రాకెట్లకు మరింత మెరుపు వేగం..

భూమిపై ఒక చోటు నుంచి మరో చోటుకి వేగంగా వెళ్లేందుకు అనేక సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయ్‌. కొన్ని గంటలు.. రోజుల్లోనే ప్రపంచం నలు మూలలకు చేరుకోగలుగుతున్నాం. మరైతే.. ఎప్పటి నుంచో భూమి నుంచి ఇతర గ్రహాలకు

Updated : 25 Feb 2021 12:12 IST

భూమిపై ఒక చోటు నుంచి మరో చోటుకి వేగంగా వెళ్లేందుకు అనేక సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయ్‌. కొన్ని గంటలు.. రోజుల్లోనే ప్రపంచం నలు మూలలకు చేరుకోగలుగుతున్నాం. మరైతే.. ఎప్పటి నుంచో భూమి నుంచి ఇతర గ్రహాలకు పయనించేందుకు చేస్తున్న ప్రయత్నాల సంగతేంటి? ఉదాహరణకు మనకి ఎంతో ఇష్టమైన, భూమిని పోలిన అంగారక గ్రహం. ఇది సూర్యుడి దగ్గర్లో ఉన్న నాలుగో గ్రహం. భూమికి సమీపంలో ఉంటుంది. దీనికి సంబంధించిన అనేక విశేషాలు 1972లో మెరైనర్‌ 9 ప్రయోగం ద్వారా లభించాయి. మొదటిసారి అంగారక గ్రహం ఫొటోలు తీసింది మెరైనరే. తర్వాత వైకింగ్‌-1.. వైకింగ్‌-2.. పాత్‌ఫైండర్‌.. లాంటి మరిన్ని నౌకల్ని పలు దేశాలు ఈ గ్రహం పైకి పంపాయి. నాసా అయితే.. 2012లో క్యూరియాసిటీ రోవర్‌ను ప్రయోగించింది. మనదేశం ‘మామ్‌’ అనే హ్యోమనౌకను పంపగా అది 2014 సెప్టెంబరులో అంగారకుడి కక్ష్యలో చేరింది. ఈ నెల మొదటి వారంలో తొలిసారి అరబ్‌దేశాలు పంపిన అమల్‌ ఉపగ్రహం ఏడు నెలలు ప్రయాణం చేసి అంగారకుడి కుడి కక్ష్యలోకి ప్రవేశించింది. మరో అడుగు ముందుకేసి నాసా 2035 నాటికి మానవ సహిత హ్యోమ నౌకను మార్స్‌పైకి పంపాలనుకుంటోంది. బాగానే ఉందిగానీ.. మార్స్‌ అంత దగ్గర్లో ఏమీ లేదు. భూమికి 14 కోట్ల మైళ్ల దూరంలో ఉంది.

అంత దూరం ప్రయాణం చేయడం తేలికైన విషయం కాదు. పైగా అంగారక గ్రహంపై అంటార్కిటికా కన్నా కొన్ని రెట్ల ఎక్కువ చల్లదనం ఉంటుంది. అందువల్ల సుదీర్ఘ ప్రయాణం చేసి మార్స్‌పై మనిషి ఎక్కువ రోజులు ఉండడం ప్రమాదకరం. అందుకే ప్రయాణ కాలం తగ్గించే పద్ధతుల్ని శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. అల్ట్రాసేఫ్‌ న్యూక్లియర్‌ టెక్నాలజీస్‌ సంస్థ దీనికి ఒక కొత్త విధానం ప్రతిపాదించింది. అదేంటంటే.. రాకెట్‌కు న్యూక్లియర్‌ థర్మల్‌ ప్రొపల్షన్‌ ఇంజన్‌ని ఏర్పాటు చేయడం. దీంతో భూమి నుంచి బయలుదేరిన రాకెట్‌ అంగారక గ్రహానికి హ్యోమగామిని కేవలం మూడు నెలల్లోనే తీసుకెళ్తుందంటున్నారు. ఈ సంస్థ డైరెక్టర్‌ మైకెల్‌ ఈడ్స్‌ ప్రకారం.. న్యూక్లియర్‌ పవర్‌తో నడిచే రాకెట్ల సామర్థ్యం, పనితీరు ప్రస్తుతం వినియోగిస్తున్న రసాయన ఇంజన్ల సామర్థ్యం కన్నా రెండు రెట్లు ఎక్కువ. తక్కువ ఇంధన ఖర్చుతో వేగంగా ప్రయాణించేందుకు న్యూక్లియర్‌ పవర్‌ చక్కని ప్రత్యామ్నాయం అవుతుందట!

ప్రస్తుతం మానవ రహిత అంతరిక్ష నౌకలు మార్స్‌ను చేరుకోవటానికి ఏడు నెలలు పడుతోంది. అదే మానవ సహిత ప్రయాణానికి కనీసం తొమ్మిది నెలలు పడుతుంది.


చెట్టు వయసు 2 కోట్లు

చరిత్రకు దర్పణాలు శిలాజాలు. గతంలో వైభవంగా జీవించి, కాలగర్భంలో కలిసిపోయిన ఎన్నో వృక్ష, జంతు జాలాల జ్ఞాపక చిహ్నాలే ఈ శిలాజాలు. ఇవి బయటపడిన ప్రతిసారీ గతం తాలూకు వైభవం, వైవిధ్యం మనల్ని అవాక్కయ్యేలా చేస్తుంది. కానీ, చీకటి కాలం గురించి మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి క్లూ దొరకలేదు. అంటే.. 60 కోట్ల ఏళ్ల ముందు కాలం అన్నమాట. అప్పుడు ఎలాంటి మార్పులు సంభవించాయో తెలుసుకోవడానికి ఎలాంటి శిలాజ ఆధారాలు శాస్త్రవేత్తలకు దొరకలేదు. ఈ 60 కోట్ల సంవత్సరాల్ని మూడు మహాయుగాలుగా అనుకుంటే.. వాటిల్లో ఒకటి పురాజీవ మహాయుగం.. రెండోది మాధ్యమిక జీవ మహాయుగం.. మూడోది ఆధునిక జీవ మహాయుగం. ఈ మూడో యుగ కాలంలో అంటే.. 2 కోట్ల సంవత్సరాల క్రితం నాటి ఓ మహావృక్షం ఇప్పుడు బయటపడింది. ఇప్పటికీ అది ఏ మాత్రం చెక్కు చెదరలేదు. అగ్ని పర్వత ద్వీపం అయిన లెస్‌బాస్‌లో గ్రీకు శాస్త్రవేత్తలు ఈ మహా వృక్షాన్ని వెలికి తీశారు. ఇది ఇప్పటికీ చెడిపోకుండా ఉండడం ఓ అద్భుతమని, 2 కోట్ల ఏళ్ల నాటి చరిత్రకు సాక్ష్యంగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆనాడు అరణ్య ప్రాంతాల్లో ఏయే వృక్షజాతులు జీవించి ఉండేవో తెలుసుకోవడానికి ఈ వృక్షం ఓ లైబ్రరీ అనుకోవచ్చని.. ఆయా వృక్షజాతుల్ని తిరిగి సృష్టించేందుకు, ఆధునిక జీవ మహాయుగం నాటి విశేషాల్ని తెలుసుకోవడానికి సాధ్య పడుతుందని శిలాజ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యునెస్కో సంరక్షణలో ఉన్న 15 వేల హెక్టార్ల అడవి ప్రాంతంలో ఈ వృక్షాన్ని కనుగొన్నారు. 2 కోట్ల సంవత్సరాల క్రితం అగ్ని పర్వతం పేలడంతో అరణ్యంగా ఉండే ఆ ప్రాంతం అంతా నాశనం అయ్యింది. లావా, బూడిదలతో నిండిపోయింది. 1995లో శిలాజ శాస్త్రవేత్తలు అక్కడ తవ్వకాలు మొదలు పెట్టారు. గత జనవరిలో రోడ్డు నిర్మాణం కోసం తవ్వుతున్న తవ్వకాలలో ఈ శిలాజ వృక్షం బయటపడింది.

సమృద్ధిగా వృక్షజాతులున్న అరణ్య ప్రాంతం అగ్నిపర్వత విజృంభణ వల్లనో.. జల ప్రళయాల కారణంగానో.. భూ సమాధి అయిపోతాయి. ఇలా శిలాజాలుగా మిగిలిపోయిన అడవుల్ని ఇంగ్లిష్‌లో పెర్ట్రి ఫయిడ్‌ ఫారెస్ట్‌లు అని పిలుస్తారు.


మంచు తుపానుల్లో బుడగ రక్ష

మైనస్‌ 5 డిగ్రీల సెల్సియస్‌ని మనం ఊహించగలమా? అప్పుడు కురిసే మంచుని చూడగలమా? ఇక్కడ మనకి అలాంటి అనుభవం లేదుగానీ.. అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో గత కొన్ని వారాలుగా అదే పరిస్థితి. భారీగా కురుస్తున్న మంచు తుపాను వల్ల అక్కడ పరిస్థితి విషమంగా మారింది. రహదారులపై భారీగా మంచు పేరుకుపోయింది. సరస్సులు గడ్డకట్టుకుపోయాయి. అత్యంత ప్రమాదకరమైన మంచు తుపానుల్లో అనుకోకుండా మనిషి చిక్కుకుంటే బయటపడడం అంత తేలిక కాదు. మంచు కింద కూరుకుపోయి ఊపిరి ఆడక మరణించే పరిస్థితి వస్తుంది. అదెలాగంటే.. మంచు తుపాను తొలిదశలో మంచుపైనే ఉంటారు. మంచు కింది భాగం కరిగి ప్రవహించడం మొదలుపెట్టాక మనుషులు బరువు వల్ల కిందికి దిగబడిపోతుంటారు. అలాంటప్పుడు ఎక్కడైనా మంచులో ఇరుక్కుపోతే ఎక్కడ ఉన్నారనేది గుర్తించడం కూడా సాధ్యపడదు. ఒకవేళ గుర్తించినా మంచు పొరల కింద నుంచి బయటకు తీయడం కష్ట సాధ్యం. ఈ పరిస్థితిని అధిగమించేందుకు జర్మనీ శాస్త్రవేత్తలు ఎయిర్‌ బ్యాగుని రూపొందించారు. దీనికి ఏర్పాటు చేసిన సిస్టంతో మంచు కింద మనుషులు సమాధి కాకుండా కాపాడొచ్చు. నడుముకు కట్టుకునే ఈ బ్యాగులో ముడుచుకుని ఉన్న బెలూన్‌, నైట్రోజన్‌ సిలెండర్‌, రిప్‌కార్డు ఉంటాయి. ప్రతికూల పరిస్థితుల్లో ఎప్పుడైనా మంచు తుపానులో చిక్కుకుంటే రిప్‌కార్డుని లాగితే నైట్రోజన్‌ వాయువు సిలెండర్‌ నుంచి విడుదలై బెలూన్‌లో నిండిపోతుంది. రెండు సెకన్లలో బెలూన్‌ ఘన పరిమాణం 150 లీటర్ల స్థాయికి చేరుతుంది. బెలూన్‌ మనిషిని పైకి లేపుతుంది. ఫలితంగా మనిషి మంచు కింద నలిగిపోకుండా ఉంటాడు.

మంచు తుపానుల రాకను ముందుగానే గుర్తించి, ప్రజల్ని అప్రమత్తం చేసే అధ్యయన కేంద్రం హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలిలో ఉంది. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి వాతావరణ కేంద్రం లేదు. మంచు తుపాను రాకపోకల్ని చెప్పడమే కాకుండా వాటి నుంచి రక్షణ పొందే విధానాల్లో కూడా ఈ సంస్థ శిక్షణ అందిస్తోంది.


​​​​

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని