
ఈ చేప వయసు 90 ఏళ్లు.. అత్యంత ఎక్కువ వయసున్న అక్వేరియం జీవి ఇదే
శాన్ ఫ్రాన్సిస్కో: మెతుసెలా అనే వ్యక్తి 969 సంవత్సరాలు బతికారని బైబిల్లో ఉంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని అక్వేరియంలో మెతుసెలా పేరుతో ఉన్న చేప అంత సుదీర్ఘంగా కాకపోయినా.. తొమ్మిది దశాబ్దాల నుంచి జీవిస్తోంది. ప్రపంచంలోనే అధిక వయసు ఉన్న అక్వేరియం చేప ఇదేనని చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మెతుసెలా పొడవు 4 అడుగులు, బరువు 40 పౌండ్లు. లంగ్ ఫిష్ జాతికి చెందిన దీన్ని 1938లో ఆస్ట్రేలియా నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు తీసుకొచ్చారు. అప్పటికి దీని వయసు ఆరేళ్లని ఓ అంచనా. దీనికి ముందు మరో ఆస్ట్రేలియన్ లంగ్ఫిష్ చికాగోలోని షెడ్ అక్వేరియంలో జీవించి ఉండేది. అది 95ఏళ్ల వయసులో 2017లో చనిపోయింది. దీంతో మెతుసెలాయే ప్రస్తుతం జీవించి ఉన్న అక్వేరియం చేపల్లో వయసు పరంగా అతి పెద్దది. ఇది ఆడ చేప అని సంరక్షకులు భావిస్తున్నారు. అయితే ఇలాంటి చేపలకు లింగనిర్ధారణ పరీక్షలు చేయకుండా ఓ అంచనాకు రావడం కష్టం. అందుకే దీని మొప్పలను పరీక్షకు పంపి, లింగం, వయసుపై కచ్చితమైన అంచనాకు రావాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ‘‘దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. దీనికి ఫిగ్స్ (అంజీర) అంటే ఇష్టం. నిల్వ ఉంచినవి తినదు. తాజాగా ఉండాలి. పెద్దగా అల్లరీ చేయదు. ఎక్కువ సమయం ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటుంది’’ అని దీన్ని సంరక్షిస్తున్న సిబ్బంది చెబుతున్నారు. ఆస్ట్రేలియాలో అంతరించిపోతున్న ప్రాణుల జాబితాలో ఈ లంగ్ ఫిష్ జాతి చేపలు ఉన్నాయి. మెతుసెలా చనిపోతే మరోటి తీసుకురావడం కష్టమని అందుకే దీన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నామని కాలిఫోర్నియా అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.