Published : 29/10/2021 10:11 IST

WhatsApp Chats leak: అసలు వాట్సాప్‌ చాట్స్‌ ఎలా లీక్‌ అవుతున్నాయి?

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌ (WhatsApp).. ఈ మెసేజింగ్ యాప్‌తో పరిచయం లేనోళ్లంటూ ఎవ్వరూ లేరు. ప్రతిఒక్కరి దినచర్యలో వాట్సాప్‌ ఓ భాగమైపోయింది. ఆఫీస్‌ మెసేజ్‌లు, ఫ్రెండ్స్‌తో కబుర్లు, బంధువులతో ఫొటోలు, వీడియోలు షేరు చేసుకోవడం.. ఇలా ఒక్కటేంటి సమస్త విషయాలు వాట్సాప్‌తో ముడిపడి ఉన్నాయి. మరి ఇలాంటి వాట్సాప్‌లో మీరు మరొకరికి పెట్టే సమాచారం (వీడియోలు, మెసేజ్‌లు, ఫొటోలు, కాల్స్‌.. ఇతరత్రా) సురక్షితమేనా? మీకెప్పుడైనా ఆ డౌట్ వచ్చిందా? రండి తెలుసుకుందాం...


వాట్సాప్‌ చాట్స్‌ లీక్‌.. 

ఇటీవల వాట్సాప్‌ చాట్స్‌ లీక్‌ గురించి తరచూ వినిపిస్తోంది. సెలబ్రిటీల నుంచి బడా వ్యాపారవేత్తల దాకా ఎప్పుడో ఒకసారి, ఏదో ఒక సంఘటనలో వారి వాట్సాప్‌ చాట్‌ లీకైందన్న వార్తలు వస్తున్నాయి. ఇలా వాట్సాప్‌ ప్రైవసీ (WhatsApp Privacy)పై అనుమానం వచ్చిన ప్రతిసారీ.. వాట్సాప్ చెప్పే సమాధానం ఒక్కటే. ‘మీరు ఇతరులకు పెట్టే మెసేజ్‌లు, కాల్స్‌, వీడియోలు అన్నీ ఎండ్‌-టూ-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ (End-End-Encryption) భద్రత ఉంటుంది. అంటే మీరు పంపించిన వారికి, మీకు తప్ప ఎవరికీ కనిపించవు. థర్డ్ పార్టీ అప్లికేషన్లు, ఫేస్‌బుక్‌ (Facebook), వాట్సాప్‌ కూడా వాటిని యాక్సెస్‌ చేయలేవు’ అని సంస్థ చెబుతూ ఉంటుంది.


మరి ఎలా లీక్‌ అవుతున్నాయి?

వాట్సాప్ చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. మరి వాట్సాప్‌ చాట్స్‌ ఎలా లీక్ అవుతున్నాయ్‌? మనం ఫోన్‌ను ఎలా వాడుతున్నామనే దానిపైనే ‘వాట్సాప్‌ చాట్స్‌ లీక్‌’ (WhatsApp Chats Leak) అనేది ఆధారపడి ఉంటుందని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు.

👀 వాట్సాప్‌ నుంచి మీరు షేర్‌ చేసిన సమాచారం మీ ఫోన్లోగానీ లేక క్లౌడ్‌ డ్రైవ్‌లోగానీ స్టోర్‌ అవుతుంది. మనం ఏదైనా నేరం చేసి పోలీసులకు చిక్కినప్పుడు వారికి మనపై అనుమానం ఉంటే.. మన వాట్సాప్‌ నుంచి సమాచారం తీసుకునే అధికారం వారికి ఉంటుంది. 

👀 ఎప్పుడైనా మీ ఫోన్‌ పోయినప్పుడు, ఎవరైనా దొంగలించినప్పుడు... మీ వాట్సాప్‌కు సెక్యూరిటీ కోడ్‌  (Security Code) లేకపోతే.. మీ ఫోన్‌ దొరికినవారికి మీ వాట్సాప్‌ సమాచారం లభించినట్లే అవుతుంది. 

👀 మీరు ఎప్పుడైనా తెలియని వారితో చాట్‌ చేసినా వాళ్లు నేర ప్రవృత్తిగలవారైతే.. పోలీసులు మీ మీద కూడా నిఘా ఉంచేందుకు వాట్సాప్‌ సంస్థ సాయంతో మీ సమాచారాన్ని వారు సేకరిస్తారు.

👀 ఎప్పటికప్పుడు మీ వాట్సాప్‌ చాట్‌ను క్లియర్‌ చేయకపోయినా.. యాప్‌కు లాక్‌ చేయకపోయినా.. దాన్ని అదనుగా తీసుకొని మీకు తెలిసిన వ్యక్తులు, స్నేహితులే మీ వాట్సాప్‌ సంభాషణలు, ఫోటోలను లీక్‌ చేసే అవకాశం ఉంటుంది. 

👀 వాట్సాప్‌ వినియోగదారులు ఎక్కువగా మాల్వేర్‌ (Malware Apps) యాప్స్ డౌన్‌లోడ్‌ చేస్తుంటారు. సైబర్‌ నేరగాళ్లు ఇవి ప్రధానంగా మన దగ్గర నుంచి డబ్బులు దొంగలించటానికి తయారు చేసినా.. మన వ్యక్తిగత సమాచారాన్ని కూడా తస్కరిస్తుంటారు.


ఇలా జాగ్రత్తపడండి మరి!

👉 మీ వాట్సాప్‌ను ఎప్పుడూ సెక్యూరిటీ కోడ్‌తో లాక్‌ చేసి ఉంచండి. మీ స్నేహితులు, బంధువులకు కూడా తెలియకుండా జాగ్రత్త పడండి.

👉 వాట్సాప్‌ కాల్స్‌ (WhatsApp Calls)లో డ్రగ్స్‌, పోర్న్‌, వేధింపులు.. వగైరా నేరానికి సంబంధించిన సంభాషణలు చేయకుండా ఉంటే మంచిది. 

👉 వాట్సాప్‌ చాట్స్‌ (WhatsApp Chats)లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలు చర్చించడం, వేరే వారితో పంచుకోవడం వంటి వాటికి దూరంగా ఉండండి. 

👉 ఏమైనా యాప్స్‌ (Malware Apps) డౌన్‌లోడ్‌ చేసేటప్పుడు.. గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ వంటి సురక్షితమైన ప్లాట్‌ఫార్మ్స్‌ నుంచి మాత్రమే డౌన్‌లోడ్‌ చేయండి. వేరే సైట్స్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేయడం సురక్షితం కాదు.

👉 మీకు సంబంధించిన సమాచారం గానీ ఇతరులకు సంబంధించిన వ్యక్తిగతమైన సమాచారం గానీ వాట్సాప్‌లో పంచుకోకపోవడం ఉత్తమం. అలానే వైరల్‌ అయిన, మీకు తెలియని సమాచారాన్ని ఫార్వర్డ్‌ చేసి చిక్కుల్లో పడకండి.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని