Popular Emojis: 2021లో ఎక్కువగా వాడిన ఎమోజీలివే!

ప్రపంచవ్యాప్తంగా 2021లో ఎక్కవ మంది యూజర్స్ ఉపయోగించిన పాపులర్ ఎమోజీ జాబితాను యూనికోడ్ కన్సార్టియమ్‌ విడుదల చేసింది. 

Updated : 05 Dec 2021 14:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మనసులో దాగున్న వేల భావాల్ని వ్యక్తపరిచేందుకు ఎన్నో పదాలు కావాలి. కానీ, అందరికీ పదాలపై పట్టుండదు కదా? మరి అలాంటి వారు ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానమే ఎమోజీ. మీ మనసులో దాగున్న బాధ, సంతోషం, ఆనందం, కోపం, ఏడుపు ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల భావాల్ని ఎమోజీలతో వ్యక్తపరచవచ్చు. పది పదాలు అవసరమైన చోట ఒక్క ఎమోజీతో మన మూడ్‌ని చెప్పేయొచ్చు. సామాజిక మాధ్యమాల వచ్చాక వీటి వినియోగం మరింతగా పెరిగిపోయింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఇవి లేకుండా సంభాషణలను ఊహించడం కష్టం. అందుకే సోషల్‌ మీడియా సంస్థలు కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఎమోజీలను తీసుకొస్తున్నాయి. తాజాగా యూనికోడ్ కన్సార్టియమ్ సంస్థ 2021లో యూజర్స్‌ ఎక్కువగా ఉపయోగించిన పది పాపులర్‌ ఎమోజీల జాబితాను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 92 శాతం మంది ఆన్‌లైన్‌ యూజర్స్‌ ఈ ఎమోజీలను ఉపయోగించినట్లు యూనికోడ్ వెల్లడించింది. మరి ఈ జాబితాలో ఉన్న ఎమోజీలు ఏవో చూద్దాం. 

* యూనికోడ్ నివేదిక ప్రకారం పడి పడి నవ్వినప్పుడు కన్నీళ్లు వస్తున్నట్లుగా (Face With Tears Of Joy - 😂) ఉండే ఎమోజీని యూజర్స్‌ అధికంగా ఉపయోగించారు. మొత్తంగా ఈ ఎమోజీని 5 శాతం మంది యూజర్స్ ఉపయోగిస్తున్నట్లు యూనికోడ్ వెల్లడించింది. 

* తర్వాత ఈ జాబితాలో రెండో స్థానంలో రెడ్‌ హార్ట్‌ ఎమోజీ (Red Heart -❤️)ఉంది. మూడో స్థానంలో కిందపడి దొర్లుతూ నవ్వుతున్న (Rolling on the Floor Laughing - 🤣) ఎమోజీలు ఉన్నాయి. 

* ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా బొటనవేలు చూపుతున్నట్లు (Thumbs Up - 👍), పెద్దగా ఏడుస్తున్న ముఖం (Loudly Crying Face - 😭), నమస్కారం చేస్తున్న చేతులు (Folded Hands - 🙏), హార్ట్‌ సింబల్‌తో ముద్దు పెడుతున్న ముఖం (Face Blowing Kiss -😘), హార్ట్‌ సింబల్స్‌తో నవ్వుతున్న ముఖం (Smiling Face With Hearts - 🥰), కళ్లలో హార్ట్ సింబల్‌తో నవ్వుతున్న ముఖం (Smiling Face with Heart Eyes - 😍), నవ్వు నిండిన కళ్లతో నవ్వుతున్న ముఖం (Smiling Face with Smiling Eyes - 😊) ఎమోజీలు ఉన్నాయి. 

* అలానే వేర్వేరు కేటగిరిల్లో ప్రథమస్థానంలో నిలిచిన ఎమోజీల జాబితాను కూడా యూనికోడ్ విడుదల చేసింది. ట్రావెల్‌ అండ్‌ ప్లేసెస్‌ కేటగిరీలో రాకెట్ షిప్‌ (Rocket Ship -🚀), స్మైలీస్‌ అండ్‌ పీపుల్‌ జాబితాలో కండలు చూపుతున్న (Flexed Biceps - 💪), జంతువులు - ప్రకృతి జాబితాలో పుష్ప గుచ్ఛం (Bouquet - 💐), సీతాకోక చిలుక (Butterfly-🦋), యాక్టివిటీ విభాగంలో కార్ట్‌ వీల్‌ (Doing Cartwheel - 🤸‍♀️) చేస్తున్న ఎమోజీలను 82 శాతం మంది ఉపయోగించారు.

Read latest Gadgets & Technology News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు