సింగరేణికి సెగ

సింగరేణి సంస్థకూ ప్రైవేటు పోరు తప్పేలా లేదు. ఇంతకాలం నిల్వలున్న ప్రాంతాల్లో కొత్త గనులు తవ్వుకుంటూ వస్తోన్న సంస్థ నెత్తిన కేంద్రం ‘వేలంలో పాడుకుంటేనే’ అనే కొత్త కుంపటి పెట్టడమే దానికి కారణం. దీని ప్రభావం నూతన థర్మల్‌ విద్యుత్తు

Published : 06 Dec 2021 04:59 IST

కేంద్రం తెచ్చిన వేలం విధానంతో చిక్కులు
సంస్థ మనుగడకు ముప్పేనంటున్న కార్మిక సంఘాలు

కేంద్రం వేలానికి పెట్టిన సత్తుపల్లి ఉపరితల బొగ్గు గని

ఈనాడు, హైదరాబాద్‌: సింగరేణి సంస్థకూ ప్రైవేటు పోరు తప్పేలా లేదు. ఇంతకాలం నిల్వలున్న ప్రాంతాల్లో కొత్త గనులు తవ్వుకుంటూ వస్తోన్న సంస్థ నెత్తిన కేంద్రం ‘వేలంలో పాడుకుంటేనే’ అనే కొత్త కుంపటి పెట్టడమే దానికి కారణం. దీని ప్రభావం నూతన థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలపైనా పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలోని గనుల వేలానికి సంబంధించి కేంద్రం ఇటీవల ‘ఖనిజాలు, గనుల అభివృద్ధి’ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. గనులను వేలంవేసి అధిక ధర కోట్‌ చేసిన వారికి కేటాయించడమే ఈ విధానం. వేలం జాబితాలో తొలిసారి తెలంగాణలోని నాలుగు కొత్త బొగ్గు గనులను నమోదు చేసింది. ఈ నెల 13న వేలం జరగనున్న నేపథ్యంలో కొత్త విధానాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మిక సంఘాలు ఈ నెల 9 నుంచి 3 రోజులపాటు సమ్మెకు పిలుపునిచ్చాయి.

చేసిన ఖర్చంతా వృథాయేనా?

గోదావరి పరీవాహక ప్రాంతంలో బొగ్గు తవ్వకాల కోసం నిజాం ప్రభుత్వ హయాంలోనే సింగరేణి సంస్థకు 44 అనుమతులు (లైసెన్సులు) ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రాంతాలకు బయట ఉన్న గనులను కేంద్రం వేలం జాబితాలో చేర్చింది. నిజానికి ఈ నాలుగు గనుల్లో బొగ్గు నిల్వల అన్వేషణ, మౌలిక సదుపాయాల కోసం సంస్థ కొన్నేళ్లుగా రూ.167 కోట్లు ఖర్చుపెట్టింది. ఈ నాలుగు.. పాత గనుల పక్కనే ఉండటం వల్ల వాటి నుంచి బొగ్గు తవ్వడం సులభం. అవి ప్రైవేటుపరమైతే ఇప్పటివరకూ చేసిన ఖర్చు వృథా కావడంతో పాటు, ఆయా కంపెనీలకు ఆయాచిత లబ్ధి చేకూర్చినట్లవుతుందని సంస్థ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.

థర్మల్‌ కేంద్రాలపైనా ప్రభావం

తెలంగాణలో ఎన్టీపీసీ, రాష్ట్ర జెన్‌కో కొత్త విద్యుత్‌ కేంద్రాలు నిర్మిస్తున్నాయి. వీటికి నిత్యం లక్షలాది టన్నుల బొగ్గు కావాలి. కనీసం 10 కోట్ల టన్నులు ఏటా తవ్వితేనే 2025 నాటి మార్కెట్‌ అవసరాలను తీర్చగలుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఏటా కోటి టన్నుల ఉత్పత్తికి అవకాశమున్న నాలుగు కొత్త గనులను కేంద్రం వేలంలో పెట్టిందని, అవి దక్కకపోతే 10 కోట్ల టన్నుల లక్ష్యాన్ని చేరడం సాధ్యం కాదని సింగరేణి వర్గాలు పేర్కొంటున్నాయి.

పోటీపడటం సాధ్యమా?

సింగరేణి సంస్థలో వేలాది ఉద్యోగుల జీతభత్యాలు తదితర ప్రమాణాల రీత్యా టన్ను బొగ్గు తవ్వకానికి సగటున రూ.2 వేలకు పైగా ఖర్చవుతోంది. ప్రైవేటు కంపెనీలు తక్కువ సిబ్బందితో ఇంత కంటే తక్కువ వ్యయానికి బొగ్గుతవ్వి లాభాలకు అమ్ముతాయి. ఆ పరిస్థితుల్లో సింగరేణి వాటితో పోటీపడటం అసాధ్యమనే అభిప్రాయాన్ని కార్మిక సంఘా వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాలు సంస్థ మనుగడకు ముప్పుగా మారుతాయని ఆందోళన చెందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని