Smartphone: ముందు మోటోరోలా ఎడ్జ్‌..తర్వాత రియల్‌మీ జీటీ

ఆగస్టు నెలలో వరుసగా కొత్త గ్యాడ్జెట్స్‌ను తీసుకొస్తూ టెక్‌ ప్రియులను మొబైల్‌ కంపెనీలు ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే మైక్రోమాక్స్‌, వివో, శాంసంగ్‌, రెడ్‌మీ కంపెనీలు కొత్త మొబైల్‌, ల్యాప్‌టాప్‌లను భారత మార్కెట్లోకి విడుదల చేశాయి. వచ్చే వారంలో మోటోరోలా, రియల్‌మీ కంపెనీలు కొత్త మోడల్ మొబైల్, ల్యాప్‌టాప్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించాయి. మరి వాటిలో ఎలాంటి ఫీచర్లున్నాయో చూద్దాం...

Updated : 05 Aug 2022 16:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆగస్టు నెలలో వరుసగా కొత్త గ్యాడ్జెట్స్‌ను తీసుకొస్తూ టెక్‌ ప్రియులను మొబైల్‌ కంపెనీలు ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే మైక్రోమాక్స్‌, వివో, శాంసంగ్‌, రెడ్‌మీ కంపెనీలు కొత్త మొబైల్‌, ల్యాప్‌టాప్‌లను భారత మార్కెట్లోకి విడుదల చేశాయి. వచ్చే వారంలో మోటోరోలా, రియల్‌మీ కంపెనీలు కొత్త మోడల్ మొబైల్, ల్యాప్‌టాప్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించాయి. మరి వాటిలో ఎలాంటి ఫీచర్లున్నాయో చూద్దాం.


మోటోరోలా ఎడ్జ్‌ 20 (Motorola Edge 20)

మోటోరోలా ఎడ్జ్‌ సిరీస్‌లో రెండు కొత్త మోడల్స్‌ని తీసుకొస్తుంది. మోటో ఎడ్జ్‌ 20, మోటో ఎడ్జ్‌ ఫ్యూజన్‌ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్లను ఆగస్టు 17న విడుదల చేయనన్నట్లు మోటోరోలా తెలిపింది. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో పనిచేస్తాయి. వీటిని 6జీబీ ర్యామ్‌/128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 8జీబీ/128జీబీ వేరియంట్లో తీసుకొస్తున్నారు. ఈ మోడల్స్‌లో వెనుకవైపు 108 ప్రైమరీ కెమెరాతోపాటు 16ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌, 8ఎంపీ టెలీఫొటో లెన్స్‌ ఇస్తున్నారు. అయితే ఫ్యూజన్ మోడల్‌లో 8ఎంపీ కెమెరా స్థానంలో 2 ఎంపీ కెమెరా ఉంటుంది. ముందుభాగంలో సెల్ఫీల కోసం 32ఎంపీ కెమెరా అమర్చారు. 

మోటోరోలా ఎడ్జ్‌ 20లో 144Hz రిఫ్రెష్‌ రేట్‌తో, ఎడ్జ్‌ 20 ప్యూజన్‌లో 90Hz రిఫ్రెష్‌ రేట్‌తో 6.7-అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఎడ్జ్‌ 20లో స్నాప్‌డ్రాగన్ 778జీ, ఫ్యూజన్‌లో డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఎడ్జ్‌లో 4,000 ఎంఏహెచ్‌, ఎడ్జ్‌ 20 ఫ్యూజన్‌లో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. ఇవి 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. వీటి ప్రారంభ ధర రూ. 35,000 నుంచి రూ. 40,000 మధ్య ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా.  


రియల్‌మీ జీఈ మొబైల్‌ & బుక్‌ ల్యాప్‌టాప్ (Realme GT Mobile & Book Laptop)

ఆగస్టు 18న రియల్‌మీ జీటీ సిరీస్‌లో కొత్త మొబైల్ ఫోన్‌ను తీసుకొస్తుంది. అదే రోజున రియల్‌మీ బుక్ పేరుతో కొత్త ల్యాప్‌టాప్‌ను విడుదల చేయనుంది. రియల్‌మీ నుంచి వస్తున్న తొలి ల్యాప్‌టాప్ ఇదే. యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ తరహాలో దీన్ని డిజైన్ చేసినట్లు సమాచారం. ఇందులో 11వ జనరేషన్ ఐ5 కోర్ ప్రాసెసర్ ఉపయోగించినట్లు సమాచారం. 2కే రిజల్యూషన్‌ డిస్‌ప్లే ఇస్తున్నారట. బ్యాటరీ, ర్యామ్‌, స్టోరేజ్ వంటి వివరాల కోసం 18 తేదీ వరకు వేచిచూడాల్సిందే. 

రియల్‌మీ జీటీ మొబైల్‌ను రెండు వేరియంట్లలో తీసుకొస్తున్నారు. జీటీ ఎడిషన్‌లో స్నాప్‌డ్రాగన్ 888 5జీ ప్రాసెసర్‌, జీటీ మాస్టర్‌ ఎడిషన్‌లో స్నాప్‌డ్రాగన్ 778జీ 5జీ ప్రాసెసర్‌లను ఉపయోగించారు. ఇవి 65 సూపర్ డార్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తాయి. దీంతో కేవలం 33 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్‌ అవుతుందని రియల్‌మీ చెబుతోంది. గేమ్స్ ఆడుతున్నప్పడు ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు స్టెయిన్‌లెస్ స్టీల్ వాపర్ కూలింగ్ సాంకేతికతను ఉపయోగించారు. 19 జీబీ ఎక్స్‌పాండబుల్ ర్యామ్ ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్‌, 360Hz టచ్‌ శాంప్లింగ్‌తో అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని