మేం ప్రభుత్వాన్ని కూల్చొచ్చు.. నిలబెట్టొచ్చు!

‘మా రెండు జేఏసీల్లో 13 లక్షల మంది ప్రభుత్వోద్యోగులం ఉన్నాం. ఒక్కో ఉద్యోగి కుటుంబంలో వారి అమ్మా, నాన్న, భార్య/భర్త, బిడ్డలు ఇలా అయిదేసి ఓట్ల చొప్పున లెక్కేసుకున్నా మొత్తం సుమారు 60 లక్షల మంది అవుతాం. మేం ప్రభుత్వాన్ని కూల్చొచ్చు.

Published : 06 Dec 2021 04:59 IST

చచ్చిపోతున్నామన్నా జీతానికి దిక్కులేని పరిస్థితి
ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు వ్యాఖ్యలు

ఈనాడు, అమరావతి: ‘మా రెండు జేఏసీల్లో 13 లక్షల మంది ప్రభుత్వోద్యోగులం ఉన్నాం. ఒక్కో ఉద్యోగి కుటుంబంలో వారి అమ్మా, నాన్న, భార్య/భర్త, బిడ్డలు ఇలా అయిదేసి ఓట్ల చొప్పున లెక్కేసుకున్నా మొత్తం సుమారు 60 లక్షల మంది అవుతాం. మేం ప్రభుత్వాన్ని కూల్చొచ్చు. నిలబెట్టొచ్చు. మా శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే’ అని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘నేను ఉన్నాను.. నేను విన్నాను అన్న మీ మాయమాటలు నమ్మి మీకు 151 సీట్లు తెచ్చాం. అందుకే మీరు మా వంక చూడట్లేదు’ అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి ధ్వజమెత్తారు. ‘ఒకటో తేదీన జీతాలు పొందటమనేది ఉద్యోగుల హక్కు. అలాంటిది చచ్చిపోతున్నామన్న సరే ఇప్పుడు జీతానికి దిక్కులేని పరిస్థితి అయిపోయింది. ఒకటో తేదీన జీతం ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిది కాదా? అని నిలదీశారు. విజయవాడలో ఇటీవల జరిగిన ఏపీ ఎన్జీవోల సంఘం అంతర్గత సమావేశంలో ఆయన ప్రసంగించారు. దానికి సంబంధించిన వీడియో ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. అందులోని ప్రధానాంశాలివీ. అవసరమైతే ప్రతిపక్షంలో ఉంటాను తప్ప 5 డీఏలు ఇవ్వలేనని చెప్పిన చంద్రబాబుకు.. ఉద్యోగుల గురించి బాగా తెలుసని వివరించారు.

‘ప్రభుత్వోద్యోగులంటే ఓ గౌరవం ఉండేది. ఇప్పుడు దీనావస్థలోకి వెళ్లిపోయారు. సుబ్బారావుకు జీతం వచ్చింది. ఎల్లయ్యకు రాలేదు అనే పరిస్థితిలోకి నెట్టేశారు’ అని విమర్శించారు.  ఇప్పుడు ఉద్యోగులు చచ్చిపోతున్నా జీతానికి దిక్కులేని పరిస్థితి అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మీ మోచేతి నీళ్లు తాగే పరిస్థితి కాదు. ఉద్యమం ద్వారానే మా హక్కులు సాధించుకుంటాం తప్ప.. మీ దయాదాక్షిణ్యాలపై కాదు’ అని ప్రభుత్వాన్ని హెచ్చరించే రోజు వచ్చిందని బండి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని