Govt Schools: పిల్లల ‘పాట్ల’శాల

ఏటా సర్కారు బడుల నుంచి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లేవారే తప్ప అక్కడి నుంచి ప్రభుత్వ బడులకు వచ్చేవారు ఉండరు. కానీ గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడుల్లో పెద్దఎత్తున విద్యార్థులు చేరారు. కరోనా మహమ్మారితో ఆర్థిక పరిస్థితులు తారుమారయ్యాయి.

Updated : 06 Dec 2021 04:57 IST

సర్కారు బడుల్లో భారీగా పెరిగిన విద్యార్థుల సంఖ్య
తీవ్రమైన గదుల కొరత... వరండాల్లో, ఆరుబయటా పాఠాలు
అధ్వానంగా శౌచాలయాలు

పరదా పట్టాపై కూర్చొని చదువుకోవాల్సిన దుస్థితి మెదక్‌ జిల్లా నార్సింగి మండలం శేర్‌పల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులది. ఇక్కడ హైస్కూల్‌కు నాలుగు గదుల నిర్మాణం కోసం 2019 అక్టోబరులో శంకుస్థాపన జరిగింది. రెండేళ్లు దాటినా నిర్మాణం పూర్తికాలేదు. ఆ నాలుగు గదుల్లోనూ ఇలాగే తరగతులు నిర్వహిస్తున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌: ఏటా సర్కారు బడుల నుంచి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లేవారే తప్ప అక్కడి నుంచి ప్రభుత్వ బడులకు వచ్చేవారు ఉండరు. కానీ గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడుల్లో పెద్దఎత్తున విద్యార్థులు చేరారు. కరోనా మహమ్మారితో ఆర్థిక పరిస్థితులు తారుమారయ్యాయి. ప్రైవేట్‌ పాఠశాలల్లో తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేని పరిస్థితుల్లో ఏకంగా 2.50 లక్షల మందికిపైగా పిల్లలు సర్కారు బడి బాట పట్టారు. దీంతో కొన్నేళ్లుగా పిల్లలు రాక మూతబడి ఉన్న 300 బడులు మళ్లీ తెరుచుకున్నాయి. ఈ పరిస్థితుల్లో సర్కారు స్కూళ్లలో కనీస సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం చకచకా పనులు మొదలుపెట్టాలి. తల్లిదండ్రుల విశ్వాసాన్ని చూరగొనేందుకు ప్రయత్నించాలి. కానీ విద్యాశాఖలో ఆ దిశగా కదిలికే లేదు. దీంతో పిల్లలకు కనీసం వసతులూ కరవయ్యాయి. గదుల కొరత తీవ్రమవడంతో వరండాల్లో...చెట్ల కింద...మెట్ల వద్ద... ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చొని చదువుకోవాల్సిన దుస్థితి. కొన్ని చోట్లయితే కూలేందుకు సిద్ధంగా ఉన్న గదుల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక శౌచాలయాలు ఉన్నా లేనట్లే. నిర్వహణ లేక... నీళ్లు రాక... దగ్గరకు వెళితే కళ్లు తిరిగి పడిపోవాల్సిందే అన్నట్లున్నాయి. మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో ‘ఈనాడు’ పలు పాఠశాలలను పరిశీలించగా వసతుల కొరత కొట్టొచ్చినట్లు కనిపించింది.

మెదక్‌ జిల్లా మాసాయిపేట ప్రాథమిక పాఠశాలలో గదిలో ఒక సెక్షన్‌...వరండాలో మరో సెక్షన్‌ విద్యార్థులు


చెట్లకింద బల్ల వేసుకొని కూర్చొన్న ఈయన పేరు రంగయ్య. ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలం సావర్‌ఖేడ్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ఇక్కడ 260 మంది విద్యార్థులుండగా కేవలం అయిదు తరగతి గదులే ఉన్నాయి. మరో అయిదు గదులు అవసరం. ఇప్పటికే వరండాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. తనకు ప్రత్యేక గది లేకపోవడంతో రంగయ్య రోజూ చెట్టు కిందే కూర్చుంటున్నారు.


హబూబాబాద్‌ జిల్లా కంబాలపల్లి ప్రాథమిక పాఠశాలలో ఈసారి 50 మంది పెరిగి విద్యార్థుల సంఖ్య 169కి చేరింది. ఇక్కడ రెండే గదులున్నాయి. దాంతో వరండాలతోపాటు చెట్ల కింద పిల్లల్ని కూర్చోబెట్టి బడి గోడకు బోర్డు తగిలించి చదువు చెబుతున్నారు.

శేర్‌పల్లి హైస్కూల్‌లో పైకప్పు లేని శౌచాలయాలు. బాలికలు మూత్ర విసర్జనకు వచ్చినప్పుడు మగపిల్లలు అటు రాకుండా కాపలాగా ఉన్న ఉపాధ్యాయురాలు


మౌలిక వసతులు ఎప్పుడు?

రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 26,285 పాఠశాలలున్నాయి. వాటిల్లో 22.62 లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు.  బడుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ఏటా రూ.2 వేల కోట్ల చొప్పున రెండేళ్లపాటు ఖర్చు చేస్తామని గత మార్చి బడ్జెట్‌ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు ఆ పథకం మార్గదర్శకాలు కూడా విడుదల కాలేదు. రాష్ట్రంలో 3,634 పాఠశాలకు రూ.109కోట్లతో మెరుగులు దిద్దేందుకు సమగ్ర శిక్షా అభియాన్‌ కింద రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిపాదనలు పంపింది. అందుకు అయ్యే ఖర్చులో రూ.60 శాతం తాము ఇస్తామని కేంద్రం అంగీకరించింది. ఇప్పటివరకు అతీగతీ లేదు.


ఇదీ దుస్థితి...

ది మెదక్‌ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల. కొత్తగా 150 మంది చేరడంతో ఇక్కడ విద్యార్థుల సంఖ్య 322కి చేరింది. 2, 3, 4 తరగతులను రెండేసి సెక్షన్లుగా చేశారు. తరగతి గదులు లేకపోవడంతో ఒక సెక్షన్‌ వారిని గదిలో, మరో సెక్షన్‌ను వరండాలో కూర్చోబెట్టి చదువు చెబుతున్నారు. పక్కనే ఉన్న హైస్కూల్‌లో ఈ ఏడాది 100 మంది కొత్తగా చేరారు. ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితిలో ఉన్న గదుల్లో తరగతులను నడుపుతున్నారు.

మాసాయిపేట హైస్కూల్‌లో శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం


సార్‌... అర్థమవుతోందా?

* 2018-19 లెక్కల ప్రకారమే రాష్ట్రంలో ఇంకా 9,997 అదనపు తరగతి గదుల కొరత ఉంది. దాదాపు 9 వేల శౌచాలయాలు నిర్మించాలి.  8,725 పాఠశాలలకు ప్రహరీలు లేవు. ఇప్పుడా సంఖ్య మరో 50 శాతం పెరుగుతుందని అంచనా.

* 2019-20లో కేంద్ర విద్యాశాఖ పాఠశాలల పనితీరు సూచిక ప్రకారం మౌలిక సదుపాయాల్లో రాష్ట్రం 21వ స్థానంలో ఉంది.

* రాష్ట్ర ఆవిర్భావ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 10.89 శాతం కేటాయించగా...ఇప్పుడు అది 6.79 శాతానికి తగ్గింది.


2019-20 యూడైస్‌ ప్రకారం ఇదీ పరిస్థితి

* మరుగుదొడ్లు : 82.67 శాతం బాలురు, 91 శాతం బాలికలవి పనిచేస్తున్నాయి.

* కంప్యూటర్‌  :  23.93 శాతం బడుల్లో లేవు

* అంతర్జాలం : 8 శాతం బడుల్లోనే సౌకర్యం ఉంది

* విద్యుత్తు :  6 శాతం స్కూళ్లలో లేదు. వాస్తవానికి పనిచేసేది 89.43 శాతం పాఠశాలల్లోనే.

* తాగునీరు  :  30,001 బడుల్లో 26,935 చోట్లే అందుబాటులో ఉంది.


అన్నీ అధ్వానమే...

క్కడ 1-10 తరగతులు నడుస్తాయి. విద్యార్థులు 337 మంది ఉన్నారు. వారిలో ఈసారి కొత్తగా 47 మంది చేరారు. వారికి తగ్గట్లు గదులు లేవు. ప్రహరీ అధ్వానంగా ఉంది. కనీసం గేటు కూడా లేదు. హైస్కూల్‌ విద్యార్థులకు కూడా ఎస్‌జీటీలే చదువు చెప్పాల్సిన దుస్థితి. అయిదుగురు సబ్జెక్టు ఉపాధ్యాయులను వెంటనే కేటాయించాలి.

- నర్సా రమేష్‌, విద్యా కమిటీ ఛైర్మన్‌ శాలిపేట, చినశంకరంపేట మండలం మెదక్‌ జిల్లా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని