మూడేళ్లలో రాష్ట్రానికి రూ.17,709 కోట్ల విదేశీ పెట్టుబడులు

గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,577 కోట్లు, తెలంగాణకు రూ.17,709 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. 2019-20 అక్టోబరు నుంచి 2021 జూన్‌ వరకు ఈ మొత్తం వచ్చినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి

Published : 07 Dec 2021 04:17 IST

ఈనాడు, దిల్లీ: గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,577 కోట్లు, తెలంగాణకు రూ.17,709 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. 2019-20 అక్టోబరు నుంచి 2021 జూన్‌ వరకు ఈ మొత్తం వచ్చినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. ఆయన సోమవారం లోక్‌సభలో ఒక లిఖితపూర్వక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో ఈ విషయం వెల్లడించారు. కేంద్ర మంత్రి సమాధానం ప్రకారం ఏపీకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఏటా తరుగుదల కనిపించగా, తెలంగాణకు వచ్చినదాంట్లో హెచ్చు తగ్గులు నమోదయ్యాయి. ఈ మూడేళ్లలో దేశంలోని అన్ని రాష్ట్రాలకూ కలిపి రూ.7,43,4476.26 కోట్ల పెట్టుబడులు రాగా అందులో ఏపీ వాటా 0.34%, తెలంగాణ వాటా 2.38%గా ఉంది. అత్యధిక పెట్టుబడులు మహారాష్ట్రకు రూ.2,04,082.22 కోట్లు, గుజరాత్‌కు రూ.1,87,472.28 కోట్లు, కర్ణాటకకు రూ.1,49,718.39 కోట్లు వచ్చాయి. మొత్తం ఎఫ్‌డీఐల్లో ఈ మూడు రాష్ట్రాలకే 72.80% దక్కింది.

తెలంగాణకు ఆరోగ్య నిధి కింద రూ.418 కోట్లు

తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో నవంబరు 30వరకు రూ.418.20 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇందులో రోగ నిర్ధారణ మౌలిక వసతుల కల్పన కోసం ఆరోగ్య ఉపకేంద్రాలకు 34.93 కోట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రూ.35.25 కోట్లు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రూ.8.86 కోట్లు, బ్లాక్‌స్థాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రూ.118.20 కోట్లు, పట్టణ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటుకు రూ.133.09 కోట్లు, భవనాల నిర్మాణానికి రూ.2.80 కోట్లు, గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లుగా మార్చడానికి రూ.85.05 కోట్లు సహా ఇతరాలకు నిధులు ఇచ్చినట్టు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని