TS News: ఒక్క గుంట భూమినీ కబ్జా చేయలేదు

తాము గుంట భూమిని కూడా కబ్జా చేయలేదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సతీమణి జమున తెలిపారు. జమునా హేచరీస్‌ పేరుతో కొనుగోలు చేసిన భూములు పూర్తిగా నిబంధనలకు లోబడి, ధరణి ప్రకారమే రిజిస్ట్రేషన్‌

Updated : 07 Dec 2021 05:00 IST

ధరణి ప్రకారమే కొనుగోలు చేశాం
ఈటల జమున వెల్లడి

పూడూరు (మేడ్చల్‌ రూరల్‌): తాము గుంట భూమిని కూడా కబ్జా చేయలేదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సతీమణి జమున తెలిపారు. జమునా హేచరీస్‌ పేరుతో కొనుగోలు చేసిన భూములు పూర్తిగా నిబంధనలకు లోబడి, ధరణి ప్రకారమే రిజిస్ట్రేషన్‌ జరిగాయని స్పష్టం చేశారు. మెదక్‌ కలెక్టర్‌ హరీశ్‌ చేసిన కబ్జా వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. సోమవారం ఆమె మేడ్చల్‌ మండలం పూడూరు శివారులోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘సర్వే నంబరు 81లో 5.36 ఎకరాలు, 130లో 3 ఎకరాలు న్యాయబద్ధంగా కొనుగోలు చేసి ధరణి ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాం. వాటిల్లోనే షెడ్లు నిర్మించుకున్నాం. దీనిని ప్రభుత్వ భూమిగా చూపించడం ఏంటి? రెండు సర్వే నంబర్లలో 60 ఎకరాలు మాత్రమే ఉండగా 70 ఎకరాలు కబ్జా చేశామనడం హాస్యాస్పదం. ప్రెస్‌ మీట్‌ పెట్టి తాము 70 ఎకరాలు కబ్జా చేశామని చెప్పే అధికారాన్ని కలెక్టర్‌కి ఎవరిచ్చారు? ఇతర పౌల్ట్రీ ఫామ్‌లకు అవసరం లేని అనుమతులు మా పౌల్ట్రీలకే ఎందుకు? పౌల్ట్రీ ద్వారా వచ్చే ఎరువుతో జలాలు కలుషితమయ్యాయనడం ఏంటి? కలెక్టర్‌పై కేసు పెడతాం’’ అని జమున పేర్కొన్నారు.


కబ్జాపై మతిలేని ఆరోపణలు: ఈటల

ఈనాడు, సంగారెడ్డి: తాను ఎసైన్డ్‌ భూములు కబ్జా చేశాననడం మతిలేని ఆరోపణ అని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. సోమవారం సంగారెడ్డిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘మావి తొండలు గుడ్లు పెట్టని భూములు. నేను బెదిరించానని అంటున్నారు. నా స్థాయికే అలా చేసి ఉంటే... మరి కేసీఆర్‌ ఎందరిని భయపెట్టించి ఉంటారు? తాము ఒక్క ఎకరా కబ్జా చేసినట్లు తేలినా ముక్కు నేలకు రాస్తామని ఇప్పటికే నా భార్య స్పష్టం చేసింది’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని