మత్తునూ చిత్తు చేయొచ్చు

‘మత్తు’ బాధితుల్లో వయో పరిమితి లేనే లేదు.. ఆ రొంపిలో దిగి నిండుజీవితాలు నిండా మునుగుతున్నాయి. కుటుంబాల్లో కలహాలు రేగుతున్నాయి.

Published : 07 Dec 2021 04:51 IST

బాధితుల చికిత్సకు మార్గాలున్నాయ్‌
అన్ని జిల్లాల్లో అందుబాటులో డీఎడిక్షన్‌ కేంద్రాలు
వ్యసనాన్ని ముందే గుర్తించి మేలుకోవాలి అంటున్న నిపుణులు

‘మత్తు’ బాధితుల్లో వయో పరిమితి లేనే లేదు.. ఆ రొంపిలో దిగి నిండుజీవితాలు నిండా మునుగుతున్నాయి. కుటుంబాల్లో కలహాలు రేగుతున్నాయి. మద్యం, గంజాయి, వైట్‌నర్‌, గమ్‌ తదితరాలకు బానిసలైన కారణంగా.. విద్యార్థుల చదువులతో పాటు ఆరోగ్యాలూ దెబ్బతింటున్నాయి. చాప కింది నీరులా విస్తరిస్తోన్న ఈ సమస్యకు పరిష్కారం చూపుతున్నాయి డీఎడిక్షన్‌ కేంద్రాలు.. మత్తు బాధితులను ఆదుకునేందుకు, ఆసరాగా నిలిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇవి అందుబాటులో ఉన్నాయి.. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కొనసాగుతోన్న ఈ కేంద్రాల్లో రోజుకి 5-10 మంది చొప్పున ఓపీ చికిత్స చేస్తున్నారు. చేయాల్సిందల్లా తల్లిదండ్రులు లేదా పెద్దలు మేల్కొనడం.. పిల్లల్లో వ్యసనాన్ని ముందుగానే గుర్తించటం.. బాధితులను వీలైనంత తొందరగా ఆయా కేంద్రాలకు తరలించి, చికిత్స చేయించటం.. అంటూ హితవు పలుకుతున్నారు నిపుణులు.

చికిత్స ఎలా సాగుతుంది..?

మత్తుకు బానిసలైనవారిని చికిత్స కేంద్రాలకు తీసుకురావటం కత్తి మీది సామే.. కుటుంబసభ్యులు నచ్చజెప్పి ఆ పని చేయాలి. అలా వచ్చే బాధితులకు 1-3 నెలల చికిత్సలో తొలుత వైద్యపరీక్షలు చేస్తారు. హిమోగ్లోబిన్‌ శాతం, కాలేయం, మూత్రపిండాల పనితీరు, మానసిక స్థితి పరిశీలిస్తారు. క్షయ, కామెర్లు సోకాయేమో పరీక్షిస్తారు.. అనంతరం 3-4 రోజులు సోషల్‌వర్కర్లు, సైకియాట్రిస్టులు, వైద్యులు కౌన్సెలింగ్‌ ఇస్తారు. ఒక్కసారిగా మత్తు అలవాటు మాన్పించడంతో చేతులు వణకడం, కోపతాపాలు ప్రదర్శించటంతో పాటు బాధితులు వింతగా ప్రవర్తిస్తారు. ఈ సమయంలో వైద్యుల పర్యవేక్షణలో వారికి యాంటీ టాక్సిఫికేషన్‌ మందుల్ని అందిస్తారు. పదిరోజుల ఈ కోర్సు పూర్తయ్యాక బాధితులు, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇస్తారు. చికిత్స అనంతరం వారానికి రెండు, మూడుసార్లు ఫోన్లో వారితో మాట్లాడుతూ అవసరమైన సూచనలు చేస్తారు.

మత్తు వీడాలంటూ గ్రామాల్లో నిర్వహిస్తున్న అవగాహన సదస్సు

కుటుంబ సభ్యులే కీలకం..

మత్తు బారిన పడినవారిలో మార్పు తెచ్చేలా తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు మసలాలి. గత విషయాలు గుర్తుచేయకుండా, సూటిపోటి మాటలనకుండా కొత్త జీవితం దిశగా వారిని మళ్లించాలి. చెడు స్నేహితుల్ని దూరం పెట్టాలి. ఫోన్‌లో వారి నంబర్లు తొలగించాలి. పశ్చాత్తాపంతో జనజీవనంలోకి రావాలనుకునే బాధితులను అన్ని విధాలా ఆదరించాలి.

మరిన్ని చికిత్స కేంద్రాలు అవసరం..

చికిత్స, పునరావాసం కోసం కేంద్ర సామాజిక మంత్రిత్వశాఖ నిజామాబాద్‌ మినహా ఉమ్మడి జిల్లాల్లో తొమ్మిది పునరావాస చికిత్స కేంద్రాలు ఏర్పాటుచేసింది. ఈ కేంద్రాల్లో ఉచిత చికిత్స లభిస్తోంది. ప్రస్తుతం మత్తు బానిసలు పెరుగుతున్నందున వీటి సంఖ్యనూ పెంచాల్సిన అవసరముంది. గాంధీ, ఎర్రగడ్డ మానసిక వైద్యాలయాల్లోనూ ఈ చికిత్స లభిస్తోంది.  

గైర్హాజరు, అత్తెసరు మార్కులతో గుట్టురట్టు..

పిల్లలు మత్తుకు అలవాటైన విషయాన్ని తల్లిదండ్రులు ఆదిలోనే గుర్తించలేకపోతున్నారు. తరగతులకు డుమ్మాలు కొట్టడం, మార్కులు తక్కువ రావటం, సబ్జెక్టుల్లో తప్పడంతో విద్యాసంస్థల నుంచి హెచ్చరిక వచ్చాకే ఎక్కువ కేసుల్లో అసలు విషయం వారికి తెలుస్తోంది. ‘‘మా వద్దకు వస్తున్న కేసుల్లో 80 శాతం ఇలాంటివే. తల్లిదండ్రులు మొదట్లోనే సరైన చికిత్స, కౌన్సెలింగ్‌ ఇప్పిస్తే పిల్లలు కోలుకునే వీలుంటుంది’’ అని న్యూహోప్‌ అసోసియేషన్‌ ప్రతినిధి డి.కోమలి కృష్ణారెడ్డి తెలిపారు.

మత్తును వదిలి.. బాధితులకు బాసటగా

అతడో ప్రభుత్వోద్యోగి. మత్తుకు బానిసై అనుచిత ప్రవర్తనతో సస్పెన్షన్‌ వేటుకు గురయ్యాడు. బంధువులు, కుటుంబసభ్యులు దూరమయ్యారు. మత్తులో ఓరోజు ఆత్మహత్యకు యత్నించినా బతికి బయటపడ్డాడు. పునరావాస కేంద్రంలో చేర్చడంతో సాధారణ స్థితికి వచ్చాడు. ఇప్పుడు కుటుంబంతో హాయిగా ఉన్నాడు. ఎవరైనా మద్యం, మత్తుకు బానిసైతే తానే కౌన్సెలింగ్‌ ఇస్తున్నాడు.

పేరు కూడా మరచిపోయి...

నగరానికి చెందిన 27 ఏళ్ల యువకుడికి మద్యం, గంజాయి అలవాటైంది. కళాశాలకు డుమ్మా కొట్టేవాడు. గ్యాంగులతో తిరుగుతూ గంజాయి తీసుకునేవాడు. అది శ్రుతిమించి మెదడు మొద్దుబారింది. చివరకు పేరు కూడా గుర్తులేకుండా పోయింది. ఓరోజు పోలీసులకు పట్టుబడగా, తెలిసినవారు విడిపించి పునరావాస కేంద్రంలో చేర్చారు. మూడునెలలుగా చికిత్సతో ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటున్నాడు.

పీడించే స్థితి నుంచి ఇంటికి ఆసరాగా నిలిచి..

21 ఏళ్ల యువకుడు గంజాయికి బానిసయ్యాడు. తండ్రి లేడు.. తల్లే పిల్లల్ని పోషిస్తోంది. కుర్రాడు రోజూ రాత్రి మత్తులో ఇంటికొచ్చేవాడు. తల్లిని కొట్టి ఉన్న సొమ్మంతా గుంజుకెళ్లేవాడు. భరించలేని తల్లి పోలీసుల్ని ఆశ్రయించింది. ధూల్‌పేట ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సదరు యువకుణ్ని పునరావాస చికిత్స కేంద్రానికి పంపించారు. ఆర్నెల్ల తరువాత అతనిలో మార్పొచ్చింది. ఇపుడు ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా నిలిచాడు.

కేంద్ర సామాజిక న్యాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల(ఎన్జీవోల) ఆధ్వర్యంలో డీఎడిక్షన్‌ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో బాధితులకు ఉచిత చికిత్స, వసతి, భోజన సౌకర్యాలు లభిస్తున్నాయి. ఒక్కో కేంద్రంలో 15 పడకలు అందుబాటులో ఉన్నాయి. బాధితుల సంఖ్య పెరుగుతున్నందున కొత్త జిల్లాల్లో ఈ కేంద్రాల మంజూరుకు రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపాలి. అలా చేయకపోవడంతో వాటి ఏర్పాటు నిలిచిపోయింది.

గ్రూపులతో మాఫియా దందా..

యువతకు మత్తుమందులు చేరవేసేందుకు మాఫియా వాట్సాప్‌ గ్రూపులు నిర్వహిస్తోంది. ‘‘గంజాయికి బానిసైన వ్యక్తుల ఫోన్లోని కాంటాక్టులను తీసుకుని వారిపై నిఘా పెడుతున్నాం. ఇతర రాష్ట్రాల వారుంటే అక్కడి పోలీస్‌ స్టేషన్లకు సమాచారమిస్తున్నాం’’ అని ఎక్సైజ్‌ అధికారులు చెప్తున్నారు. ‘‘మత్తు పదార్థాలు సొంతగా ఎవరూ అలవాటు చేసుకోరు. ఒక్కసారి రుచిచూడంటూ స్నేహితులు బలవంతపెట్టడంతో అవి అలవాటవుతాయి. తల్లిదండ్రులు పిల్లలకు సమయానికి కడుపు నిండా ఆహారం పెడితే ఇతర దురలవాట్లు దరిచేరవు’’ అని డోవ్‌ సంస్థ ప్రతినిధి త్యాగరాజులు పేర్కొన్నారు. ‘‘బాణామతి, దయ్యం పట్టిందంటూ చేసే క్షుద్ర చికిత్సలు, నాటుమందుల కారణంగా ఆరోగ్యం పాడవుతుంది.. వైద్యులు, సైకియాట్రిస్టు, కౌన్సెలర్ల సమక్షంలో చికిత్స తీసుకుంటే బాధితులు వేగంగా కోలుకుంటారు’’ అని చికిత్స కేంద్రం కౌన్సెలర్‌ ధనలక్ష్మి వివరించారు.

ఎన్జీవోల అధ్వర్యంలోని డీఎడిక్షన్‌ కేంద్రాలు.. ఫోన్‌ నంబర్లు
మత్తునూ చిత్తు చేయొచ్చుడోవ్‌ సంస్థ(94404-18424): తాండూరు (99890-09062), ఆదిలాబాద్‌ (98488-53333), ఆమన్‌గల్‌ (9640560328)
న్యూహోప్‌ అసోసియేషన్‌ (99667-11196): హైదరాబాద్‌, నల్గొండ (చిట్యాల)
విజన్‌ (99084-68003): మెదక్‌ (నర్సాపూర్‌)
సంకల్ప్‌ (98485-19555): రంగారెడ్డి (కొత్తూరు)
హెల్పింగ్‌హ్యాండ్‌ సొసైటీ: శ్రీధర్‌ కాంప్లెక్సు, హౌసింగ్‌బోర్డు కాలనీ, హనుమకొండ
షేర్‌ ఎన్జీవో: బంజారా కాలనీ, మధిర, ఖమ్మం
ప్రకృతి సొసైటీ: అశోక్‌నగర్‌, కరీంనగర్‌

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని