సర్కారు దవాఖానాల్లో నాణ్యమైన వైద్యం

ప్రతి పేద బిడ్డకు వారి జిల్లా పరిధిలోనే సర్కారు దవాఖానాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్ష అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆ కలను సాకారం చేసేందుకు వైద్య

Published : 07 Dec 2021 04:28 IST

అదే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష
వైద్య కళాశాలలు, ఆసుపత్రుల నిర్మాణాల్లో నాణ్యతపై రాజీవద్దు
మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతి పేద బిడ్డకు వారి జిల్లా పరిధిలోనే సర్కారు దవాఖానాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్ష అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆ కలను సాకారం చేసేందుకు వైద్య కళాశాలలు, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను వేగవంతం చేయాలని, నాణ్యతలో రాజీ పడొద్దని ఆదేశించారు. రాష్ట్రంలో నూతన వైద్య కళాశాలలు, ఆసుపత్రుల నిర్మాణాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సోమవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘‘గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందించాలనే ఆశయంతో జిల్లాకొక వైద్యకళాశాల ఏర్పాటు చేస్తున్నాం. పల్లె దవాఖానాల ద్వారా గ్రామీణులకు ఎంబీబీఎస్‌ వైద్యుల సేవలు, వైద్య కళాశాలల ద్వారా సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందుతాయి. వరంగల్‌ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి రూ.1100 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరైన నేపథ్యంలో.. ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలి. జనవరి మొదటి వారంలో పనులు ప్రారంభించాలి. హైదరాబాద్‌ నలువైపులా (గచ్చిబౌలి, సనత్‌నగర్‌, ఎల్బీనగర్‌, అల్వాల్‌లలో) నిర్మించే నాలుగు తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) ఆసుపత్రులకు ముఖ్యమంత్రి త్వరలో శంకుస్థాపన చేస్తారు. ఒక్కొక్కటి 1000 పడకలతో నిర్మించే ఈ ఆసుపత్రుల్లో దిల్లీ ఎయిమ్స్‌ తరహాలో సేవలు ఉండాలన్నది సీఎం సంకల్పం. పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలో రూ.150 కోట్లతో 200 పడకలతో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి వెంటనే సన్నాహాలు ప్రారంభించాలి. పారిశ్రామిక ప్రాంతంలో వచ్చే వ్యాధులను గుర్తించి అందుకు అవసరమైన వైద్య విభాగాలు, నిపుణులను ఏర్పాటు చేయాలి’’ అని మంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని, రెండో డోసుపై ప్రత్యేక దృష్టిసారించాలని హరీశ్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలోని గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం, టిమ్స్‌, నిలోఫర్‌ సహా అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రూ.59.25 కోట్లతో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యాధికారులు మంత్రికి వివరించారు. సమీక్షలో పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, వాణిజ్య పన్నులశాఖ కార్యదర్శి నీతూకుమారి, డీఎంఈ రమేశ్‌రెడ్డి, కాళోజీ ఆరోగ్య వర్సిటీ ఉపకులపతి కరుణాకర్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు జి.శ్రీనివాసరావు, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి టి.గంగాధర్‌, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖరరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ గణపతిరెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని