. దీంతో వాయిస్‌ రికార్డర్‌ కనిపిస్తుంది. దాని మీద క్లిక్‌ చేయాలి. విండో ఎడమ వైపున నీలి రంగులో కనిపించే మైక్రోఫోన్‌ గుర్తును నొక్కాలి. మైక్రోఫోన్‌లో మనం మాట్లాడే మాటలు, పాడే పాటలు వెంటనే రికార్డు అవటం మొదలవుతుంది. అవసరమైతే కాసేపు నిలిపి ఉంచొచ్చు. తిరిగి ఆరంభించొచ్చు. ఎంత సేపట్నుంచి రికార్డు అవుతోందనేదీ టైం ద్వారా తెలుసుకోవచ్చు. రికార్డు పూర్తయ్యాక తెర మధ్యలో కనిపించే బ్లూ బటన్‌ను నొక్కాలి. రికార్డెడ్‌ క్లిప్స్‌ జాబితాలో దీన్ని చూసుకోవచ్చు. తిరిగి వినొచ్చు. ట్రిమ్మింగ్‌ చేసుకోవచ్చు. వేరే పేరు పెట్టుకోవచ్చు. ఒకవేళ మైక్రోఫోన్‌ ద్వారా రికార్డు చేయటంలో ఇబ్బంది ఎదురైతే సౌండ్‌ సెటింగ్స్‌లోకి వెళ్లి సరి చేసుకోవాలి. ఇందులో ఇన్‌పుట్‌ ఆప్షన్‌ కింద యాక్టివ్‌ డివైజ్‌గా మైక్రోఫోన్‌ ఉందో లేదో ధ్రువీకరించుకోవాలి. వాయిస్‌ రికార్డర్‌లో రికార్డయిన ఫైళ్లను .ఎం4ఏ రూపంలో తక్షణం ఉపయోగించుకోవచ్చు. వీటిని దాదాపు అన్ని ఆధునిక పరికరాల డిఫాల్ట్‌ యాప్‌లు ప్లే చేస్తాయి.

మెరుగైన రికార్డింగు కోసం..

* నిశ్శబ్దంగా ఉండే చోట, ప్రతిధ్వనులు రాని చోట రికార్డు చేసుకోవాలి.

* ఒకవేళ మైక్‌తో రికార్డు చేస్తున్నట్టయితే దగ్గరగా ఉండి మాట్లాడాలి. దూరం నుంచి మాట్లాడితే గొంతు బొంగురు పోయినట్టు రికార్డు అవుతుంది.

* నాణ్యమైన యూఎస్‌బీ మైక్రోఫోన్‌ లేదా హెడ్‌సెట్‌ మైక్‌ను వాడితే స్పష్టత బాగుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని